YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 23 October 2012

బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?

నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు.

రెండు మూడు రోజులుగా టిడిపి పెద్దలు - జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ కొత్త కథను తెరమీదికి తెచ్చారు. 2010 డిసెంబర్ మొదలుకుని టీడీపీ - కాంగ్రెస్‌తో కలిసి ఆడుతున్న నాటకంలో ఇది ఇంకొక మెట్టు. ఈ 18-20 నెలలుగా ఈ రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడను గమనిస్తున్న ఎవరికైనా, రాజకీయాలలో ఓనమాలు రాని నాలాంటి వారికైనా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే - జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి ఒక పార్టీ ప్రతిపాదిస్తుంది... రెండవ పార్టీ దాన్ని బలపరుస్తుంది అని! కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు గారు లెటర్ రాశారు... టిడిపి నాయకుడు ఎర్రంనాయుడుగారు, మరికొందరు దానితో జతకలిశారు. కోర్టుకు రాస్తారు... అక్కడ మొదలుకుని మొన్న బెయిల్ వరకు టిడిపి, కాంగ్రెస్ కలిసి ప్రతి మలుపులో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వేయని నాటకం లేదు.

నాకు అర్థంకానిది ఒకటే - వీళ్లందరూ - రెండు పార్టీలవారు తలపండిన రాజకీయ నేతలు - 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలవారు - జగన్ రాజకీయ వయస్సు 3 సంవత్సరాలు. మరి జగన్‌ను ఎదుర్కోవడం వీరికి ఎంతో సులభం. ఒక పిహెచ్‌డి వ్యక్తి ఫస్ట్‌క్లాస్ పిల్లాడితో తలపడినట్లే. వాళ్ల అనుభవానికి, వాళ్ల ప్రజాసేవ చరిత్రకి వాళ్లు ఇంతగా జగన్‌ని చూసి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. కానీ, ఇలా ఎందుకు వాళ్లు దొడ్డిదారిన, దొంగతనంగా జగన్‌తో తలపడుతున్నారో నాకు, ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం.

ఈరోజు టీడీపీ పెద్దలు జైలులో జగన్‌కు సౌకర్యాలు అంటున్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడు అన్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదు అని నేను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలను. మిగతా విషయాల్లో మీ సత్యసంధత తరువాత సంగతి... ఈ విషయంలోనైనా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడని మీరు అనగలరా?

జగన్‌ను ఈరోజు అన్యాయంగా విచారణ పేరుతో అరెస్టు చేసినా, బెయిల్ రాకుండా మీరు ఇంతమంది కుట్రలు చేస్తున్నా జగన్ గురించి నాకు తెలిసింది ఒక్కటే - జగన్ నియమ నిబంధనలు పాటించే మనిషి. జగన్ ఎంచుకున్న మార్గం కష్ట మార్గమని తను పార్టీ నుంచి బయటికి వచ్చిన రోజే చెప్పాడు - ‘‘నాతో వస్తే కష్టాలు వుంటాయి. వాటికి తట్టుకుని నిలబడగలిగితేనే నాతో రండి’’ అని. ఎంతటి ఆటుపోట్లకు గురిచేసినా చెదరని మనిషి, జైలు నియమ నిబంధనల దగ్గర మారతాడా. అసలు జగన్ మీరన్నట్టు రాజీపడి రాజకీయాలు చేసేవాడైతే ఇంతదూరం రావలసిన పనిలేదు. జైలుకు వెళ్లవలసిన పనిలేదు. సుఖంగా బెంగుళూరులో వుండి వ్యాపారాలు చేసుకుంటూ, కుటుంబంతో హాయిగా వుంటే, గులాంనబీ ఆజాద్‌గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే వుంటే ఎప్పుడో వారే సెంట్రల్ మినిస్టర్‌ని చేసేవారు... తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారు. అంతవరకు ఎందుకు అనుకుంటే - కొందరు పెద్దల మాదిరి చీకట్లో చిదంబరం గారిని కలుసుకుని అన్నీ చక్కబెట్టుకునేవాడు.

నేను ఈరోజు జగన్‌కు జైలులో సౌకర్యాలు అనే అంశం మీద రాష్ట్ర ప్రజలకు జైలులో జరిగిన రెండు సన్నివేశాల గురించి చెప్పదలచుకున్నాను.

నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు. అంతా టీడీపీ పెద్దల చలవే!

అసలు ఇన్ని సౌకర్యాలు మన దేశంలోనే కాదు కదా, భూమి మీద ఏ దేశంలోనూ ఉండవు. ఇన్ని చేస్తున్నా ఓర్చుకొని ఉన్నాం. మా ఆయన ఒక ఎంపీ, ఒక పార్టీ అధ్యక్షుడు. మా మామగారు రాష్ట్రానికి ఎంతో సేవచేసి, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్రానికి అందించిన మహానాయకుడు. ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచారు. అటువంటిది మీరు (టీడీపీ - కాంగ్రెస్) మమ్మల్నే ఇంత వేధిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల మాటేమిటి?

ఈరోజు ప్రజలకు నేను రెండు మాటలు చెప్పదలచుకున్నాను. మొదటిది - ఎవరైనా ధైర్యం వుంటే ఎదురుగా నిలబడి పోరాడాలి. అంతేకాని, ఇలా దొంగగా పోరాడేది పిరికిపందలే. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక జైలులో పెట్టారు. ఇప్పుడు బయట ఉన్నది ముగ్గురు ఆడవాళ్లు. రాజకీయాల్లోకి కాదు కదా, ఏరోజూ బయటికే రాని ఆడవాళ్లు. వాళ్లను కూడా ఈ టీడీపీ, కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఎదుర్కోలేకుండా వున్నారంటే మీరే చెప్పండి - మేమేం చెయ్యాలో.

రెండవది - ప్రజల ముందు మరొకటి చెబుతున్నా - జగన్‌కు జైలులో సౌకర్యాలు అని టీడీపీ చేసే ఆరోపణలు రాబోతున్న మరో కుట్రకు సంకేతం. టీడీపీ వాళ్ల మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ ఏమైనా జగన్‌కు ప్రతికూలంగా చర్యలు తీసుకుంటే - ఈ కుట్రలకు, ఈ చీకటి ఒప్పందాలకు మీరే సాక్షులు. కొన్నిరోజుల క్రితం నేను డీజీ గారికి ‘జైల్ మాన్యువల్ ప్రకారం నా భర్తను నేను వారానికి మూడుసార్లు కలవడానికి వీలు కల్పించమ’ని లెటర్ రాశాను. ఆ విషయంలో కానీ, మరే విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర) ఈ టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ప్రతికూలంగా స్పందిస్తే అది వారి అపవిత్ర కలయికకు మరో నిదర్శనం అవుతుంది. దానికి ప్రజలే సాక్షులు.

నిజం చెప్పండి - మా మీద పెట్టిన ఈ కేసులు, జగన్ అరెస్టు, 3 సంవత్సరాలుగా వేధింపులు - వీటికి కారణం మాకున్న ఆస్తులా లేక మా మామగారు, ఆ తరువాత నా భర్త సంపాదించుకున్న ప్రజాభిమానం అనే కొండంత ఆస్తా. నిజం చెప్పండి... ఈ కేసులకు మూలం - సాక్షి పత్రిక, టీవీ ఛానల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - వీటి మీద ప్రజలు చూపుతున్న ఆకాశమంత అనురాగమా, లేక మేము తప్పు చేశామనా? సమాధానాలు అందరికీ తెలుసు.

అయినా ఇన్ని ప్రజా సమస్యలుంటే అవేవీ పట్టనట్టు జైల్లో వున్న జగన్ మీదే వాళ్ల ధ్యాసంతా.

ఈ కుట్రలను కుతంత్రాలను దేవుడు చూస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడే కాలం ఎంతోదూరంలో లేదు. దేవుని ఆశీస్సులతో ఇవన్నీ దాటుకుని బయటకు వస్తాం. అంతవరకూ మా ఈ పోరాటం ఆగదు.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!