YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 14 July 2012

మంత్రులకు న్యాయసాయంపై పిల్

ఆ జీవోలు రాజ్యాంగ విరుద్ధం
హైకోర్టులో ఓఎం దేబరా పిటిషన్
వ్యక్తిగత హోదాలో మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది
వాటికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలి
ప్రజల డబ్బును మంత్రుల కోసం ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధం..

హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకున్న మంత్రులకు న్యాయసాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మంత్రులకు న్యాయ సాయం అందించేందుకు ఈ నెల 7, 10వ తేదీల్లో జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఒ.ఎం.దేబరా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాలు, హోం, వ్యవసాయ, పరిశ్రమ, సమాచార, సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. న్యాయసాయం పొందుతున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. వీరికి న్యాయసాయం అందించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరుస్తూ వైఎస్ ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్న ఆరోపణలపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం గత ఏడాది ఆగస్టు 17న సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ధర్మాన, సబితారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆయా శాఖలకు మంత్రులుగా ఉన్న సమయంలో 26 జీవోలు జారీ అయ్యాయని, ఇందుకు ఆ మంత్రులను కూడా బాధ్యులను చేయాలని కోరుతూ న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. అందులో ప్రతివాదులుగా ఉన్న మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వారితోపాటు 8 మంది ఐఏఎస్ అధికారులకూ నోటీసులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తమకు న్యాయసాయం అందించాలని మంత్రులు ధర్మాన, సబిత, కన్నా, గీతారెడ్డి, పొన్నాల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు.

తదనుగుణంగా ఆయా మంత్రులకు ప్రభుత్వం తరపున న్యాయ సాయం అందించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో ప్రభుత్వం ప్రతివాది కాదు. కేవలం మంత్రులు మాత్రమే వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వారికి వ్యక్తిగత హోదాలోనే నోటీసులు జారీ చేసింది. అలాంటప్పుడు అది వారి వ్యక్తిగత వ్యవహారమే అవుతుంది తప్ప, ప్రభుత్వ వ్యవహారం కాదు’ అని దేబరా తన పిటిషన్‌లో వాదించారు. వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల కోసం ఖజానా నుంచి ప్రజల డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రజల డబ్బును తమ కోసం వెచ్చించాలని కోరే హక్కు ఆ మంత్రులకు లేదని ఆయన తెలిపారు. వాన్‌పిక్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా తనకు న్యాయసాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారని, అయితే ముఖ్యమంత్రి ఆ లేఖ తనకు అందలేదని అధికారికంగా చెప్పారని వివరించారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారులు సైతం న్యాయసాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ‘న్యాయసాయం జీవోలో ఎంత మొత్తం వరకు సాయం అందించవచ్చే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టులో న్యాయవాదుల ఫీజు రూ.10వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. అలాంటప్పుడు నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయించకుండా జీవోలు జారీ చేయడం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే. మంత్రులకు న్యాయవాదుల ఖర్చులు భరించే స్తోమత లేదనుకుంటే, వారు న్యాయసాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చు. మంత్రిమండలి ఆమోదం లేకుండానే ప్రభుత్వం న్యాయసాయం జీవోలు జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆ జీవోలను రద్దు చేయాలి’ అని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక చీఫ్‌జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!