YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 22 October 2012

రైతన్న సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం

రైతన్న సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం 
గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు 
పిల్లలను బడికి పంపితే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారు
చిన్నారికి రూ. 500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు ఖాతాలో వేస్తారు 
చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలదే రికార్డు
ఇప్పుడు పాదయాత్ర పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారు 
ఐదో రోజు 14 కి.మీ. నడిచిన షర్మిల.. యాత్రలో పాల్గొన్న విజయమ్మ

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి:‘‘రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్నది రైతన్నలే. వారి సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. మార్కెట్‌లో రైతు పంటకు గిట్టుబాటు ధర లభించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల పేర్కొన్నారు. ఐదో రోజు సోమవారం ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా పలు చోట్ల ప్రజలు తమ సమస్యలు ఏకరవు పెట్టగా ఆమె స్పందిస్తూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అమలయ్యే ప్రణాళికలు వివరించారు. ఆదివారం రాత్రి బస చేసిన లింగాల ఐటీఐ నుంచి సోమవారం ఉదయం 10.30కు షర్మిల యాత్ర ప్రారంభించారు. 

బస స్థలానికి సమీప మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతపురం నుంచి కూడా మహిళలు తరలివచ్చి షర్మిలను కలిశారు. షర్మిల లింగాల దాటాక రోడ్డు మీద ప్రజలు ఎదురేగి ‘వర్షాలు లేవు. నీళ్లు లేవు. పంటలు లేవు. పనులు లేవు. అందుకే మిమ్మల్ని కలిసేందుకు వచ్చాం..’ అని తెలిపారు. అక్కడ ఓ బాలుడు కూడా రావడంతో ‘స్కూలుకు వెళుతున్నావా చిన్నా’ అంటూ షర్మిల ప్రశ్నించగా.. ‘బతకడానికి ఏం మిగిలిందమ్మా.. పనిచేయకుంటే పూట గడవదు’ అని అనడంతో చలించిపోయిన షర్మిల ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. ‘జగనన్న సీఎం కాగానే అందరికీ చదువు ఉచితంగా చెప్పిస్తాడు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాడు’ అని అభయమిచ్చారు.

చనిపోతున్నాడన్నా 108 వచ్చే పరిస్థితి లేదు...

షర్మిల లింగాల నుంచి మధ్యాహ్నం 12.20కి కర్ణపాపయ్యపల్లికి చేరుకున్నారు. అక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రైతులు కరెంటు ఉండడం లేదని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా 108 పలకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన ఇద్దరు పిల్లలకు రాజశేఖరరెడ్డి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టాడని ఓ నేత కార్మికుడు వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేత గిట్టుబాటు కాక మగ్గం అమ్మేసి కూలికి వెళుతున్నానని, వర్షాలు లేక కూలి పనికూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల 20 రోజులు ముందొస్తే బాగుండేదని, అప్పుడే వర్షం కురిసి తమ పంటలు నిలబడేవని మరో రైతు ఆదివారం కురిసిన వర్షానికి ఆనందం వ్యక్తంచేశారు. ప్రజల బాధలకు షర్మిల స్పందిస్తూ ‘డబ్బున్నోళ్లు, రాజకీయ నాయకులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకోరు. ఎందుకంటే అక్కడ మంచి వైద్యం లభించే పరిస్థితి లేదు కాబట్టి. వాళ్లంతా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, అవసరమైతే విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్క పేదవాడి ప్రాణాలూ కోల్పోకూడదని ఒక డాక్టర్‌గా రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ఏర్పాటుచేశారు. పేదవాళ్ల పిల్లలు ఒక డాక్టరో, ఒక ఇంజనీరో అయితే ఆ కుటుంబం బాగుపడుతుందని, డబ్బు లేని కారణంగా ఏ పేదవాడూ కూడా చదువుకోలేని పరిస్థితి ఉండకూడదనిఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏర్పాటుచేశారు’ అని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఆ పథకాలన్నింటికీ తూట్లు పొడిచిందని, చంద్రబాబు ప్రభుత్వానికి ఏమీ తీసిపోలేదని వ్యాఖ్యానించారు.

నమస్తే అన్నా.. నమస్తే అక్కా..

వెలిదండ్ల సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు భోజన విరామం అయ్యాక తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న లింగాల కుడికాలువను పరిశీలించారు. లింగాల బ్రాంచ్ కెనాల్ కు వైఎస్ హయాంలో 80 శాతం పనులు పూర్తయినా.. ఈ మూడేళ్లలో ఆ 20 శాతం కూడా పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి నుంచి 4.35కు వెలిదండ్లకు చేరుకున్నారు. అక్కడ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన పలువురు సభలో ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నానని ఒకరు, ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని మరొకరు తెలిపారు. ట్రాక్టర్‌పైకి ఎక్కి షర్మిల మాట్లాడుతూ ‘నమస్తే అక్కా, నమస్తే అన్నా, నమస్తే పెద్దమ్మా, నమస్తే పెద్దయ్యా..’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. తండ్రి రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చారు.

రాజన్న ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారు..

ట్రాక్టర్‌పై నుంచి షర్మిల మాట్లాడుతూ.. రాజన్న ఏడు గంటలు కరెంటు ఉచితంగా ఇస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. రాజన్న ఉంటే 9 గంటలు ఇచ్చి ఉండేవారని చెప్పారు. కరెంటు బిల్లులు కట్టలేక, అనేక సమస్యలతో చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర పేరుతో ఎల్లో డ్రామా ఆడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఆత్మహత్యలదే రికార్డు అని విమర్శించారు. అక్కడి నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగగా దంతెలపల్లి నుంచి మహిళలు భారీ సంఖ్యలో ఎదురేగి స్వాగతం పలికారు. కడప నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు పూల తివాచీ పరిచి సంఘీభావం తెలిపారు. మార్గం మధ్యలో వేరుశనగ రైతు ఒకరు కలిసి.. కాత కాయలేదని, మూడు ఎకరాల్లో పెట్టిన రూ.20 వేల పెట్టుబడి నేల పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ. 300 చొప్పున మాత్రమే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారని వివరించారు. బ్యాంకు నుంచి తెచ్చిన రూ. 25 వేల అప్పు అలాగే ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడి నుంచి నడుస్తుండగా కొట్యాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. తర్వాత అనంతపురం జిల్లా పరిధిలోని నేర్జాంపల్లిలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఐదో రోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఉదయం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు వైఎస్ విజయమ్మ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!