YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 10 June 2012

హెలికాప్టర్లు కూల్చి కుట్రలు పన్నే నాయకులకు బుద్ధి చెప్పం

* ప్రజానేత అయిన నా భర్తను పోగొట్టుకున్నా
* ప్రజల్లో తిరుగుతున్న నా బిడ్డను జైల్లో పెట్టారు
* ఒక్కడిపై ఇంత మంది కుట్రలు చూసి జగన్‌ను
* రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లనిచ్చానా అని బాధపడ్డా
* ప్రజల అభిమానం చూశాక కొండంత ధైర్యం వచ్చింది
* మీ ప్రేమే జగన్‌ను జైలు నుంచి బయటకు తెస్తుంది
* హెలికాప్టర్లు కూల్చి కుట్రలు పన్నే నాయకులకు బుద్ధి చెప్పండి: షర్మిల

తిరుపతి, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డను కుట్రలతో జైలు పాలుజేశారు. నాకు జరిగిన అన్యాయాన్ని, నా కడుపులోని బాధను మీకు చెప్పుకుని మిమ్మల్నే న్యాయం అడగాలని వచ్చాను. నాకు, నా బిడ్డకు మీరే న్యాయం చేయండి’’ అని తిరుపతి బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను అభ్యర్థించారు. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక.. అణగదొక్కేయాలని కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చూసి అసలు జగన్‌ను ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లనిచ్చానా అని మొదట్లో బాధనిపించిందని ఆమె చెమర్చిన కళ్లతో చెప్పారు. కానీ ప్రజలు జగన్ మీద చూపుతున్న ప్రేమను చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. 

‘‘మీ అభిమానమే నా బిడ్డను జైలు నుంచి బయటకు తెస్తుంది. జరగబోయే 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే వారు, ఆయన్ను అభిమానించే వారు అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. నా కడుపులోని బాధకు, నా భర్తను పోగొట్టుకున్న ఆవేదనకు, జగన్‌ను జైల్లో పెట్టిన చర్యలకు కారణమైనవారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి’’ అని విజయమ్మ కోరారు. ఉప ఎన్నికల ప్రచారం ముగింపు రోజు ఆదివారం సాయంత్రం తిరుపతి లీలామహల్ జంక్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు పోటెత్తిన జన తరంగాన్ని ఉద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. ఆమెతోపాటు షర్మిల ఈ సభలో పాల్గొన్నారు. విజయమ్మ ప్రసంగిస్తూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు కుట్రను ఎండగడుతుంటే.. జనం కూడా అధికార, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ముందే సిద్ధమైన సీబీఐ..
మహానేత వైఎస్ మృతిని త ట్టుకోలేక కన్నుమూసిన వారి కుటుంబాలను ఓదార్చుతానని నల్లకాలువలో జగన్ చేసిన ప్రకటన సోనియా గాంధీకి నచ్చలేదని విజయమ్మ చెప్పారు. ఈ రోజు జగన్ బాబుపై వేధింపులకు, కుట్రలకు అదే కారణమని, సీబీఐ కూడా ఆమె చెప్పినట్లే నడుస్తోందని అన్నారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌బాబు మీద హైకోర్టులో కేసు వేశాయి.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే సీబీఐ దాడులకు దిగింది. దీన్ని బట్టి చూస్తే సీబీఐ ముందుగానే సిద్ధమైనట్లు అర్థమవుతోంది. మా ఇళ్లు, ఆఫీసులు, చివరకు ‘సాక్షి’ కార్యాలయాల మీద కూడా దాడులు చేసింది. 10 నెలల పాటు విచారణ చేసినా సీబీఐ ఏమీ సాధించలేక పోయింది. జగన్‌ను జైల్లో పెడితే తప్ప ఉప ఎన్నికల్లో కనీసం ఒకటి, రెండు సీట్లయినా గెల్చుకోలేమనే భావనతోనే కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేసి అరెస్టు చేయించాయి’’ అని ఆమె విమర్శించారు.

మనమేమైనా విదేశాల్లో ఉన్నామా?
జగన్ ఎంపీ అని, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని చెబుతున్న సీబీఐ ఆయన గత 10 నెలలుగా ఎంపీగానే ఉన్నారన్న సంగతి మరచిపోయిందని విజయమ్మ అన్నారు. జగన్ అరెస్టు పట్ల తాము నిరసన తెలపడానికి దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌కు వెళితే పోలీసులతో బలవంతంగా గెంటేయించారని, ఇందిరా పార్కువద్ద నిరాహార దీక్షకు అనుమతి అడిగితే ఇవ్వలేదని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంటి బయట టెంట్ వేసుకుని నిరసన తెలపాలనుకుంటే ప్రభుత్వం దాన్ని కూడా కూల్చేయించిందన్నారు. ప్రచారానికి వచ్చిన తన సూట్ కేసులను కూడా తనిఖీ చేయించిందని, మనమేమైనా విదేశాల్లో ఉన్నామా అంటూ ఆమె గద్గద స్వరంతో ప్రశ్నించారు.

వైఎస్ మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం పట్ల తనకు మాత్రమే అనుమానాలు లేవని, రష్యా మీడియా సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేసిందని విజయమ్మ చెప్పారు. కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తాను, తన బిడ్డ కలసి వైఎస్‌ను చంపామని కొందరు ఆరోపణలు చేస్తున్నారంటూ విజయమ్మ కంటతడి పెట్టారు. వైఎస్ ఉన్నప్పుడు తాను ఏ రోజైనా బయటకొచ్చానా అని ఆమె ప్రజలను ప్రశ్నించడంతో ‘‘లేదు.. లేదు’’ అంటూ జనం నినదించారు. జగన్‌కు అధికార దాహం ఉంటే.. 154 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన సమయంలో సైతంఆయనస్వయంగా రోశయ్యను సీఎంగా ఎందుకు ప్రతిపాదిస్తారని విజయమ్మ ప్రశ్నించారు.

జనం కోసం బతకడమే మా బిడ్డలకు నేర్పాం
పిల్లల పెంపకం గురించి కొందరు నీతులు చెబుతున్నారని, ఇతరుల కోసం బతకాలనే నీతిని వైఎస్ తమ పిల్లలకు 9వ ఏట నుంచే చెబుతూ పెంచారని విజయమ్మ గుర్తుచేసుకున్నారు. ‘‘మన ఊరు, ఆ తర్వాత మన జిల్లా, తర్వాత రాష్ట్రం.. ఇంకా చేయగలిగితే దేశం కోసం మంచి చేయాలంటూ ఆయన పిల్లలకు మంచి బుద్ధులు నేర్పారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడాలని, మాట ఇస్తే ఏది ఏమైనా సరే దాని కోసమే నిలబడాలనీ, మనం ఎంత కాలం బతికామనేది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమనే విధంగా పిల్లలను పెంచాం. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన రాజశేఖరరెడ్డి భార్యగా, రెండున్నరేళ్లుగా ప్రజలతోనే ఉంటూ వారి బాధలు తెలుసుకుంటున్న జగన్ తల్లిగా ప్రజలను ఓటు అడిగే హక్కు నాకు తప్ప కాంగ్రెస్, టీడీపీలకు లేదు’’ అని ఉద్ఘాటించారు. జగన్ సీఎం అయితేనే వైఎస్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి రాజన్న పాలన తెస్తారని విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు.

మా ధైర్యం ప్రజలే: షర్మిల
‘‘నాన్నను పోగొట్టుకున్నాం, విచారణ పేరుతో జగనన్నను జైలు పాలు చేశారు. నాన్న మాకు ఇచ్చిన పెద్ద కుటుంబం మీరే(ప్రజలనుద్దేశించి). ఇన్ని కుట్రల మధ్య మా ధైర్యం మీరే. మీ చల్లని దీవెనలే మాకు రక్ష. హెలికాప్టర్‌ను కూల్చి కుట్రలు పన్నే నాయకులకు బుద్ధి చెప్పాలి. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి. మీరు వేసే ప్రతి ఓటూ జగనన్నను బయటకు తీసుకొస్తుంది’’ అంటూ దివంగత వైఎస్ కుమార్తె షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తిరుపతికి వచ్చిన ఆమె బహిరంగ సభలో ప్రసంగించారు. 

‘‘ఆ రోజు.. నాన్నను పోగొట్టుకున్న మేం శరీరం రెండుగా చీలిపోయి జీవం లేకుండా ఉన్నాం. ఆ సమయంలో మాకు సీఎం పదవి గురించి ఆలోచనే లేదు. కానీ.. ఆ సమయంలో మేం సీఎం కుర్చీ కోసం సంతకాలు చేయించామట. జగనన్న శవరాజకీయాలు చేస్తున్నాడట. ఆ రోజు సంతకాలు చేయించింది వీరప్ప మొయిలీ, కేవీపీ రామచంద్రరావులట. సీఎం, బొత్స, చంద్రబాబు అందరూ కలిసి జగనన్నను కాకుల్లా పొడుచుకు తింటున్నారు. జగనన్నను తలచుకుంటే మనసు తల్లడిల్లిపోతోంది. వైఎస్సార్ కడుపున పుట్టడమే తప్పా? మా గురించి విమర్శలు చేసేవారికి మనస్సాక్షే లేదా? ఆ దేవుడు పైనుంచి చూస్తున్నాడు. మంచివాళ్ల పక్షాన నిలుస్తాడు. జగనన్నను సీఎం చేస్తాడు’’ అని షర్మిల ఉద్ఘాటించారు.

సోనియా చెబితేనే అరెస్టు
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ చెబితేనే జగన్‌ను అరెస్టు చేశారని షర్మిల దుయ్యబట్టారు. ‘‘జగనన్న మీ గుండెల్లో ఉన్నాడు. జగనన్నను బోనులో పెట్టినా సింహం సింహమే. జైలులో ఉన్నా ధైర్యంగా ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ వారు జనంలో ఉన్నా భయం భయంగా తిరుగుతున్నారు’’ అని అన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన చంద్రబాబు నాయుడుకు దేశ విదేశాల్లో హోటళ్లు ఉన్నాయని షర్మిల ఆరోపించారు. 

‘‘ఆయన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈడీని సైజం మేనేజ్ చేశారట. బాబు అకౌంట్లలో కోట్లకు కోట్లు ఉన్నాయని కోలా కృష్ణమోహన్ చెబుతున్నాడు.. కృష్ణమోహన్ కూడా డబ్బులు వేశాడట. సాక్ష్యమే లేకుండా బాబు మేనేజ్ చేయగలరు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసును కప్పేసుకోగలరు’’ అని విమర్శించారు. చిరంజీవి స్వార్థం కోసం పీఆర్‌పీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారని, 70 లక్షల మంది ఓటర్లకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రచారంలో విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి కరుణాకరరెడ్డి, పార్టీ నేతలు రోజా, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి, నారాయణస్వామి, జ్ఞానేంద్రరెడ్డి, మనోహర్, ఓవీ రమణ తదితరులున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!