YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 14 July 2012

సర్కారు ఘోర వైఫల్యం: సోమయాజులు

*ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 17న వైఎస్సార్‌సీపీ ధర్నాలు
*ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో విజయమ్మ పాల్గొంటారు
*2009 నుంచి ఇంధన సర్‌చార్జి, సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి
*కరెంటు కొరత లేకుండా వైఎస్ ముందస్తుగానే చర్యలు చేపట్టేవారు
*ఈ ప్రభుత్వం చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోంది..
*అయినా కరెంటివ్వకుండా ప్రజలను చీకట్లో ఉంచుతోంది
*పరిశ్రమలకూ ఇంత దారుణంగా కోతలు విధిస్తారా?
*బొగ్గు, గ్యాస్ ఉత్పత్తి సరిపడినంతగా లేదని తెలిసినా, ప్రత్యామ్నాయ చర్యలేం తీసుకున్నారు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ధ్వజమెత్తారు. విద్యుత్ కొరత ఏర్పడుతుందని ప్రభుత్వానికి ముందే ఒక అంచనా ఉన్నప్పటికీ, నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏమీ చేయలేక నిస్సహాయులై చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ కొరత నివారణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 17వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతాయని వెల్లడించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఏదో ఒక నియోజకవర్గ కేంద్రంలో ధర్నాకు సారథ్యం వహిస్తారని తెలిపారు. 2009 నుంచి 2012 సంవత్సరం వరకు ఇంధన సర్‌చార్జి, సర్దుబాటు చార్జీలను ప్రజలపై వేయాలని రెగ్యులేటరీ కమిషన్ ముందుంచిన ప్రతిపాదనలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పరిపాలనలో విద్యుత్ సరఫరా గురించి ముందుగానే ఆలోచించి, కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకునే వారు. 

ఐదేళ్లలో ఆయన ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. పైగా, పారిశ్రామిక టారిఫ్‌లో యూనిట్‌కు 75 పైసల చొప్పున తగ్గించారు. 2009 ఎన్నికలప్పుడు కూడా మరో ఐదేళ్ల పాటు చార్జీలు పెరగవని వైఎస్ వాగ్దానం చేశారు. ఇప్పటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేస్తోంది. సర్దుబాటు చార్జీలు కూడా ప్రజలపైనే వేస్తోంది. అయినా, విద్యుత్ సరఫరా చేయకుండా ప్రజలను చీకట్లో ఉంచుతోంది. ప్రజలపై ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకు’’ అని ప్రశ్నించారు. ‘‘నేను 35 ఏళ్లుగా విద్యుత్, పరిశ్రమల రంగాలను క్రియాశీలకంగా పరిశీలిస్తున్నాను. ఇంతటి అధ్వానమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు. నెలలో 12 రోజులు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయకపోవడం, మిగతా 18 రోజుల్లో కూడా గంటలకొద్దీ కోత విధించడం దారుణం. విద్యుత్తు కోతతో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం నాశనం చేసింది’’ అని అన్నారు.

కేంద్రానికి ఒక్క లేఖైనా రాశారా?

‘‘విద్యుత్ కొరత ఏర్పడుతుందని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చాలా ముందే తెలుసు కదా! బొగ్గు, గ్యాస్ ఉత్పత్తి సరిపడినంతగా లేదని ముందుగానే తెలిసినా, భారత ప్రధానిగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలేమిటి’’ అని సోమయాజులు ప్రశ్నించారు. రిలయన్స్ సంస్థ గ్యాస్ సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి సాకుగా చూపడంపట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. విద్యుత్ , గ్యాస్ సరఫరా మెరుగుకు సంబంధించి ఒక్క లేఖ కేంద్రానికి రాశారా? అని ప్రశ్నించారు. అదే వైఎస్ హయాంలోనైతే ఇలాంటి లేఖలు ఓ 20 సార్లు రాసి ఉంటామని చెప్పారు. ‘‘అసలు విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్యాస్ లింకేజి కమిటీ. గ్యాస్ కోసం కేంద్రాన్ని నిలదీయకుండా రిలయన్స్‌ను నిందించడం ఏమిటి? 2009 ఎన్నికల సమయానికి రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి సరఫరా చేస్తున్న తరుణంలో విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా అయితే కరెంటు ఉత్పత్తి పెరిగి సరఫరా మెరుగుపడితే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దాంతో రిలయన్స్ గ్యాస్ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇప్పుడే ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. అలాంటి గడ్డు పరిస్థితిలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మమ్మల్ని ముంబైకి పంపి అక్కడ విదేశీ గ్యాస్‌ను కొనుగోలు చేయించి దానిని రిలయన్స్‌కు ఇచ్చి వారి కేజీ బేసిన్ గ్యాస్‌ను మన ప్రాజెక్టులకు సరఫరా చేయించారు. అలా విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు’’ అని వివరించారు. ‘‘పీసీసీ చీఫ్, ఇతర మంత్రులు విద్యుత్ సంక్షోభం ఏదో ఇప్పుడే వచ్చినట్లుగా నాటకాలు ఆడుతున్నారు. అది నిజం కాదు. పైగా, ఈ విషయంలో ఏం చేయాలో సరిగా చెప్పలేదంటూ వారు అధికారులను నిందించడం బాధ్యతారాహిత్యం. అధికారులకు మనం అధికారాలు మాత్రమే ఇస్తాం. బాధ్యతలు కాదు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులదే’’ అని సోమయాజులు చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!