ప్రజలు మిమ్మల్ని నాయకులుగా చేసింది మీ స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.కొద్దిరోజుల క్రితం జగన్ బెయిల్ హియరింగ్ రోజున- అంటే అక్టోబర్ 5న సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన స్టేటస్ రిపోర్ట్ చూశాను. అందులో ‘సాక్షి’ సంస్థ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్ ప్రస్తావన వుంది. అది చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది - కాంగ్రెస్, సంబంధిత సీబీఐ మరియు టీడీపీ ఎంత బాగా కలిసి పనిచేస్తున్నాయో.
సుప్రింకోర్టులో రాతపత్రం - అందునా 17 పేజీల రాతపత్రం సమర్పించాలంటే అప్పటికప్పుడు టైప్ చేయించి ఇవ్వడం వీలుపడదు. కానీ అక్టోబర్ 4 సాయంత్రం చంద్రబాబుగారి టీడీపీ ఎంపీలు చిదంబరం గారిని కలిసి ‘జగన్ ఆస్తులను అటాచ్ చెయ్యండి’ అని వినతిపత్రం ఇచ్చారు. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుగారితో ఫోన్‌లో మాట్లాడించారు. రెండుమూడు గంటల వ్యవధిలో ‘సాక్షి’ సంస్థ ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఇది అక్టోబర్ 5న సీబీఐ రాతపత్రం సమర్పించడానికి కొన్ని గంటల ముందు జరిగిన పరిణామం. అయినప్పటికీ సీబీఐ రాత
పత్రంలో ఈ విషయం చోటుచేసుకుంది. రెండు నెలలకు పైగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ హియరింగ్ విచారణలో వుంది. ఇన్ని రోజులు సమర్పించని రాతపత్రం టీడీపీ ఎంపీలు ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేయించిన వెంటనే దాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రాతపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. టీడీపీ వాళ్ల వినతి మేరకు ఈడీ అటాచ్ చేస్తుంది... చేసిన వెంటనే అక్టోబర్ 5న దానిని జతచేసి రాతపత్రం కోర్టుకు సమర్పించాలనేది కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల వ్యూహం. అక్టోబర్ 5న ఈ కుట్రల వల్ల బెయిల్ రాలేదు. ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకమని, దీనివెనక బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎంత కుట్ర దాగివుందని అర్థమవుతుంది.
ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఇన్ని ప్లాన్‌లు వేస్తున్నారు? వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ఉన్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక వారిని ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారా? కానీ ఇలా చేస్తే వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ప్రజాభిమానం పెరిగేదే కాని తరిగేది కాదు. పెపైచ్చు ఇంత అన్యాయంగా కుట్రలు చేసే మీమీద అసహ్యం పెరగక మానదు. మిమ్మల్ని జనం అపనమ్మకంతో చూస్తారు. మీరు చేసేవన్నీ నాటకాలు అనుకుంటారు.
నిజం నిప్పులాంటిది. అన్నిరోజులు అందరినీ మోసం చేయలేరు. ప్రజాభిమానం పొందాలంటే మీ ఎంపీలను ఢిల్లీ పంపి ప్రజలకోసం వినతిపత్రాలు ఇవ్వండి. జగన్‌కు వ్యతిరేకంగానో, మీ కేసుల కోసమో కాకుండా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి... లేదంటే ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించండి. ఫోన్‌లో మాట్లాడి, ఎంపీలను పంపి ఆస్తులు అటాచ్ చెయ్యగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల కోసం వాడండి. ఒక పెన్షన్ ఇప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయించండి. కొన్ని గంటలైనా అదనంగా కరెంటు ఇప్పించండి. అప్పుడు ప్రజాభిమానం దానంతట అదే వస్తుంది. దేవుడిచ్చిన పలుకుబడిని ఒకరిని ఇబ్బందిపెట్టడానికి బదులు, ఒకరికి మేలు చేయడానికి వాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు.
ఈరోజు జగన్‌కు వుండే బలం అదే. ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేస్తే జగన్‌ను దెబ్బతీసినట్టు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే జగన్ ఆస్తి ప్రజాభిమానం, దేవుని దయ. జగన్ పోరాటం తనకోసం కాదు... ప్రజలకోసం. అందుకే ప్రజలు జగన్‌ను అభిమానిస్తున్నారు.
గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మన రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సభ్యత కాదు అని కూడా మరచి మాట్లాడుతున్నారు. 2009కి ముందు అసలు హైదరాబాద్‌లోనే లేని, ప్రభుత్వంతో సంబంధం లేని జగన్ మీద నిందలు మోపి, కేసులు వేసి, కుట్రతో జైలుకు పంపారు. బెయిల్ రాకుండా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఈరోజు కొత్తగా జైలులో సౌకర్యాలు అని పాట పాడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే పెద్దమనుషులు వారిని ఎన్నుకున్న ప్రజలకోసం ఎంత మాట్లాడారు? వైయస్సార్ గారికి, జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రజలు వీరిని నాయకులుగా చేసింది వీరి స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే
పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.
జగన్ ఆలోచనలన్నీ ప్రజలకోసం తనేం చెయ్యగలనా అని! అంతేకాని, మిమ్మల్ని ఎలా ఇరికించాలా, ఎలా ఇబ్బందులు పెట్టాలా అని కాదు. అందుకే జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారు. అభిమానిస్తున్నారు. జగన్‌కు కుళ్ళు, కుట్రలు రావు, తెలీదు. అందుకే దేవుని దయ జగన్‌ను ఆశీర్వదిస్తుంది.
- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్
No comments:
Post a Comment