YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 13 July 2012

రైతన్నపై కపట రాజకీయం!



రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాత కాడి కింద పడేస్తే దేశానికి అనర్థం తప్పదు. ఇలాంటి పడికట్టు పదజాలంతో మన పాల కులు తరచూ ఉపన్యాసాలను ఊకదంపు డుగా దంచేస్తూనే ఉంటారు. మరింత ముం దుకెళ్లి ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇల్లు - కర్షకుని కంట కన్నీరొలికిన దేశం సుభిక్షంగా మనజాలదని సందర్భం వచ్చినప్పుడల్లా ఉపమానాలతో వల్లెవేస్తూ ఉంటారు. అంత వరకే! కర్షకుని కన్నీరు తుడిచే ప్రయత్నం పొరపాటున కూడా చేయరు. కర్షకులకు సంబంధించి ఏవైనా మేలు కలిగించే చర్యలు తీసుకోవాల్సివచ్చినప్పుడు వారికి చేతులేరావు. మాటల్లోని ఉదారతను - చేతల్లో కనబరచేందుకు ఎంతమాత్రం ఇష్ట పడని పాలకులవల్లే రైతుల పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లు తయారైంది. కేంద్రంలోని అధికారపక్ష పెద్దల తీరుకు, రాష్ట్రంలోని పాలకుల తీరు భిన్నంగా ఏమీలేదు. దొందూదొందే అన్న రీతిగానే సాగుతోంది. రైతుల విషయంలో రాష్ట్రం చేసే అభ్యర్థనలకు దిక్కూదివాణం లేక పోగా కేంద్రం నుంచి వచ్చే సూచనలకు రాష్ట్ర పాలకులు మోకాలడ్డుతూ ఉండ టం రైతుల పరంగా దురదృష్టకర పరిణామం!

వ్యవసాయరంగం బలోపేతానికి స్వామినాథన్, మహేల్కర్ కమిటీలు చేసిన సిఫారసులను పూర్తిస్థాయిలో అమలుచేశామా లేదా అన్నది సమీక్షించు కోవాల్సి ఉందని మన ప్రధాని తరచూ పేర్కొంటూ ఉంటారు. అయితే ఆ సిఫార్సుల పూర్తి అమలుకు మాత్రం ఆయన పూనుకోరు. మరొకవంక ఆయన ప్రభుత్వమే రైతును ఆర్థికంగా కుంగదీసే దుర్విధానాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూంటుంది. ఆ మధ్య విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు వేలాదిగా పెరిగిపోయినప్పుడు ఇదే ప్రధాని అక్కడకు వెళ్లారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఏమేమి చర్యలకు ఉపక్రమించాలో అక్కడి వారిని విచారించారు. తమ పంటలకయ్యే వ్యయాన్ని అనుసరించి ధరలు కల్పిస్తే చాలని వారు తెలిపారు. ఆ తరువాత ప్రధాని ఆ అంశాన్ని సమావేశాలకు, సమీక్షలకే పరిమితం చేసి వదిలిపెట్టారు. ఆ సందర్భంలోనైనా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు పూర్తిస్థాయిలో ప్రయత్నించలేదు. స్వామినాథన్ అసలు సిసలు సిఫార్సు పెట్టుబడి వ్యయానికి యాభై శాతం వ్యయం అదనంగా కలపాలనేది అప్పుడే కాదు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
పత్తి, చక్కెర తదితరాల ఎగుమతిపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఆ శాఖ మంత్రి శరద్ పవార్ తీవ్రంగా ఆక్షేపించాడు. ఆ మేర ప్రధానికి లేఖాస్త్రం కూడా సంధించాడు. చక్కెర ఎగుమతులపై ఆహారమంత్రిత్వశాఖ పెడధోరణి కారణంగా భారీగా నష్టపోవాల్సివచ్చిందని, ఎగుమతులు సజావుగా సాగి ఉంటే చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.8000 కోట్ల బకాయిలు వెంటనే తీర్చేందుకు వీలుకలిగేదని వాపోయాడు. అలాగే పత్తి ఎగుమతుల నిషేధంపై జౌళి మంత్రిత్వశాఖ నిర్ణయమూ రైతుల కడుపుకొట్టిందని బాధపడ్డాడు. నిషేధం విధించిన ఆ ఒక్కరోజులోనే పత్తి ధర దేశీయ మార్కెట్లలో రూ.4,000ల నుంచి 3,000లకు పడిపోవడం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని చింతించాడు. ఇలా రైతుపక్షం వహించి విలపించే ధోరణిని ప్రదర్శించిన పవార్ చేతల్లో మాత్రం రైతుపట్ల కఠినత్వాన్నే అనుసరిస్తున్నాడు.

గత సీజనులో ప్రపంచంలో అరుదైన అపురూపపు పంట రాయలసీమ ప్రాంతపు కేపీ ఉల్లికి కనీస ధర రాకుండా అడ్డుకున్నాడు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ కేపీ ఉల్లి కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పటికీ దానికి మార్కెట్ జోక్యం స్కీమును అనుసంధించేందుకు ససేమిరా అన్నాడు. దానితో ఆ రైతులు పూర్తిగా దివాళా తీశారు. ఇటీవల రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ చేపట్టిన పసుపు కొనుగోళ్ల విషయంలో మార్కెట్ జోక్యం స్కీమును అనుమతించినప్పటికీ కొనుగోలు ధర నిర్ణయంలో పసుపు రైతులను చావుదెబ్బ కొట్టాడు. రాష్ర్ట ప్రభుత్వం నామమాత్రంగానే సిఫార్సు చేసిన రూ.4,500ల పసుపు ధరను పవార్ ముష్టి కింద దాన్ని రూ.4,000లకు కుదించి తన చేతల విశ్వరూపాన్ని పసుపు రైతులపై ప్రదర్శించాడు. ఫలితంగా మార్క్‌ఫెడ్ పసుపు కొనుగోళ్లు ఆకుకు అందని - పోకకు పొందని విధంగా తయారై పూర్తిగా అటకెక్కాయి. దానితో పసుపు కొనుగోళ్లు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం 54 వేల మెట్రిక్ టన్నులలో వెయ్యో వంతును కూడా చేరుకోలేక నామమాత్రావశిష్ఠమైపోయాయి. ఈ పరిణామాలు పసుపు రైతులకు అశనిపాతం కాకమరేమిటి?

వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీకి నాయకత్వం వహించే అశోక్ గులాటీ రైతుల శ్రేయానికి సంబంధించిన అంశాలలో అభిప్రాయపరంగా మరింత ముందు వరుసలో ఉంటున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి నిషేధం విధించినప్పుడు ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధరను 10 శాతం పెంచాలనేది ఆయన న్యాయమైన డిమాండ్! వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను నిషేధించడం పరోక్షంగా రైతుల ఆదాయానికి అడ్డుపడటంతో పాటు వారిపై పన్ను వేయడమేనని ఆయన వాదన! అందువల్ల రైతులకు కనీస మద్దతు ధరలపై 10 శాతం పెంచి అదనపు పరిహారం వచ్చేలా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. రైతుల ఆదాయంతో వాణిజ్య విధానాన్ని అనుసంధానం చేయాలని, ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర రైతులకు పెరుగుతున్న వ్యయాన్ని పూర్తిగా ప్రతిబింబించడం లేదని, అందువల్ల ఎగుమతుల వల్లే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆయన ఆలోచన! అయితే రైతుల పట్ల నాణ్యమైన మేలిమిని తలపించే ఆయన ఉదారవాద ఆలోచనలు ఉత్తుత్తిగానే ఉంటున్నాయి. చేతలు మాత్రం అందుకు విరుద్ధంగా రైతును కాల్చుకుతినేవిధంగా రూపుదిద్దుకుంటున్నాయి.

పంటల పెట్టుబడి వ్యయం-దిగుబడులు... వాటిని అనుసరించి పంటల మద్దతు ధరలను రూపొందించి రాష్ట్రాల వ్యవసాయశాఖలు తమ ప్రభుత్వాల ద్వారా కేంద్రానికి నివేదికల రూపంలో తమ ప్రతిపాదనలు పంపిస్తాయి. వాటిని ప్రాతిపదిక చేసుకొని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ కనీస మద్దతు ధరలను కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. అయితే రాష్ట్రాల వ్యవసాయశాఖలు రూపొందించిన మద్దతు ధరల పట్టికను వ్యవసాయ ధరల కమిటీ యథాతథంగా కేంద్ర కేబినెట్‌కు సిఫార్సు చేయడంలేదు. వాటిని సవరించే విషయం లో ధరల నిర్ణాయక కమిషన్ తన బుద్ధి కుశలతను ఏమీ ప్రదర్శించ డం లేదు. కేంద్రం పెట్టుబడి వ్యయం - దిగుబడి తదితర క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దేశీయ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా అంశాలను మాత్రమే బేరీజు వేసుకొని ధరలను నిర్ణయిస్తోంది.

మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మాటల ఔదార్యం లో వెనుక వరుసలో ఉండేందుకు రవ్వంతగా కూడా ఇష్టపడటం లేదు. వీలైతే ఒక మెట్టుపైనే ఉండాలని వాంఛిస్తున్నాడు. గత రబీ సీజన్‌లో రైతులకు సంబంధించి ఆయనొక ప్రకటన చేశారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అది ఈ రబీ నుంచి రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలకు వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. రైతులు తిరిగి బ్యాంకులకు రుణం అసలు చెల్లిస్తే సరి! వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని పదేపదే చెబుతూ వచ్చాడు. ఆ మేరకు రబీ తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకుల కెళ్లిన రైతులు చెవుల మెలితిప్పి బ్యాంకులు అసలుతోపాటు వడ్డీని కూడా వసూలు చేశాయి. దీంతో రైతుల్లో అసహనం ఏర్పడటంతో తప్పిదాన్ని గ్రహించి సీఎం వెంటనే మాటమార్చాడు. రబీ రుణాల వడ్డీని రైతులు అసలుతో పాటు చెల్లిస్తే తరువాత ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని చెప్పాడు. వడ్డీ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తుందో ఎలా ఇస్తుందో స్పష్టంగా చెప్పని ముఖ్యమంత్రి ఈ ఖరీఫ్ నుంచి వడ్డీలేని రుణ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించి రైతులను ఊరడించే ప్రయత్నం చేశాడు.

ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ఒక ఉత్తరం రాసి అందులోని విషయాలను పత్రికల ద్వారా రైతులకు చేరవేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని రైతులు ప్రయోజనం పొందాలని ప్రతి రైతు ఇల్లు ధాన్య లక్ష్మితో కళకళలాడాలని అందులో ఆయన అభిలషించారు. ఉత్తరం రాసి ఆయన అలా కోరుకోవటం మంచిదే అయినా రైతుల పట్ల ఆకాంక్ష వెలిబుచ్చ టంతోనే సరిపెట్టడం బాధ్యత అనిపించుకోదు. వ్యవసాయానికి ప్రధానమైనది భూమి తర్వాత విత్తనమే! ఆ విత్తనం ఈ ఖరీఫ్‌లో రైతులకు అందనేలేదు. పత్తి విత్తనం చీకటి బజారులో తప్ప బయట ఎక్కడా దొరకని స్థితి ఈ ఏడు తటస్థించింది. అవి కూడా నాసిరకాలే! మొలక శాతం సగం కూడా లేనివే!

రైతుల విషయంలో కేంద్రం, రాష్ట్రం అంటూ తేడా ఏమీలేదు. పాలకు లందరిదీ ఒకే తీరు! మాటల్లో ఔదార్యం ఒలకబోయడం! చేతల్లో కర్కశత్వం చూపెట్టడం! ఇలా ఎందుకు జరుగుతోంది? పాలకులు గుండెల మీద చేయివేసుకుని ఆలోచించాలి. సరే పంటల మద్దతు ధరల నిర్ణయంలోనైనా పాలకులు హేతుబద్ధతతో మెలగుతారా అంటే అదీ లేదు. కనీసం రైతు పక్షంగా గళమైనా విప్పరు. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుం దని, అంతేగాకుండా మద్దతు ధరలు పెంచినప్పుడు ఉత్పత్తి బాగా పెరిగినప్ప టికీ ధరలను అదుపుచేయలేమనే తప్పుడు భావనలకు స్వస్తి పలకాలి. ఏదిఏమైనా లోపభూయిష్టమైన మద్దతు ధరల విధానం వలన భారత రైతాంగం ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నదని వ్యవసాయ రంగ నిపుణుల విశ్లేషణ! ఇందుకు విరుగుడు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయటం ఒక్కటే మార్గం. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!