YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 12 July 2012

టీడీపీలో దళితులకు స్థానం లేదు

తెలుగుదేశం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన వ్యాఖ్య
జగన్, విజయమ్మలను కలిసిన కల్పన
త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటన

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఆమె చంచల్‌గూడ జైల్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.

విజయమ్మతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం నివాసం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తానని వివరించారు. వాస్తవానికి తన నియోజకవర్గ కార్యకర్తలు ఏడాది నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒత్తిడి తెస్తున్నారని, వారి అభీష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. పార్టీ నుంచి ఏకపక్షంగా తనను బహిష్కరించినందుకే జగన్‌వైపు నిలబడాలనే ఉద్దేశంతో విజయమ్మను కలిశానని స్పష్టంచేశారు. టీడీపీలో దళితులు, బడుగు బలహీనవర్గాలకు స్థానం లేదని, అక్కడ అగ్ర కులాలకు ఓ న్యాయం, దళితులకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు. ‘‘విజయవాడలో వల్లభనేని వంశీ.. జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరాన్ని ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 

కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని కల్పన విమర్శించారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారని, అంతే తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని విమర్శించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు ఎవరెక్కువ కోట్లు ఇస్తే వారికే సీట్లు ఇచ్చారని, పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె ప్రశ్నించారు. కల్పనతో పాటుగా విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి ముత్తారెడ్డి ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!