పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏక పార్టీ పాలనకు శాశ్వతంగా తెరదించిన వెండితెర వేలుపు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతటి దుస్థితి? రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే ఒక్క చోటైనా గెలవలేకపోవడం, ఐదు చోట్ల డిపాజిట్లు గల్లంతుకావడమా? ఏ పరిస్థితులలో జరిగిన ఎన్నికలవి? వైఎస్ హఠాన్మరణానంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందటి కంటే ఘోరంగా దిగజారింది. ప్రజలు ప్రధాన ప్రతిపక్షం వేపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి. అలాంటి స్థితిలో ఓటర్లు టీడీపీని ఛీకొట్టడమా? ఇంతటి పరాభవానికి కారణాలపై ఆ పార్టీలో అంతర్మథనమైనా జరుగుతోందా అంటే అదీ శూన్యం. ‘మాకే కాదు, కాంగ్రెస్‌కు కూడా అదే గతి పట్టిందిగా!’ అంటూ అది సంతృప్తి చెందుతోందంటే ఇంతకంటే ఆ పార్టీకి సంప్రాప్తించగల దుర్దశ మరొకటి ఉంటుందా? పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు పర్యవసానంగా వెల్లువెత్తిన సానుభూతి కెరటమే ఓటమికి కారణమంటూ ఆత్మవంచన చేసుకుంటోంది. టీడీపీ వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా అంధకారమయంగానే గడచిపోక తప్పదని చెప్పకనే చెబుతోంది.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నారా చంద్రబాబునాయుడు ఆయన చేపట్టిన ప్రతి ప్రజాసంక్షేమ కార్యక్రమాన్ని ఏదో ఒక సాకుతో నిరసిం చారు, ఆయన చేపట్టిన ప్రతి నీటిపారుదల ప్రాజెక్టుకు మోకాలు అడ్డడానికి ప్రయత్నించారు. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా గాక రంధ్రాన్వేషకునిగా అవిశ్రాంతంగా పనిచేశారు. వైఎస్ ప్రభుత్వంపై బుదరజల్లడమే ప్రధాన కార్యక్రమం చేసుకున్నారు. వైఎస్ ప్రజా సంక్షేమ పాలనకు మెచ్చే ఓటర్లు 2009లో మరోమారు ఆయనకు అధికారం అప్పగించారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు తీయడానికి బదులుగా బాబు వైఎస్ హఠాన్మరణంలో అర్థంతరంగా అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశాన్ని చూశారు. అందుకే ‘రాజన్న రాజ్యం’ తెస్తానంటూ ఆయన కుమారుడు జగన్ ముందుకు రావడాన్ని, ప్రజలు దాన్ని మెచ్చడాన్ని సహించలేకపోయారు. బాబు పాలనలో ప్రత్యక్ష నరకాన్ని చవిచూసిన పేద, బలహీన వర్గాలలో, రైతాంగంలో వైఎస్‌పై చెక్కుచెదరకుండా నిలిచిన ప్రేమాభిమానాలను బాబు చిన్నచూపు చూశారు. దుష్ర్పచారంతోనే వాటిని చెరిపేయగలమని భావించారు. అందుకే పార్టీకి తనకంటూ ఓ సొంత రాజకీయవ్యూహం అన్నదే లేకుండా చేశారు. వైఎస్‌పైనా, ఆయన రాజకీయ వారసునిగా ప్రజలనుంచి అపూర్వ స్పందనను అందుకుంటున్న జగన్‌పైనా బురద జల్లడమే ఏకైక ఎజెండాగా పార్టీని నడిపారు.
జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తు ప్రహసనానికి తెర వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ అన్నీ కాంగ్రెస్ అధిష్టానమేననేది బహిరంగ రహస్యం. అది తెలిసీతెలిసీ బాబు ఇదే అవకాశమని ఆ కేసులో టీడీపీని ఇంప్లీడ్ చేశారు. అంతేకాదు, ఆంధ్రా హజారే అవతారమెత్తడానికి ప్రయత్నిం చారు. బాబు చేష్టలు సహజంగానే టీడీపీని నవ్వుల పాలు చేశాయి వైఎస్ హయాంలో మంత్రులుగా పెత్తనం చెలాయించి ఇప్పుడు వివాదాస్పదమైనవిగా మారిన జీవోలను జారీచేసిన మంత్రులపై నామమాత్రపు విచారణ సాగిస్తూ, 2014 ఎన్నికల నాటికి జగన్‌ను రంగంలో లేకుండా చేసే లక్ష్యం చుట్టూ కేసును తిప్పుతూ సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. సీబీఐ విచారణను, దాని సీరియల్ చార్జిషీట్లను ప్రజలు రాజకీయ కక్షసాధింపుగానే గుర్తిస్తున్నారు.
కార్పొరేట్‌స్వామ్యపు పూజారి బాబు సహజంగానే ఈ ప్రజాభిప్రాయాన్ని గుర్తించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానపు జగన్ వ్యతిరేకవ్యూహం అమలు బాధ్యతను అవుట్‌సోర్సింగ్‌కు పుచ్చుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులను సద్వినియోగం చేసుకొని జగన్ తను స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రజా సమస్యలపై ఆందోళనలతో వారి అభిమానాన్ని చూరగొన్నారు. ప్రజలు జగన్‌కు నీరాజనాలు పట్టసాగారు. ఇదంతా కళ్లారా చూస్తూ కూడా బాబు వైఎస్‌ను, జగన్‌ను దుమ్మెత్తి పోయడమే తన విద్యుక్త ధర్మం అని భావిస్తున్నారు. కాంగ్రెస్ తన గోతిని తానే తవ్వుకున్నట్టుగా, దానితో చేయికలిపిన బాబు కూడా ఎన్టీఆర్ నిర్మించిన టీడీపీకి గోతిని తవ్వడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆయన ‘శ్రమకు’ తగ్గ ప్రతిఫలమే ఉప ఎన్నికల్లో దక్కింది.
-బలిజేపల్లి శరత్‌బాబు
No comments:
Post a Comment