ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న రాజకీయ కుతంత్రాలను ఎండగడుతూ... సమస్యలతో తల్లడిల్లుతున్న జనానికి రాజన్న రాజ్యం వస్తుందన్న భరోసా కల్పించడానికి మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ స్పందన కనిపిస్తొంది. వైఎస్ఆర్ జిల్లాలో షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లల్ని అంటూ షర్మిలా ప్రసంగానికి జనం ఆకర్షితులవుతున్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని... సర్కారు ప్రజావ్యతిరేక విధానాల వల్ల జనం తల్లడిల్లుతున్నారని.. వీరి తరఫున పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని... మూడేళ్లుగా కాంగ్రెస్‌తో అంటకాగుతూ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను విస్మరించిందనే విమర్శలు ప్రజల మనసులో బలంగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భుజానకెత్తుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దీక్షలు, ఉద్యమాలు చేపట్టారు. జలదీక్ష, లక్ష్య దీక్ష, ఫీజు పోరు, రైతు దీక్ష, హరిత యాత్ర, చేనేత దీక్ష వంటి ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై మడమతిప్పని పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐతో అరెస్టు చేయించాయి. దాంతో ప్రజల తరఫున ఉద్యమించే నేత కరువయ్యారు. ఈ తరుణంలో తాను రూపొందించుకున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను చేపట్టాలని తన సోదరి షర్మిలకు సూచించారు. ఈ మేరకు షర్మిల ఈ నెల 18న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులుగా సాగుతున్న ఈ యాత్రకు వైఎస్సార్ జిల్లాలో విశేష స్పందన లభించింది.
ముఖ్యంగా మరో ప్రజా ప్రస్థానంలో మహానేత పథకాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో అనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ.. జనాన్ని పాదయాత్రలో భాగం చేస్తున్నారు. పేదవాడి చదువు ఆగకూడదని మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిన అంశంపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పేదవాడికి ఆరోగ్య శ్రీ అందకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని షర్మిల మండిపడ్డారు. రైతు కంట్లో పొడిచి ఆనందిస్తోందన్న ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని షర్మిల యాత్రలో ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. రైతులను కాల్చిన పోలీసులను పరామర్శించిన ఘనత చంద్రబాబుదని చేస్తున్న ప్రసంగాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. చంద్రబాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యచేసుకున్నారని.. అయితే ఇప్పుడు మళ్లీ రైతన్నపట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్ షర్మిల అన్నదాతకు అండగా నిలుస్తున్నారు.
'మరో ప్రజాప్రస్థానం' వెనుక రెండే ప్రధాన ధ్యేయాలున్నాయని వైఎస్ఆర్ తనయ షర్మిల ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొద్దు నిద్రనుంచి లేపడం ఒకటి అని, మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్షాన్ని నిలదీయడమే ధ్యేయంగా తన యాత్ర కొనసాగుతోందని షర్మిల కాంగ్రెస్, టీడీపీలపై బాణాన్ని ఎక్కుపెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో దారుణంగా విఫలమైన సర్కార్ పై చంద్రబాబు అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నా.. ఎందుకు పెట్టడం లేదని.. పాదయాత్ర చేయాల్సిన అవసరమేముందని షర్మిల ప్రజా కోర్టులో ప్రశ్నించారు. సీబీఐ కేసుల నుంచే తప్పించుకోవడానికే కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కయ్యారు షర్మిల దాడిని తీవ్రతరం చేశారు.
ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు అక్టోబరు 2న అనంతపురం జిల్లా నుంచి ‘వస్తున్నా.. మీకోసం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జిల్లాలో 13 రోజులపాటు 226 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ యాత్రకు జనసమీకరణ చేసినా ఆశించిన మేరకు స్పందన కన్పించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం లేకపోవడం వల్లే జనస్పందన లభించలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజల పక్షం వహించి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతుండటంతో టీడీపీ శ్రేణులు కూడా డీలాపడ్డాయి. ఇక అనంతపురం జిల్లాలో కొనసాగే షర్మిల పాదయాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అనంత జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడిమర్రి మండలం దాడితోటకు చేరుకోనుంది. అక్కడి నుంచి ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల మీదుగా 15 రోజుల పాటు సుమారు 200 కిలోమీటర్ల మేర జిల్లాలో కొనసాగనుంది. ఆ తర్వాత మద్దికెర గుండా కర్నూలు జిల్లాలో ప్రవేశించనున్నట్టు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ షర్మిల పాదయాత్రకు జిల్లా జనం నీరాజనాలు పలుకుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం తొణికిసలాడుతోంది.
No comments:
Post a Comment