- కనుచూపు మేర ప్రజలతో నిండిన రహదారులు - తల్లీ కూతుళ్లకు తిరుపతిలో అపూర్వ ఆదరణ - మీకు అండగా మేమున్నామని ధైర్యం చెప్పిన జనం - విజయమ్మ కంటతడితో కన్నీళ్లు పెట్టిన మహిళలు వైఎస్‌ను తలపించిన షర్మిల - అనూహ్య స్పందనతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తిరుపతి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉప ఎన్నికల్లో తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆమె కుమార్తె షర్మిలతో కలిసి ఆదివారం ప్రచారం నిర్వహించారు. లీలామహల్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. జోహార్ వైఎస్‌ఆర్.. జై జగన్ అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. తిరుపతి - న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల ఆదివారం తిరుపతిలో జరిపిన ఎన్నికల పర్యటన అనూహ్య రీతిలో విజయవంతమైంది. పార్టీ నాయకత్వం అంచనాలను సైతం తలకిందులు చేస్తూ వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీ వర్గాలకు కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. తల్లీ కూతుళ్లు చేసిన ప్రసంగాలు, వారు ప్రజలను న్యాయం అడిగిన తీరు, వీటికి ప్రజలు స్పందించిన పరిణమాలు ఇతర పార్టీలకు కంగారు పుట్టించాయి. వీరి ప్రచారం తమ ఓట్లకు గండి కొడుతుందనే భయంతో ఇతర పార్టీల అభ్యర్థులు నష్ట నివారణ చర్యల వైపు చూస్తున్నారు. తిరుపతి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ ఓటర్ల మీద వెయ్యి రూపాయల నోట్ల వర్షం కురిపిస్తోంది. తామేమీ తక్కువ తినలేదనే రీతిలో ప్రధాన ప్రతిపక్షం కూడా రూ.500 నోట్లతో ఓట్లు కొనేందుకు తెగబడింది. జనం మీదకు కోట్ల కట్టలు విసరడంతో పరిస్థితి తమకే అనుకూలంగా ఉంటుందని రెండు పార్టీలు అంచనా వేశాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా జనంలో వ్యక్తమైన ఆగ్రహాన్ని నోట్ల తాయిలాలతో చల్లార్చగలిగామని రెండు పార్టీలు సంతోషపడ్డాయి. అయితే ఆదివారం సాయంత్రం లీలామహల్ జంక్షన్‌లో జరిగిన విజయమ్మ, షర్మిల సభకు జనం ఊహించని రీతిలో హాజరు కావడంతో ఈ రెండు పార్టీలకు దిమ్మ తిరిగింది. మధ్యాహ్నం 3-30 గంటలకు సభ ప్రారంభం అవుతుందని తెలిసినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిని, కూతురిని చూడటానికి మధ్యాహ్నం 1-30 గంటల నుంచే జనం లీలామహల్ జంక్షన్‌కు చేరుకున్నారు. 2-30 గంటల సమయానికి సర్కిల్‌కు నాలుగువైపులా కనుచూపు మేర జన ప్రవాహం చేరింది. 3-30 గంటలకు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల కరకంబాడి మార్గంలో ప్రచార రథం మీద నుంచి చెయ్యి ఊపుతూ జనంలోకి రావడంతోనే జనం జయ జయ ధ్వానాలు, హర్షాతిరేకాలతో వారికి అపూర్వ స్వాగతం పలికారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారు. వృద్ధులు, యువతులు వేల సంఖ్యలో సభకు హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆశ్చర్యం కలిగించింది. జంక్షన్ చుట్టూ ఉన్న మిద్దెల మీద నుంచి పెద్ద సంఖ్యలో జనం వీరిని పూలతో స్వాగతించారు. సుమారు గంటన్నర పాటు సాగిన సభలో అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, షర్మిల, విజయమ్మ ప్రసంగాలు ముగిసే వరకు జనం పక్కకు జరక్కుండా ఆసక్తిగా వీరి ప్రసంగాలను విని అందుకు తగ్గట్లుగా స్పందించారు. కరకంబాడీ మార్గంలో పూర్‌హోందాకా, ఆర్టీసీ బస్టాండు మార్గంలో టీఎంఆర్ కల్యాణ మండపం వరకు, దేవేంద్ర థియేటర్ మార్గంలో ఆ థియేటర్ వరకు వేలాది మంది జనం రోడ్ల మీద నిలబడ్డారు. విజయమ్మ కన్నీళ్లు ‘మా పెళ్లయిన కొత్తలో ఆయన హౌస్ సర్జన్ చేసేటప్పుడు సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నాం. ఆ రోజుల్లో హాయిగా ఉండేవాళ్లం. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన (వైఎస్) ఇక్కడికే వస్తూ ఇంక వెనక్కురాలేదు’ అంటూ విజయమ్మ తన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. ఈ ఊరికి ఈ రకంగా రావాల్సి వస్తుందని అనుకోలేదు. అంటూ కంట తడిపెట్టారు. హృదయంలోంచి తన్నుకొస్తున్న విజయమ్మ బాధను చూసిన అనేక మంది జనం కూడా కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈ పాడు నాయాల్లకు ఏంపోయే కాలమొచ్చింది. ఆమెను ఇట్టా ఏడిపిస్తున్నారు’ అంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. తిరుపతికి వైఎస్ మన్నవరం ప్రాజెక్టు తెచ్చారనీ, మున్సిపాలిటీని కార్పొరేషన్ చేశారనీ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ.2,220 కోట్లు మంజూరు చేయించారనీ, వెటర్నరీ వర్శిటీ, వేద విశ్వవిద్యాలయం లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆమె వివరించినపుడు జనం ఈమె ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతోందని చర్చించుకున్నారు. ఈ జిల్లాతో వైఎస్‌కు ఎంతో అనుబంధం ఉందనీ, అనేక మందిని పేరు పెట్టి పిలిచేంత అనుబంధం ఆయనకుందని విజయమ్మ తన భర్త జ్ఞాపకాలను ప్రజలకు పంచారు. ‘నాభర్తను పోగొట్టుకున్నాను. నా బిడ్డను జైల్లో పెట్టారు. విధి లేని పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చాను. మీరే న్యాయం చేయాలి’ అంటూ విజయమ్మ చేసిన అభ్యర్థన మహిళా లోకాన్ని కదిలించింది. సభకు హాజరైన వారు ‘మీకేం భయం లేదు. మేమున్నాం’అంటూ ధైర్యం చెప్పారు. అచ్చు అదే అభివాదం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ ఆయన కూతురు షర్మిల అచ్చు అదే హావభావాలతో చెయ్యి ఊపుతూ జనానికి అభివాదం చేశారు. ఆమెను చూసిన జనం రాజశేఖరరెడ్డే చెయ్యి ఊపుతూ ఉన్నట్లుందని చెప్పుకున్నారు. ‘నేను వైఎస్‌ఆర్ కూతుర్ని. నేను మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల’ అని ఆమె పరిచయం చేసుకున్నప్పుడు సభలో పెద్ద ఎత్తున నినాదాలు మారుమోగాయి. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తన కుటుంబానికి చేస్తున్న అన్యాయం, జగన్ అక్రమ అరెస్టు అంశాల గురించి షర్మిల చేసిన ప్రసంగం జనాన్ని ఆలోచింప చేసింది. కాంగ్రెస్, టీడీపీ వారు వెయ్యి రూపాయల నోట్లు పంచినా ఓట్లు మాత్రం ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఆమె చేసిన అభ్యర్థనకు ‘అట్లే అట్లే’అని జనం స్పందించారు. రోడ్ షోకు అనూహ్య స్పందన లీలామహల్ జంక్షన్ వద్ద సభ ముగిసిన అనంతరం విజయమ్మ, షర్మిల పార్టీ అభ్యర్థి కరుణాకరరెడ్డి, పార్టీ కోఆర్డినేటర్ గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రోజా, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఏఎస్ మనోహర్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పాలగిరి ప్రతాపరెడ్డి ప్రచార రథం మీద నిల్చుని పద్మావతి పురం వరకు రోడ్‌షో నిర్వహించారు. విజయమ్మ, షర్మిలను చూడటానికి జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఎదురు చూశారు. విజయమ్మ నమస్కారానికి ప్రతి నమస్కారంగా మహిళలు చెయ్యి ఊపుతూ స్పందించారు. విజయమ్మ సభకు తిరుపతి నగరంలోని నలుమూలల నుంచి జనం వేలాది మంది తరలివచ్చారు. జీవకోన, తిమ్మినాయుడుపాలెం, ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు ర్యాలీగా లీలామహల్ జంక్షన్‌కు తరలివచ్చారు. దీంతో పాటు తిరుపతి నగరంలోని అన్ని డివిజన్ల నుంచి ఆయా డివిజన్ల ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభకు తిరుపతి నియోజకవర్గానికి చెందిన సుమారు 30వేల మంది హాజరయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. అయితే ఈ వర్గాలు 20వేల దాకా సంఖ్య తగ్గించి చెప్పాయని సభకు హాజరైన వారు అభిప్రాయపడ్డారు. |
Sunday, 10 June 2012
విజయమ్మ సభకు జన ఉప్పెన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment