వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు ధ్వజం
హైదరాబాద్ , న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరో కుట్రకు తెర లేపుతున్నారని, అందుకే జైల్లో ఉన్న ఆయనపై టీడీపీ నేతలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జగన్ జైల్లో నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించిందని యనమల రామకృష్ణుడు వంటి టీడీపీ నేతలు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఆరోపణలు చేసేముందు సిగ్గుండాలి. నిజంగా మీ వద్ద ఆధారాలుంటే నిరూపించండి. లేకుంటే అలా మాట్లాడ్డం మానుకోండి’’ అని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు ఆరోపణలు చేసినపుడల్లా జగన్‌పై ఏదో ఒక కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ‘‘బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని ఎందుకు ఇచ్చారని టీడీపీ ప్రశ్నించిన వెంటనే పోలీసులు జగన్‌ను వ్యాన్‌లో తీసుకెళ్లారు. అంతకుముందు అరెస్టు చేయాలని డిమాండ్ చేయగానే ఆయన్ను సీబీఐ జైల్లో పెట్టింది. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేటపుడు టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి చిదంబరాన్ని కలిశారు. ఆ తరువాతనే ఈడీ ఎటాచ్‌మెంట్ నోటీసులిచ్చింది. టీడీపీ ఏం చెబితే అది జరుగుతోంది, ఇదంతా కుట్రలో భాగమే’’ అని ఆయన అన్నారు. జగన్‌ను జైల్లో కొందరు వెళ్లి కలుస్తున్నారంటే.. తమ పార్టీవారు ఎక్కడ జారిపోతారోనన్న భయం వారికి పట్టుకుందని, అందుకే ఆయనపై టీడీపీ అబద్ధపు ఆరోపణలు చేస్తోందని గట్టు మండిపడ్డారు. పాముకు తలలోనూ, తేలుకు తోకలోనూ విషం ఉంటుందని, చంద్రబాబు వంటి దుర్మార్గునికి ఒళ్లంతా విషమే ఉంటుందని గట్టు సుమతీశతకంలోని పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ విషంతోనే తన పార్టీ నేతలతో జగన్‌పై చంద్రబాబు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో షర్మిల పాదయాత్ర చేస్తున్నపుడు కొందరు మహిళలు తమకు తెల్లకార్డులు లేవని చెప్పిన విషయాన్ని యనమల ప్రస్తావిస్తూ సొంత నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యే బాధ్యత కాదా? అని ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘అయితే చంద్రబాబు తన యాత్రలో టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తిరుగుతున్నపుడు అక్కడి ప్రజలూ సమస్యల గురించి చెబుతున్నారు. ఆ సమస్యలు పరిష్కారం కాలేదంటే టీడీపీ ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెబుదామా?’’ అని రామచంద్రరావు ప్రశ్నించారు.
బాబుది తెచ్చిన జనంతో సాగుతున్న యాత్ర
బాబు యాత్రకు వస్తోంటే తమ ఊళ్లకు రావద్దని గ్రామాల ప్రజలు చెబుతున్నారని, ఆయన పరిస్థితి ‘ఓ స్త్రీ రేపురా...’ అన్నచందంగా తయారైందని గట్టు ఎద్దేవా చేశారు. తెచ్చిన జనంతో బాబు యాత్ర సాగుతోంటే వచ్చిన జనంతో షర్మిల యాత్ర జరుగుతోందని, ఇది చూసి టీడీపీ అధ్యక్షునికి చిన్నమెదడు చిట్లిపోయిం దని, ఆయనకు పెద్ద మెదడు ముందే లేదని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల యాత్రకు లభిస్తున్న అపూర్వ స్పందనను చూసి టీడీపీ నేతలకు మతిపోతోందని అన్నారు.
మందకృష్ణా..‘ దేశం’లో చేరిపో: నల్లా
మాదిగల అభ్యున్నతికోసమంటూ ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబుకు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వటం మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టటమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూటకో మాట, రోజుకు ఒకరికి మద్దతిస్తూ మంద కృష్ణ విచిత్రంగా వ్యవహరించే బదులు టీడీపీలో చేరిపోవాలని ఆయన సూచించారు. గడిచిన ఎన్నికల్లో మాదిగల కోసమంటూ ప్రత్యేక పార్టీ పెట్టిన మంద కృష్ణ.. తాను స్వయంగా మధిర స్థానం నుంచి పోటీ చేశారని, అయితే ఆ నియోజకవర్గంలో 60 వేల మాదిగల ఓట్లు ఉంటే ఆయనకు 20 వేల ఓట్లు కూడా దాటలేదని గుర్తు చేశారు.
source:sakshi
No comments:
Post a Comment