
జనం ఉప్పెనలా పోటెత్తారు. జననేతకు అన్యాయం జరుగుతోందంటూ నినదించారు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా తమ మద్దతు జగనన్నకే నంటూ ఎలుగెత్తి చాటారు. ఊరూ వాడ ఏకమై విజయమ్మ, షర్మిల రోడ్ షోలకు కనుచూపు మేర తరలివచ్చిన జనంతో అనంతపురం, రాయదుర్గం రహదారులు కిక్కిరిశాయి.
అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల పూరించిన ప్రచారభేరి.. కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో కలకలం రేపింది. వైఎస్ విజయమ్మ, షర్మిల నిర్వహించిన రోడ్‌షోలకు రికార్డు స్థాయిలో జనం కదలిరావడం ప్రత్యర్థి పార్టీలను నైతికంగా దెబ్బతీసింది. రోడ్‌షోలకు హాజరైన వారిలో అధిక శాతం మహిళలు, యువకులు ఉండటం.. వారు ప్రచార రథం వెంట పరుగులు తీయడం.. అభిప్రాయ నిర్ణేతలైన యువత, మహిళలు ఎటు వైపు ఉంటే అటు వైపే విజయం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చేస్తోన్న విశ్లేషణలు ప్రత్యర్థి పార్టీల దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ నుంచి ముదిగుబ్బ, బత్తలపల్లి మీదుగా ఉదయం 11.20 గంటలకు ఎస్కేయూ వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎస్కేయూ నుంచి కలెక్టరేట్‌కు 11.40కు విజయమ్మ కాన్వాయ్ చేరుకుంది. అప్పటికే కలెక్టరేట్ ప్రాంతం జనసంద్రమైంది. కలెక్టరేట్ నుంచి సంగమేష్ సర్కిల్, పవర్ ఆఫీసు మీదుగా తాడిపత్రి బస్టాండ్‌కు రోడ్‌షో నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి తాడిపత్రి బస్టాండు వరకు ఒకట్నిర కిలోమీటర్ దూరం ఆ రోడ్దంతా జనంతో నిండిపోయింది.
విజయమ్మ, షర్మిల, అభ్యర్థి గురునాథరెడ్డి ఉన్న ప్రచారరథంపైకి గాంధీబజార్ చౌరస్తా నుంచి తాడిపత్రి బస్టాండ్ వరకు ముస్లిం మహిళలు, వైశ్యులు పూలవర్షం కురిపించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాడిపత్రి బస్టాండ్‌లో కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై జగనన్నను వేధిస్తున్నాయంటూ విజయమ్మ ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతూ షర్మిల చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. రెండున్నరేళ్లుగా జగన్‌ను కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ వేధిస్తోండటాన్ని వివరిస్తూ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుట్రలు మీ ప్రేమ ముందు కొట్టుకుపోతాయ్ అంటూ విజయమ్మ అన్నప్పుడు జనం పెద్ద ఎత్తున స్పందించారు. తాడిపత్రి బస్టాండ్ సభ ముగిసిన తర్వాత నీలం థియేటర్, సూర్యానగర్ 80 ఫీట్ రోడ్డు, సాయినగర్, అంబేద్కర్ భవన్ మీదుగా మున్సిపల్ కార్యాలయం(సప్తగిరి) సర్కిల్‌కు చేరుకున్నారు. సప్తగిరి సర్కిల్‌లో వేలాది మంది ప్రజలు విజయమ్మ అక్కడికి చేరుకోగానే కేరింతలు కొట్టారు. సప్తగిరి సర్కిల్ సభ పూర్తయిన తర్వాత విజయమ్మ, షర్మిల నేరుగా చవ్వా రాజశేఖరరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురునాథరెడ్డి ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న వారు ఆ తర్వాత.. రాయదుర్గం నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లారు.
ఉప్పొంగిన రాయదుర్గం..
షెడ్యూల్ సమయంకన్నా 2.30 గంటలు ఆలస్యంగా వైఎస్ విజయమ్మ, షర్మిల రాయదుర్గం పట్టణానికి చేరుకున్నారు. పట్టణ శివారు నుంచి వినాయక్ సర్కిల్ వరకు జనం బారులు తీరారు. అడుగడుగునా వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఉన్న ప్రచారరథంపై ప్రజలు బంతిపూల వర్షం కురిపించారు. వినాయక్ సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోకు రికార్డుస్థాయిలో జనం హాజరయ్యారు. మూడు రోడ్ల కూడలి అయిన వినాయక్ సర్కిల్‌లో కనుచూపు మేర వరకు జనమే కన్పించారు. రాయదుర్గం చరిత్రలో ఏ నేత సభకు హాజరుకాని రీతిలో వైఎస్ విజయమ్మ, షర్మిల రోడ్‌షోకు జనం కదలి వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై ఆడుతోన్న ఆటలను వివరిస్తూ విజయమ్మ, షర్మిల చేసిన ప్రసంగాలకు జనం నుంచి విశేష స్పందన లభించింది.
రాయదుర్గం పట్టణంలో రోడ్‌షో ముగించుకుని పల్లేపల్లికి చేరుకున్నారు. అప్పటికే ఆ పల్లె జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి సొంతూరైన పల్లేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతల హెచ్చరికలను ఖాతరు చేయకుండా జనం విజయమ్మ రోడ్‌షోకు తరలివచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నిలుస్తామని పల్లేపల్లి ప్రజలు నినదించారు. అక్కడి నుంచి మెచ్చిరి మీదుగా డీహీరేహాళ్‌కు చేరుకున్నారు. మండల కేంద్రమైన డీ హీరేహాళ్‌లో విజయమ్మ, షర్మిలకు జనం నీరాజనాలు పలికారు. డీ హీరేహాళ్‌లో ప్రచారాన్ని ముగించారు.
కాంగ్రెస్, టీడీపీల్లో ఆందోళన..
కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అగ్రనేతలు కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవి, చంద్రబాబునాయుడు అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు జనం నుంచి పెద్దగా స్పందన లభించలేదు. అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం నిర్వహించిన రోడ్‌షో జనస్పందన లేక తుస్సుమంది.
కానీ.. గత నెలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పుడు వైఎస్ విజయమ్మ, షర్మిల నిర్వహించిన రోడ్‌షోలకు జనం పోటెత్తడంతో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు పూర్తిగా డీలా పడ్డారు. వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్‌షోలకు.. విజయమ్మ, షర్మిల నిర్వహించిన రోడ్‌షోలకు మహిళలు, యువకులు, వృద్ధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యువకులు, మహిళలను రాజకీయ పరిశీలకులు అభిప్రాయ నిర్ణేతలుగా అభివర్ణిస్తారు. సాధారణంగా యువకులు, మహిళలే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు. మహిళలు, యువకులు ఏ వైపు ఉంటే.. అటు వైపు విజయం ఉంటుంది. ఉప ఎన్నికల్లో మహిళలు, యువకులు వైఎస్సార్‌సీపీ వైపు నిలవడం వల్ల ఫలితం కూడా అటు వైపే ఉంటుందని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు.
No comments:
Post a Comment