YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 22 October 2012

పదికోట్ల మందితో పెనవేసుకున్న బంధం...

జనం కోసం జగన్, జగన్ కోసం జనం - ఈ మాటలు ఎవరు కూర్చారో నాకు తెలియదు కానీ, ఈ నాలుగు రోజుల పాదయాత్రలో ఆ మాటలు నిజం అని చాలా దగ్గరగా చూడగలిగాను. పావురాలగుట్టలో జగన్ మాట ఇచ్చినప్పుడు - జగన్ ఒక్కడు! ఒక దివంగత ముఖ్యమంత్రి కొడుకు! కానీ ఈరోజు జగన్10 కోట్ల ఆంధ్రులకు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక కొడుకు, ఒక మనవడు - ఈరోజు జగన్ ఒక్కడు కాదు... 10 కోట్ల ఆంధ్రులతో ప్రేమానుబంధం పెనవేసుకుని వారిలో నుండి వారి కోసం పుట్టుకొని వచ్చిన నాయకుడని నాకు అనిపించింది.

నాకు ఇవాళ ఆరోజు గుర్తుకు వచ్చింది. జగన్‌ను మే 27న అరెస్టు చేశారు. జూన్ 12న ఎలక్షన్... జూన్ 15న బైఎలక్షన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వచ్చిన తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ‘ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు మిమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేశారు. మేము మీకోసం ఏమైనా పోరాటం చేస్తాం’ అన్నారు. కానీ, జగన్ - ‘నాకోసం వద్దు, ప్రజలు ఎంతో ఇబ్బందులలో వున్నారు. వాళ్లకు నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్రోలు ఛార్జీలు పెంచారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేదు... వాటి మీద పోరాటం గట్టిగా చెయ్యండి’ అని చెప్పాడు. అలా జైలులో పెట్టి 90 రోజులు కావచ్చింది.

మళ్లీ పార్టీ నాయకులంతా - ‘రాజ్యాంగం ప్రకారం 90 రోజులకు మీకు బెయిల్ రావాలి. మమ్మల్ని ఊర్లలో ప్రజలు అడుగుతున్నారు - జగన్‌ను ఎప్పుడు బైటికి తెస్తారు - అని. మేం ఏదైనా ఆందోళన కార్యక్రమం చేపడతాం’ అన్నారు. కానీ మళ్లీ జగన్ ‘మనం ప్రజల తరఫున పోరాడతాం అని జనం మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మనం మన సమయాన్ని, శక్తిని మన కోసం కాదు, మన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజల కోసం ఉపయోగించాలి. మనకోసం వద్దు, ప్రజల కోసం చేయండి’ అని చెప్పాడు. నేను కూడా జగన్‌తో అన్నాను - ‘జగన్... టిడిపిలో కానీ, కాంగ్రెస్‌లో కానీ వాళ్ల పార్టీ నాయకుడిని ఎవరైనా ఏమైనా మాట అంటేనే వాళ్లు ఎన్నో ఆందోళనలు చేస్తారు. అటువంటిది నిన్ను ఏకంగా అరెస్టు చేశారు. మనం ఏమీ చేయడం లేదు’ అని. దానికి జగన్ - ‘మన పార్టీ వుండేది మనకోసం కాదు... ప్రజలకోసం. ప్రజలకు మేలు చేయడం కోసం’ అని అన్నాడు.

మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ రాని రోజు షర్మిల వాళ్ల అన్నతో అంది - ‘అన్నా, నీకోసం ఎంతోమంది వేచివున్నారన్నా. మేం ఇంతమంది నిన్ను ప్రేమిస్తూ కూడా నీకోసం ఏమీ చెయ్యలేమా అన్నా. ఏమైనా చేస్తామన్నా నీకోసం’ అంది. దానికి జగన్ - 
‘నాకోసం వద్దు, ప్రజల కోసం చెయ్యాలి. నా తరఫున ప్రజల దగ్గరికి వెళ్లి, వాళ్లకి నా మాటలు చెప్పు’ అన్నాడు. ‘అలాగైతే నీకోసం నల్ల రిబ్బన్ అయినా కట్టు కోనివ్వు అన్నా. మా అందరి నిరసన తెలియజేయడం కోసం’ అంది. దానికి జగన్ ‘సరే, నీ ఇష్టం’ అన్నాడు.

నేను నడిచిన 3 రోజుల పాదయాత్రలో నాకర్థం అయింది - జగన్‌కు ప్రజల మీద ఇంత ఆలోచన ఎందుకో. నిజంగా ప్రజలు చాలాచాలా కష్టాలలో వున్నారు. వర్షాలు సరిగా లేవు, కరెంటు లేదు, తాగునీటికి సైతం ప్రభుత్వం బోర్లు వేయడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ఎరువులు, విత్తనాల రేట్లు పెరిగిపోయాయి. ఇన్సూరెన్స్ రావడానికి ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు. చీనీ చెట్లకు 5 సంవత్సరాలు దాటితేనే ఇన్సూరెన్స్ అంటున్నారు. చనిక్కాయకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారట. సోయా చిక్కుడుకైతే ఇన్సూరెన్స్ ఇవ్వరట. మరి ఇన్సూరెన్స్ రాకపోతే వాటిమీద పెట్టుబడి ఏట్లో వేసినట్లేనా?

ఒక పెద్దాయన, ఒక రైతు తన కష్టాలు చెబుతూ - చీనీ చెట్లను సన్నబిడ్డలను కాపాడినట్లు కాపాడుకోవాలమ్మా. అంతగా చూసుకుని, చేతికి వచ్చిన కొడుకును చంపుకున్నట్లుంది. కానీ విధిలేక చెట్లకు నీళ్లు ఇవ్వలేక నరుక్కుంటున్నాము’ అని అన్నాడు. ఇంకొక పెద్దాయనకు ‘7 ఎకరాలు వుంటే గత 3 సంవత్సరాలలో పంటల పెట్టుబడికి చేసిన అప్పులకోసం 3 ఎకరాలు అమ్మేశాను. ఇప్పుడు ఆ మిగిలిన 4 ఎకరాలు కూడా నష్టమేగానీ ఇంకేమీ లేదమ్మా’ అన్నాడు.

ఇంకొక ఆవిడ అంది - ‘భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయింది. పెన్షన్ ఇవ్వడం లేదమ్మా’ అని. ఇంకొకామె అంది -‘ఆరోగ్యశ్రీ కింద వైయస్సార్ గారు వున్నప్పుడు మా అబ్బాయికి జబ్బు బాగైంది. ఇప్పుడు మళ్లీ జబ్బువచ్చి, కార్డు తీసుకెళితే - ఈ కార్డుతో పని కాదు అన్నారమ్మా’ అని. ఎంతో బాధ అనిపించింది. కానీ వాళ్లు ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో కూడా -‘జగన్ అన్న ఎప్పుడు వస్తాడమ్మా... అమ్మా మీరు ధైర్యంగా ఉండడమ్మా.. మేమంతా మీతో ఉన్నాం.. జగనన్నకోసం మేము ప్రార్థనలు చేస్తున్నామమ్మా, జగన్ననకోసం ఎదురు చూస్తున్నామమ్మా’ అన్నారు. ఇన్ని కష్టాలలో వీళ్లుండి కూడా మమ్మల్ని ఓదారుస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారంటే వీళ్లది ఎంత గొప్ప మనసు. వీళ్లది నిజమైన మానవత్వం. ఇదీ నాగరికత అంటే... సభ్యత అంటే - అని అనిపించింది.

జనంకోసం జగన్, జగన్‌కోసం జనం - ఇది ఎవరు కూర్చారో కాని, ఎంతో దివ్యదృష్టితో రాశారు అనిపించింది. ఇది ఎంతో నిజం - కుట్రలు, కుతంత్రాలు, జైల్‌గోడలు ఈ సత్యాన్ని మార్చలేవు. దేవదేవుని ఆశీర్వాదంతో ఇవన్నీ దాటి జగన్ బయటికి వచ్చేరోజు త్వరలోనే వుంది. ఆరోజుకోసం 10 కోట్ల ఆంధ్రులతో నేను కూడా వేచి వున్నాను.



- వైఎస్ భారతి
w/o

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!