YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 10 July 2012

జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర

ఇప్పుడు మంత్రులకు న్యాయ సహాయం అందించడం విడ్డూరం
న్యాయ సహాయం అందించడమంటే జీవోల జారీ సక్రమమే అని చెప్పడమే
జీవోలు సక్రమమేనని ప్రభుత్వం ఆనాడే చెప్పి ఉంటే జగన్‌పై కేసులే ఉండేవి కావు
జగన్‌ను ఇబ్బందులపాలు చేసే దురుద్దేశంతోనే ఆనాడు ప్రభుత్వ వైఖరిని చెప్పలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కేసుల్లో ఇరికించాలనే కుట్రతోనే 26 జీవోలపై హైకోర్టుకు సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్ ప్రసాద్ విమర్శించారు. ఇప్పుడు మంత్రులకు న్యాయ సహాయం అందించాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పది నెలల క్రితం జగన్ కేసుల్లో 26 జీవోలపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దుర్బుద్ధితో మౌనం వహించింది. అడ్వొకే ట్ జనరల్ హాజరై వివరణ ఇవ్వాల్సిన ఈ వ్యవహారంలో కనీసం ఒక్క న్యాయవాదిని కూడా పంపలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయ సహాయం అందజేయాలని నిర్ణయించింది. అంటే జీవోల జారీ సక్రమమే అని చెప్పడానికే కదా! ఈ జీవోలు సక్రమమేనని ఆరోజే రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉంటే జగన్‌పై కేసులు ఉండేవే కావు. అంటే.. జగన్‌ను ఇబ్బందుల పాలు చేయాలనే దురుద్దేశంతోనే ఈ జీవోలు చట్టబద్ధమైనవో కావో ప్రభుత్వం చెప్పలేదు’’ అని ఆయన దుయ్యబట్టారు. ‘‘దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక విధానాల ప్రకారమే వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు భూమి కేటాయించారు. అప్పటికే ఇతర ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతినే ఆయన కొనసాగించారు. 

రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వైఎస్ భూ కేటాయింపులు చేశారు. పశ్చిమ బెంగాల్ నానో కార్ల ఫ్యాక్టరీ వద్దంటే గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు ఉచితంగా భూమిని కేటాయించింది. పరిశ్రమలు కావాలనుకున్న రాష్ట్రాలు సాధ్యమైనన్ని ఎక్కువ రాయితీలు ఇస్తాయి. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఈ జీవోలు చట్టబద్ధమో కాదో చెప్పి ఉంటే ఈరోజు మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు న్యాయ సహాయం చేయాలనే ప్రశ్నే ఉత్పన్నమయ్యేది కాదు. జగన్‌పై కేసే ఉండేది కాదు. ఇందులోనూ ఐదుగురు మంత్రులకే న్యాయ సహాయం చేస్తూ.., మోపిదేవి వెంకటరమణను మాత్రం మినహాయించడం అన్యాయం. ఏం పాపం చేశారని మోపిదేవికి న్యాయ సహాయం అందించడంలేదు’’ అని జనక్‌ప్రసాద్ ప్రశ్నించారు. న్యాయ సహాయం విషయంలో మంత్రులను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తూ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సైకిల్ కాంగ్రెస్‌గా మారిపోయిన కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు ఓడిస్తూనే ఉంటారని తెలిపారు. టీడీపీతో కుమ్మక్కయిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని జనక్‌ప్రసాద్ విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!