YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 26 October 2012

దద్దరిల్లిన ధర్మవరం

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ధర్మవరం దద్దరిల్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి బ్రహ్మరథం పట్టింది. తుమ్మల వైపు నుంచి ధర్మవరంలో ప్రవేశించిన షర్మిలకు.. బహిరంగ సభ ప్రాంతమైన ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వీధులు పోటెత్తడంతో కిలోమీటరు దూరం నడిచేందుకే రెండు గంటల సమయం పట్టింది. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు తుమ్మల సమీపం నుంచి షర్మిల పాదయాత్ర మొదలైంది. యాత్ర ఆసాంతం అశేష జనవాహిని మధ్య సాగింది.

మధ్యాహ్నం 12.30కు ధర్మవరం శివారులో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన బసకు షర్మిల చేరుకున్నారు. అనంతరం రామకృష్ణ అనే చేనేత కార్మికుడి ఇంటికి చేరుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. తర్వాత ధర్మవరం సభలో మాట్లాడారు. వీధుల్లో షర్మిల ప్రవేశించాక కిలోమీటరు దూరంలో ఉన్న బహిరంగ సభ స్థలానికి చేరేసరికి 5.30 అయ్యింది. ధర్మవరం జనసంద్రమవడంతో నడవడం ఆలస్యమైంది. సభ ముగిశాక రాత్రి 8.30కు గొల్లపల్లి వద్ద రైల్వేగేటు పడ్డప్పుడు ఆ గ్రామవాసి నాగలక్ష్మి అనే మహిళ షర్మిలను కలిసి తన దీన పరిస్థితి వివరించింది. దీంతో ఆమె నలుగురు ఆడపిల్లల్లో ఒక కూతురిని తానే చదివిస్తానని షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. రాత్రి 8.35 గంటలకు గొల్లపల్లి క్రాస్‌కు సమీపంలో పాదయాత్ర ముగించి, రోడ్డు పక్కన వేసిన గుడారంలో షర్మిల బస చేశారు. తొమ్మిదో రోజు పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. విజయమ్మ ధర్మవరంలో కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

ధర్మవరంలో కేబుల్ ప్రసారాల నిలిపివేత

మరో ప్రజాప్రస్థానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో శుక్రవారం ధర్మవరంలో అధికార పార్టీ నేతలు కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారాలు నిలిపివేశారు. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పనేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యే అనుయాయులకు చెందిన కేబుల్ వారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు.

రైతుతో కలిసి.. విత్తనాలు వేసి..

తుమ్మల సమీపంలోని మల్లేనిపల్లె రైతు జంగల వెంకటేశ్ వేరుశనగ విత్తనాలు వేస్తుండగా.. షర్మిల అక్కడికి వెళ్లి తానూ విత్తనాలు వేశారు. అక్కడికి వచ్చిన రైతులు, రైతు కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు షర్మిలతో మాట్లాడుతూ కరెంటు, నీటి కష్టాలను చెప్పుకున్నారు. అనంతరం షర్మిల పేరం చంద్రశేఖర్‌రెడ్డి అనే రైతు పొలానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పురుగు మందుల డబ్బాలు చూపుతూ ‘‘రాజన్న ఉన్నప్పుడు రూ.100 ఉన్న డబ్బా ఇప్పుడు రూ. 360 అయ్యింది. కాంటాఫ్ డబ్బా అప్పట్లో రూ. 75 ఉండేది. ఇప్పుడు రూ. 300 అయ్యింది. పంట పండినా దళారులకే తప్ప మాకేం లాభం లేదు..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ‘‘జగనన్న సీఎం అయ్యాక ఏ రైతూ తన పంట నష్టానికి అమ్ముకోకుండా ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేస్తాడు’’ అని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!