YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

'ఎదుగుతున్న శక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్'

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతోందన్న విషయం ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు, పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన మాట్లాడారు. ఒక లోక్‌సభ, 15 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకోవడం ఏ మాత్రం పాలపొంగు కానే కాదన్నారు. ఈ గెలుపు పాలపొంగు లాంటిదేననీ, సానుభూతి ఎప్పుడూ పని చేయదని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్‌ను అరెస్టు, విజయమ్మ కన్నీరు లేకుంటే కాంగ్రెస్‌కు ఐదారు సీట్లు వచ్చి ఉండేవని చెప్పడం కూడా పూర్తిగా అర్థరహితం అన్నారు. జగన్‌ను అరెస్టు చేయడానికి ముందే మే 1వ తేదీ ‘నీల్సన్’ సంస్థ చేసిన సర్వేలో అన్ని స్థానాలూ తమ పార్టీయే గెలుస్తుందని తేలిన విషయం గమనించాలన్నారు. ఈ సంస్థ ద్వారా కాంగ్రెస్ సర్వే నిర్వహించుకుంటూ ఉంటుందనీ ఈ నివేదిక వివరాలు తన వద్దే కాదు, రాష్ర్ట ప్రభుత్వం వద్ద కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. 

వాస్తవానికి అప్పట్లో నీల్సన్ చేసిన సర్వేలో రామచంద్రాపురం, నర్సాపురం స్థానాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందనే పేర్కొన్నారనీ, అయితే అనూహ్యమైన రీతిలో అక్కడ టీడీపీ తనను తాను బలి చేసుకుని కాంగ్రెస్‌కు ఓట్లు వేయిస్తుందని భావించలేక పోయారని ఆయన అన్నారు. 30 ఏళ్ల అనుభం ఉన్న పార్టీ, సుమారు 17 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ ఇంత దారుణంగా తన ఉనికిని కోల్పోవడం వింతగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి, కన్నీళ్లపై ఆధారపడిన పార్టీ ఎంత మాత్రం కాదనీ వాటన్నింటినీ ఎపుడో అధిగమించి ముందుకు సాగుతోందని చెప్పారు. ‘గత ఏడాది ఆగస్లు 13న ది హిందూ పత్రిక సీఎన్‌ఎన్-ఐబీఎన్, సీఎన్‌ఎన్‌బి, సీఎస్‌డీఎస్ సహకారంతో నిర్వహించిన సర్వేలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 36 శాతం, కాంగ్రెస్-పీఆర్పీకి కలిపి 32 శాతం, టీడీపీకి 24 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొంది. అన్ని పార్టీల కంటే జగన్ చాలా ముందుగా ఉన్నారని ఆ పత్రికలో రాశారు. అంతే కాదు, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీఆర్పీకి కలిపి 58 శాతం(39 ప్లస్19)గా ఉండిన ఓటర్ల మద్దతు 32 శాతానికి దిగజారిందనే విషయం కూడా హిందూ రాసింది. అదే రోజు ఇండియాటుడే పత్రిక మరికొన్ని సంస్థలతో కలిసి చేయించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 38 శాతం ఓటర్ల మద్దతు ఉందని పేర్కొన్నది.

తాజాగా ఉప ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో జగన్‌కు 49 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. అంటే ఏడాది కాలంలో తమ పార్టీ పది శాతం ఓట్లను పెంచుకుందని స్పష్టం అవుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే సానుభూతి, కన్నీరు, పాలపొంగు అని చెప్పడం అర్థరహితం’ అని ఆయన అన్నారు. ఏడాది కాలంగా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ రైతుల, చేనేత కార్మికుల, విద్యార్థుల అన్ని వర్గాల సమస్యలపై పోరాటాలు చేస్తూ వస్తున్నారనీ దాని ఫలితంగానే ప్రజల మద్దతు తమకు పెరిగిందని ఆయన అన్నారు. ఇదేదో కొత్తగా వచ్చిన ఊపు ఎంత మాత్రం కాదని సోమయాజులు తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే లగడపాటి లాంటి వారు విపరీతార్థాలు తీస్తున్నారని ఆయన అన్నారు. 

టీడీపీ విశ్లేషణ వింతగా ఉంది

ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు చాలా సహజం. అయితే ఓడిపోయిన పార్టీ గుణపాఠాలను స్వీకరించి వారిని సరైన విధంగా విశ్లేషించుకుని ముందుకు వెళితే మేలు జరుగుతుంది కానీ టీడీపీ మాత్రం ప్రజలకు అర్థం కాని రీతిలో విశ్లేషణ చేసుకుంటోందని ఆయన అన్నారు. ఈ పార్టీ ఉప ఎన్నికల్లో అధికారపక్షానికి సహకరించి మానవబాంబు, సైకిల్ బాంబులాగా తనను తాను బలి చేసుకుందని సోమయాజులు వ్యంగంగా అన్నారు. అధికారపక్షంపై అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, కానీ తనపై ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో టీడీపీ విశ్లేషించుకోలేక పోతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు తమవి కాదని టీడీపీ భాష్యం చెబుతోందనీ దీనర్థం ఏమిటని ఆయన నిలదీశారు. మీ స్థానాలు కాక పోతే ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు. 294 శాసనసభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం మీకున్నవి 85 స్థానాలు, అంటే సుమారు 210 స్థానాలు ఇపుడు మీవి కావు. మరి 2014 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఈ స్థానాలు మావి కావని చెబుతూ ఎన్నికల్లో పాల్గొంటారా? అసలు ఈ మాటలతో ప్రజలకు మీరిస్తున్న సంకేతాలు ఏమిటి?’ అని సోమయాజలు నిలదీశారు. అసలు టీడీపీపై ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో ఆ పార్టీ ఎందుకు గ్రహించలేక పోతోందో అర్ధం కావడంలదేన్నారు. 

తొమ్మిది పదేళ్లు ప్రజలు టీడీపీకి అధికారం ఇస్తే వారు చేసిందేమిటి? ఉచిత కరెంటును ఇచ్చారా? రైతులను ఆదుకున్నారా? ఒక్క పెన్షన్ ఇచ్చారా? ప్రజలకు పనికి వచ్చే పని ఒక్కటి చేశారా? మీ హయాంలో మూడేళ్ల పాటు కరువు వస్తే ఆహారధాన్యాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే చంద్రబాబు చేసిందేమిటి? కరువుతో పోరాడ్డం మానవమాత్రులతో అయ్యే పని కాదు, కానీ ఆ నాడు కేంద్రంలో తాను అత్యంత శక్తిమంతుడని చెప్పుకున్న బాబు ఏనాడైనా కరువుతో అల్లాడుతున్న రైతులకు సాయం చేయాలని కోరారా? కోరి ఉంటే వారు కాదన రు? అని సోమయాజులు అన్నారు. ప్రధాని పదవి వద్దన్నాననీ, అసలు ప్రధానిని తానే నియమించాననీ చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు ఏమీ చేయలేదన్నారు. ఆయన చేసిందంతా మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకున్నారన్నారు. అసలు టీడీపీ ప్రచారమే లోపంగా ఉందని ఆయన అన్నారు. కొంత కాలంగా చేస్తున్న లక్ష కోట్ల ఆరోపణలను పక్కన బెట్టి తీరా ఉప ఎన్నికల సమయంలో 16 లక్షల కోట్ల అవినీతి అంటూ ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఏ మాత్రం అర్థం లేని విధంగా మాట్లాడారని సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్వాపరాలు ఏ మాత్రం పట్టించుకోకుండా కొన్ని మీడియా, పత్రికలు కూడా టీడీపీ వారు చెప్పిన అబద్ధాలనే అమృత భాండాలుగా ప్రచారం చేశారని అన్నారు. బయ్యారంలో 14 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఇనుప ఖనిజం ఉందా? దేశంలోనే అత్యుత్తమమైన ఎన్‌ఎండీసీ సంస్థ తీసే ఇనుము విలువే 66,000 కోట్ల రూపాయలు లేదే? విమర్శలు, ఆరోపణలు చేస్తే ఒక అర్థం ఉండాలి అని సోమయాజులు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తమ ఓటమికి నిజమైన కారణాలను చూడకుండా ఎంత సేపూ జగన్‌పై పడి ఏడ్వడం విడ్డూరం అని ఆయన అన్నారు. ఒక మనసున్న ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు పనికి వచ్చే అనేక పథకాలు చేపట్టారనీ వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన తదుపరి ముఖ్యమంత్రులు కె.రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నిస్తేజంగా మారిపోయి వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. 

ఆస్ప్రో మాత్రను సైతం కొనుగోలు చేయలేని నిరుపేద వారు అపోలో వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా చేసిన ఘనత వైఎస్సార్‌దేనని ఆయన అన్నారు. ఈ రోజు 108, 104 వాహనాలు డీజిల్ లేకుండా పడి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ వారు వై.ఎస్‌ను మరిచేలా చేసే తాపత్రయంలో ఆయన పథకాలను నీరు గార్చారనీ అలా కాకుండా వాటిని ఎందుకు పకడ్బంధీగా అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేయడానికి ముందు దశల వారీగా ఢిల్లీలో వాయలార్ రవి, ఆజాద్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ప్రధాని కార్యాలయం మంత్రి నారాయణస్వామి అందరూ సమావేశమై సోనియా అనుమతితోనే అరెస్టు చేశారని ఈ విషయం తాను చెప్పడం లేదనీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియాటుడే పత్రిక రాసిందని అన్నారు. ఈ పత్రిక కథనాన్ని ఇంత వరకూ ఎవరూ ఖండించక పోవడం, ఇంచార్జి వాయలార్ రవి స్వయంగా జగన్ అరెస్టే తమ కొంప ముంచిందని వ్యాఖ్యానించడం ఇందులో కక్ష సాధింపు ఉందని ధృవీకరిస్తోందన్నారు. సీబీఐని రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటోందని ఇప్పటికే రాజ్యసభ, లోక్‌సభల్లో జరిగిన చర్చలో అన్ని పక్షాలూ (కాంగ్రెస్ మినహా) తూర్పారబట్టాయన్నారు. ఇటీవల ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏడు రోజుల పాటు లండన్ వెళితే ప్యారేలాల్ మహాపాత్రను అడ్డం పెట్టి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం కేంద్ర ప్రభుత్వం చే సిందని ఆయన అన్నారు. నవీన్ పట్నాయకే ఈ విషయం బాహాటంగా వెల్లడించారని అన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!