బాబు బీసీలను విస్మరించటం వల్లే: టీడీపీ నేతల విశ్లేషణ
30 ఏళ్లుగా టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలు నేడు దూరం
ఎన్‌టీఆర్ హయాంలో బీసీలకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం
చంద్రబాబు పగ్గాలు చేపట్టాక బీసీలపై చిన్నచూపు
టీడీపీకి 2004 ఎన్నికల నుంచే బీసీలు దూరమవుతున్నట్లు స్పష్టం
వైఎస్ ప్రేమాదరణ, పథకాలతో బీసీల మనస్సుల్లో సుస్థిరమైన స్థానం
వాటిని జగన్ అమలుచేయగలరని విశ్వసించిన బీసీ వర్గాలు
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వెనుకబడిన సామాజిక వర్గాలు (బీసీలు) ముప్పయి ఏళ్ల తర్వాత ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లు కనిపిస్తోంది. 1982లో ఎన్‌టీఆర్ ప్రభంజనం నుంచి టీడీపీకి అండగా ఉంటున్న బీసీ వర్గాల్లో.. ఆ పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబునాయుడుపై విశ్వాసం పూర్తిగా సడలిపోయిందని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమను.. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న భావన 2004 ఎన్నికలలోనే వ్యక్తమయిందని, అప్పటి నుంచి బీసీలు క్రమంగా పార్టీని వీడుతున్నారని, ఆ ప్రక్రియ ఈ ఉప ఎన్నికలతో పూర్తయినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవులివ్వటంలో బీసీల పట్ల చిన్నచూపు చూశారన్న విమర్శా ఉంది.
ఎన్‌టీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గాలకు టీడీపీలోనూ, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం లోనూ చాలా ప్రాధాన్యం ఉండేదని.. కానీ చంద్రబాబు పార్టీ అధినేతగా వచ్చిన తర్వాత కేవలం పారిశ్రామిక వేత్తలను, తన కోటరీలోని అగ్రవర్ణాలకు చెందిన నేతలకే ప్రాధాన్యమిచ్చి బీసీలను దూరం చేసుకున్నారని టీడీపీకే చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించటం విశేషం. మరోవైపు.. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బీసీ వర్గాల పట్ల అమిత ప్రేమ చూపారని.. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ బీసీలకు ప్రాధాన్యం కల్పించటంతో పాటు.. లక్షలాది మంది బీసీ కుటుంబాలకు ప్రత్యక్ష మేలు చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలను అమలులోకి తెచ్చి వారి మనస్సులో స్థానం సంపాదించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఈ సంక్షేమ పథకాలను ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా విశ్వసించినందునే.. ఆ వర్గాల వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ బీసీలు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలవటం కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీసిందన్నది పరిశీలకుల విశ్లేషణ. కోస్తాలో బలమైన బీసీ సామాజిక వర్గాలైన కొప్పుల వెలమ, కాళింగులు, తూర్పుకాపులు, గవర, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, మత్స్యకార వర్గాలతో పాటు.. రాయలసీమలోని చేనేత, బోయ, యాదవ, కురవ, ఉప్పరి, తెలంగాణలోని మున్నూరుకాపు, పద్మశాలి, గౌడ లాంటి సామాజిక వర్గాలు పూర్తిగా టీడీపీ నుంచి దూరమై.. కొత్త పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఉప ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. ఆ పార్టీ బీసీలకు ఇంతగా దూరమైన దైన్య స్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇదంతా తమ పార్టీ నాయకత్వం స్వయంకృతాపరాథమేనని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించటం విశేషం. పైగా.. నాడు ఎన్‌టీఆర్ ప్రభంజనంలో బీసీలు ఆయన వైపు ఎలా మొగ్గుచూపారో.. ఇప్పుడు జగన్ పట్ల అంతటి ఆదరణను కనబరుస్తున్నారన్నది ఉప ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైపోయిందని ఆ నాయకుడే పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ప్రభావం చూపే సామాజిక వర్గాలయిన కొప్పుల వెలమ, కాళింగులు, తూర్పుకాపు సామాజిక వర్గాలు టీడీపీని పూర్తిగా దూరం పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాయి. గోదావరి జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గం పార్టీలను పక్కనపెట్టి ఒకే పార్టీ వైపు మొగ్గుచూపినా.. అక్కడి శెట్టిబలిజ, ఇతర బీసీ వర్గాలు జగన్ వైపే నిలబడటంతో నరసాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వగలిగారు. కోస్తాలో మరో ప్రాంతమయిన పల్నాడులో కూడా బీసీలు యువనేత వైపే నిలిచారు. మాచర్లలో బలమయిన బీసీ సామాజిక వర్గాలయిన వడ్డెర, యాదవలు ఫ్యాన్‌పై మక్కువ చూపారు. ఇక రాయలసీమలోని ఎమ్మిగనూరులో బలంగా ఉండే చేనేత, బోయ, కురువ, ఉప్పర లాంటి సామాజిక వర్గాలు ఏకతాటిపై నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఆళ్లగడ్డలో ప్రభావం చూపే సామాజిక వర్గాలయిన బోయ, యాదవ, కురువ, కటికలు కూడా జగన్ నిలబెట్టిన అభ్యర్థి వైపే మొగ్గుచూపారని స్పష్టమవుతోంది. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేటల్లో దూదేకుల, యాదవ, వడ్డెర, భట్రాజు లాంటి కులాలు కూడా దివంగత ముఖ్యమంత్రి తమకు చేసిన మేలును మర్చిపోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలను కట్టబెట్టాయి.
No comments:
Post a Comment