YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 27 October 2012

తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం

దళిత మహిళనని అవమానిస్తున్నారు
చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదు
గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత వెల్లడి
భవిష్యత్ కార్యాచరణపై రెండురోజుల్లో నిర్ణయం

దేవరపల్లి(పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: టీడీపీలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని, మూడున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నానని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొంతమంది అగ్రకుల నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఆమె వాపోయారు. దళిత మహిళను కావడంవల్లే వారు తనను చిన్నచూపు చూస్తున్నారన్నారు. తానెదుర్కొంటున్న అవమానాల గురించి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు మూడేళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే వనిత దేవరపల్లి మండలం యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీ పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానమూ బాపిరాజుకే కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా, అధిష్టానం నుంచి గుర్తింపు ఉండట్లేదన్నారు. చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావంగా ఇటీవల నియోజకవర్గంలో సుమారు వంద కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించానని, అప్పుడూ కొందరు నాయకులు తనను ఇబ్బందులకు గురి చేశారని ఆమె వివరించారు. 

అల్లూరి విక్రమాదిత్య పార్టీలో చే రుతున్న విషయంగానీ, ఈ నెల 24న నిర్వహించిన కార్యక్రమం గురించికానీ తనకెవ్వరూ సమాచారం ఇవ్వకపోవడం తీవ్రమనస్తాపానికి గురి చేసిందన్నారు. తన నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో విక్రమాదిత్య కార్యక్రమాలు జరిగినప్పటికీ తనకు ఆహ్వానం లేదన్నారు. విక్రమాదిత్య కార్యక్రమం జరిగినప్పటి నుంచి తనకు ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేకపోతున్నానన్నారు. 

ఇక భరించే శక్తిలేదు: మూడేళ్లుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంటి ఇబ్బందులను వీధిలో పెట్టకూడదనే ఆలోచనతో.. ఓర్పుతో ఇంతకాలం భరించానన్నారు. ఇక భరించే ఓపికలేక తన అసంతృప్తిని పత్రికలు, మీడియా ద్వారా అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు వనిత తెలిపారు. పార్టీలో స్వేచ్ఛ లేనప్పుడు ఎలా పనిచేయగలనని ప్రశ్నించారు. పొమ్మనలేక పొగపెట్టినట్టుగా పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పార్టీ మారుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రెండురోజుల్లో కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!