YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 12 July 2012

అబద్ధాల్లో బాబుకు పద్మవిభూషణ్ ఇవ్వాలి

బీసీలకు వందస్థానాలు ఇస్తామనడం బూటకం
రూ. పదివేల కోట్లు కేటాయిస్తామనడం నాటకం
అధికారంలోకి రావాలనే మోసపూరిత ప్రకటనలు
బీసీలు లబ్ధిపొందింది వైఎస్ హయాంలోనే
వారి అభివృద్ధికి వైఎస్ రూ.1,600 కోట్లు కేటాయించారు
ఫీజులు మాఫీ చేశారు... మెస్ చార్జీలు 65శాతం పెంచారు
33శాతం రిజర్వేషన్లకోసం ఏకగ్రీవ తీర్మానం చేయించారు
అదేబాటలో జగన్ బీసీల సంక్షేమానికి పాటుపడతారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలు, సబ్‌ప్లాన్ కింద రూ. పదివేల కోట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన బలహీన వర్గాలను మరోసారి మోసగించే ప్రయత్నమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. 2009 ముందు ఇదేవిధంగా వంద స్థానాలని ప్రకటించి కేవలం 54 కేటాయించి బీసీలను దగా చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబుకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించాలని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావుతో కలిసి బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు జనరంజక వాగ్దానాలు చేసి, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం. రూ.2కే కిలో బియ్యం, మద్య నిషేధం, కరెంటు చార్జీల పెంపు విషయంలో మాట తప్పిన చంద్రబాబు వాటిని తన ‘మనసులో మాట’ పుస్తకంలో సమర్థించుకున్నారు. మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే దుర్నీతితో ఇప్పుడు రాష్ట్రంలో 50శాతం ఉన్న బీసీలను దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు బీసీల జపం చేస్తున్న తీరును పరిశీలిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’’ అని గోవర్ధన్ దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబును బీసీ సంఘాలు అభినందించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో బీసీలకు చేసిన మంచి ఒక్కటైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. హైటెక్ పాలనతో బీసీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇప్పుడు రెండుసార్లు పరాభవం ఎదురయ్యేసరికి ఎటూ పాలుపోలేని స్థితిలో మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

వైఎస్ హయాంలోనే బీసీలకు లబ్ధి చేకూరిందని గోవర్ధన్ చెప్పారు. కులవృత్తులకు దూరమైపోయిన బీసీలకు ఉన్నత విద్య అందుబాటులోకి తెస్తే తప్ప వారి అభ్యున్నతి సాధ్యం కాదని గ్రహించిన వైఎస్.. ఆ కులాలకు చెందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు మాఫీ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ‘‘టీడీపీ పాలనలో ఒక్క బీసీ విద్యార్థికి కూడా ఫీజులు మంజూరు చేయలేదు. కేవలం రూ.8 కోట్లుగా ఉన్న సంక్షేమ రంగాల విద్యార్థుల ఫీజు బడ్జెట్ వైఎస్ హయాంలో రూ. 662 కోట్లకు పెరిగిన మాట వాస్తవం కాదా? ఉపకారవేతనాల బడ్జెట్ రూ.67 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచారు. 1999 నుంచి 2004 దాకా చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా మెస్ చార్జీలు పెరగలేదు. వైఎస్ హయాంలో 65శాతానికి పెరిగాయి. ఒక్క బీసీల అభివృద్ధికే వైఎస్ రూ.1,600 కోట్లు కేటాయించారు’’ అని గుర్తుచేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా బీసీ ముఖ్యమంత్రులే ఉన్నప్పటికీ వైఎస్ చేసినంత చేయలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకోసం వైఎస్ చేపట్టిన పథకాల్లో కనీసం 20 శాతమైనా ఆయా రాష్ట్రాల్లో లేవంటే.. బీసీల కోసం వైఎస్ ఎంత తపన పడ్డారో తెలుస్తోందన్నారు. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభలో ఏకగీవ్ర తీర్మానం చేయించి కేంద్రానికి నివేదించిన వైఎస్, దాని అమలుకోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మహానేత తనయుడుగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ బీసీ సంక్షేమాన్ని మరింత ముందుకు నడిపిస్తారని గోవర్ధన్ స్పష్టం చేశారు.

పథకాలకు తూట్లు పొడుస్తుంటే ప్రశ్నించవేం?
దివంగత మహానేత వైఎస్ మరణానంతరం పాలన పగ్గాలు చేపట్టిన కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు బీసీల పథకాలకు తూట్లు పొడుస్తుంటే ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎందుకు ఆందోళనలు చేయడంలేదని గోవర్ధన్ ప్రశ్నించారు. కులవృత్తి చేసుకుంటూ బతుకులీడుస్తున్న దాదాపు రూ.70 లక్షల కుటుంబాల సంక్షేమాన్ని అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు గాలికొదిలేశారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధిపై చంద్రబాబు హయాంలో కనబడిన నిర్లక్ష్యమే ఇప్పటి కిరణ్ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనబడుతోందని ఆయన విమర్శించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!