YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 25 October 2012

100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం

జగనన్న సీఎం కావాలి 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలని నినాదాలు
ఈ ప్రభుత్వం టమాటాకు బీమా కూడా ఇవ్వట్లేదని ఆవేదన
వచ్చే రాజన్న రాజ్యంలో బీమా ఇప్పిస్తామన్న షర్మిల 
100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం
పండుగ పూట పోటెత్తిన పల్లెలు 
‘అనంత’లో షర్మిల వెంట కదులుతున్న జనసైన్యం

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎత్తిపోయాయి. పంటలు ఎండిపోయాయి. పరిహారం ఇచ్చే దిక్కులేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మూడుసార్లు పరిహారం అందింది. ఇప్పుడు పరిహారం ఊసే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు. ఎరువులు అడిగితే ఇచ్చే నాథుడే లేడు.. ఈ పాలన మాకొద్దు. జగనన్న సీఎం కావాలి.. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి’’ అంటూ ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో పలువురు రైతులు షర్మిలతో మొరపెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో బుధ, గురువారాల్లో పాదయాత్ర సాగిన ధర్మవరం నియోజకవర్గంలో పలు చోట్ల రైతులు తమ ఎండిపోయిన పంటలను ఆమెకు చూపి ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా తమ్మాపురంలో తమకు బీమా వర్తింపజేయడం లేదని టమాటా రైతులు, తుమ్మల క్రాస్‌రోడ్డు వద్ద వేరుశనగ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందనగా తమ్మాపురం బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. టమాటా లాంటి పంటలకూ బీమా వర్తింపజేస్తుంది..’ అని హామీ ఇచ్చారు.

100 కి.మీ. దాటిన యాత్ర: షర్మిల యాత్ర విజయదశమి రోజు తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామం వద్ద 100 కిలోమీటర్ల మైలురాయి దాటగా.. మరుసటి రోజు గురువారం నాటికి 119.9 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ‘అనంత’ జనసైన్యంతో ఆమె ఉత్సాహంగా పరుగులు తీస్తుండగా.. జనంతో మమేకమై పోయిన షర్మిల చెరగని చిరునవ్వుతో ఆత్మీయంగా పల్లెలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ ముందకు సాగుతున్నారు. బుధవారం ఉదయం 10.35కు దాడితోట శివారు నుంచి బయలుదేరిన షర్మిలను చిల్లకొండాయపల్లిలో గొర్రెల కాపర్లు కలిసి తమ నీటి కష్టాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ తరపున ధర్నా నిర్వహించి సమస్య పరిష్కారానికి పోరాడుతామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా శాసనసభ్యులు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డిలు స్థానిక సమస్యలపై పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

గ్యాస్ అక్కర్లేనివారికే ఇస్తుందీ ప్రభుత్వం: చిల్లకొండాయపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ రాజన్న కుటుంబం తరఫున విజయదశమి శుభాకాంక్షలు అంటూ షర్మిల అభివాదం చేశారు. ఈ సందర్భంగా అన్ని ధరలూ పెరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేయడంతో ‘గ్యాస్ అవసరం లేని వారికే ఈ ప్రభుత్వం గ్యాస్ ఇస్తుందట. దీపం పథకం కింద ఉన్నవాళ్లకు ఆరు సిలిండర్లకంటే ఎక్కువ అవసరం ఉండదు. కానీ వారికే ఇస్తానని మొసలి కన్నీరు కారుస్తోంది. లెక్కల గారడీలో ఈ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వొచ్చు..’ అని షర్మిల ఎత్తిపొడిచారు. పాదయాత్రకు వచ్చిన నార్పల మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే యువకుడు కెనాల్ కింద భూమి పోగా నష్టపరిహారం రాలేదని ఫిర్యాదుచేయడంతో పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి డబ్బులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

పండు ముదుసలికి వయసుందా?: చిల్లకొండాయపల్లి సమీపంలో పాదయాత్ర సాగుతున్న తరుణంలో కదిరి నుంచి వికలాంగులు వచ్చి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రెండు కళ్లూ లేక 80 ఏళ్ల వయస్సున్నా తనకు పెన్షన్ ఇవ్వలేదని, వయసుందని అంటున్నారని ఓ వృద్ధురాలు మొరపెట్టుకోవడంతో ‘ఈ పండుటాకుకు పెన్షన్ ఇవ్వలేరా? ఈ ప్రభుత్వం గుడ్డిదా? ఈమెకు ఇంకా వయసుందా?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షన్ లేదని, తిండి లేదని, వైఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్‌ను రద్దు చేశారని మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు. రెండు కాళ్లూ లేని వికలాంగులూ అక్కడికి తరలిరావడంతో షర్మిల చలించిపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న సీఎం అయ్యాక పెన్షన్ లభిస్తుందని ఓదార్చారు.

కిడ్నీ ఆపరేషన్‌కు ఏర్పాట్లు: చిల్లకొండాయపల్లి వద్దకు వచ్చిన బత్తలపల్లికి చెందిన నిరుపేద మహిళ లక్ష్మీదేవి తన భర్త నర్సింహకు కిడ్నీ ఫెయిలైందని, ఆపరేషన్ తప్ప మార్గం లేదని వైద్యులు చెప్పారని, కూలిపని చేసుకునే తమకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదని విలపించడంతో షర్మిల చలించిపోయింది. అప్పటికప్పుడే వివరాలు తీసుకుని ఆపరేషన్ చేయించే బాధ్యత తనదీ అని హామీ ఇచ్చి.. హైదరాబాద్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అక్కడికెళ్లాలని లక్ష్మీదేవికి దారి ఖర్చులు కూడా ఇచ్చారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని, అధైర్యపడొద్దని ఓదార్చారు.

విజయద శమి రోజు పూజలు: విజయదశమి రోజు మధ్యాహ్నం 1.30కు పెద్దకోట్ల గ్రామంలోని పెద్దమ్మగుడిలో షర్మిల పూజలు చేశారు. అనంతరం ఆ గుడి పూజారి పెద్దరాజు-వరాలమ్మ దంపతుల ఇంట ఓలిగ, చిత్రాన్నం తిన్నారు. శివ్వంపల్లి దాటాక రాత్రి 8 గంటలకు బస చేశారు. దసరా రోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. పండుగ రోజు సైతం జనం షర్మిల వెంటే నడుస్తూ ‘అనంత’ పల్లెలు ఆమెతోనే తమ పండుగ చేసుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 9.30కు బయలుదేరిన షర్మిలను.. మార్గమధ్యంలో కలిసిన ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్రాచెరువు సమీపంలో భోజన విరామం తీసుకున్న ఆమె 4.30కు యాత్ర ప్రారంభించారు. అప్రాచెరువులో స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి 7.40కి తుమ్మల సమీపంలో ఏర్పాటుచేసిన బసస్థలానికి చేరుకున్నారు. పార్టీ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి గురువారం రోజంతా ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!