YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 13 July 2012

చీకటి రాజ్యం!


పుట్టి మునుగుతున్నదని తెలిసినా నిలువు గుడ్లేసుకుని చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? మన పాలకులు సరిగ్గా ఇలాగే వ్యవహరించడంవల్ల ఇప్పుడు జనం బతుకులు అంధకారమయ్యాయి. ఈ రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఇవాళ కొత్తగా వచ్చిపడింది కాదు. వేసవి కాలానికి చాలాముందే, శీతాకాలంలోనే కోతలకు తెరతీసి జనానికి నిండా వాతలు పెట్టిన చరిత్ర మన ప్రభుత్వానిది. రబీ సీజన్‌లో రైతాంగం, పరీక్షల సీజన్‌లో విద్యార్థులు ఈ కోతలతో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది. పేరుకు ఏడుగంటల విద్యుత్తును ఇస్తున్నట్టు నమ్మించినా వేళా పాళా లేకుండా మూడు దఫాలుగా ఇచ్చి అందులో గంట కోత పెట్టి ఆ సీజన్‌ను అయిందనిపించారు.

అవసరానికి అసలే అక్కరకు రాని ఆ విద్యుత్తు వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతాంగం గగ్గోలు పెట్టింది. ఇక పోటీ పరీక్షలకు తయారయ్యే క్రమంలో ఉన్న విద్యార్థులదీ అదే బాధ. ఏడాది పొడవునా పడిన కష్టాలకు బోనస్ అన్నట్టుగా రకరకాల సెట్‌లకు తయారయ్యేవారిని చివరివరకూ ఈ కోతలు వదల్లేదు. పరిశ్రమల పరిస్థితీ డిటోయే. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలై నెలల తరబడి సాగిన కథ కనీసం ఆ తర్వాతైనా ప్రభుత్వం మేల్కొందా? తగిన చర్యలు తీసుకుని విద్యుత్తు సమృద్ధిగా ఉండటానికి పథక రచన చేసిందా? ఏమీ చేయలేదు. ప్రాప్తకాలజ్ఞతలో పడి ప్రజలను గాలికొదిలేసింది.

పర్యవసానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్‌కి, పరిశ్రమలకు ముప్పుకలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలుపడి జలవిద్యుత్తు సరఫరా ముమ్మరించాల్సిన సమయంలో జనం ఉక్కబోతలో ఊపిరాడని స్థితిలో పడ్డారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులున్న కోతను నాలుగు రోజులకు పెంచారు. రోజూ సాయంత్రం ఆరునుంచి నాలుగు గంటలపాటు కేవలం దీపాలు వెలిగించుకోవడానికి సరఫరా చేస్తున్నారు. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, వారానికి అయిదురోజుల కరెంటు కోత ఉన్నట్టు లెక్క. స్టీలు, సిమెంటు, ఫార్మా వంటి రంగాలకైతే మొత్తం డిమాండ్‌లో 50 శాతంమేర మాత్రమే విద్యుత్తును అందించగలమని డిస్కంలు తెలిపాయి.

పరిశ్రమలు ఇలావుంటే, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగభద్రత ఉంటుందా? లక్షలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడవా? గత ఏడాది సెప్టెంబర్‌లో కరెంటు కోతలు ప్రారంభించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో సాగిన సకల జనుల సమ్మెను సాకుగా చూపారు. ఆ తర్వాత వేసవి కాలమన్నారు. ఇప్పుడు వర్షాలు పడటంలేదని, రిజర్వాయర్లు నిండటంలేదన్న కారణాలు చెబుతున్నారు. గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు ఇస్తానన్న గ్యాస్‌లో రిలయన్స్ కోత పెట్టిందని చెబుతున్నారు.

ఈ కారణాలన్నీ వాస్తవమే. అయితే, ఇవన్నీ ఇప్పుడే వచ్చి పడినవి కాదు. రుతు పవనాల గాలివాటంపై ప్రభుత్వానికి అనుమానం రావాలి. సరిగా వర్షాలు పడకపోతే, తగినంతగా జలవిద్యుత్తు సరఫరా కాకపోతే ఏంచేయాలన్న ఆలోచన రావాలి. కానీ, సర్కారు మొద్దు నిద్రపోయింది. ఇప్పుడు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత రకరకాల కారణాలను ఇప్పుడే గ్రహించినట్టు ఏకరువు పెడుతోంది. సంక్షోభాన్ని పూర్తిగా నివారించేంత స్తోమత లేకపోయినా కనీసం దాని తీవ్రతను తగ్గించడానికైనా ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే, ఆ తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే కొంచెమైనా అర్ధం ఉండేది. 2008లో విద్యుత్తు సంక్షోభం తలెత్తవచ్చని ముందుగానే అంచనా వేసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్... పంటలను కాపాడటానికి, ప్రజల ఇబ్బందుల్ని నివారించడానికి రూ. 6,000 కోట్లు ఖర్చుపెట్టి అదనపు విద్యుత్తు కొనుగోలు చేశారు.

అంతేకాదు, భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు 16,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగలేదు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేటాయించే విద్యుత్తు 150 మెగావాట్లు కేరళ తన్నుకు పోయింది. సకల జనుల సమ్మె సమయంలో మనకు కేటాయించిన 231 మెగావాట్ల విద్యుత్తులో కేంద్రం విపక్ష పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు 100 మెగావాట్లు ఇచ్చేసింది. ఏతావాతా ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా మనమే చేతకానివాళ్లలా మిగిలిపోయాం.

మన పెరట్లోనే ఉబికివస్తున్న గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ ఆడింది ఆట-పాడింది పాట అయింది. మన రాష్ట్రంలో 2,722 మెగావాట్ల విద్యుత్తు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల నుంచి రావాల్సి ఉండగా రిలయన్స్ మొండి వైఖరివల్ల అందులో సగం కంటే చాలా తక్కువ ఉత్పత్తి అవుతోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారు. ఒప్పందానికి అనుగుణంగా ఆ సంస్థ గ్యాస్ సరఫరాచేసినట్లయితే విద్యుత్తు ఉత్పత్తిలో మనం మిగులులో ఉండేవాళ్లం. సంక్షోభం ఇంతగా ముదిరాక ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారుగానీ, ఇన్నాళ్లూ ఆయన ప్రభుత్వం రిలయన్స్ మెడలు వంచడానికి చేసిన ప్రయత్నాలేమిటి? అసలు రిలయన్స్ గ్యాస్‌ను మన రాష్ట్రానికి కేటాయించాకే, ఇతర రాష్ట్రాల సంగతి ఆలోచించాలని ఎడతెగకుండా ఒత్తిళ్లు తెచ్చిన వైఎస్ ఎంతగా ఒత్తిళ్లు తెచ్చారో ప్రస్తుత పాలకులకు తెలియదా? కనీసం ఆ పోరాటాన్ని కొనసాగించినా పరిస్థితి ఇంతగా విషమించేది కాదు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలయన్స్ అడుగులకు మడుగులొత్తుతున్నాయి.

ఈ లొంగుబాటు వైఖరే సమస్యను ఇంతవరకూ తెచ్చింది. రిలయన్స్ మాటలా ఉంచి ల్యాంకో లాంటి సంస్థలు యూనిట్ విద్యుత్తును రూ. 5.50కి అమ్ముతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఉండిపోయింది. గత ఏప్రిల్ నెలలో ప్రజలపై రూ. 4,500 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారం మోపుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడానికే ఇలా పెంచవలసి వస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. తీరా ఇప్పుడు జరుగుతున్న దేమిటి? ఎటు చూసినా చీకట్లు... అన్ని వర్గాల ప్రజలకూ కష్టాలు. సమస్యను ముందే అంచనా వేసి, పరిష్కారానికి కృషి చేయాల్సిన సర్కారు ఇప్పుడు మేల్కొని ఆ సమస్యను ఏకరువు పెడుతోంది. ఇక ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!