YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 4 July 2012

‘‘2006లో సాక్షి పుట్టనే లేదు, అలాంటి సంస్థకు ఎలా విలువ కడతారు?

*న్యాయస్థానాలను ప్రభావితం చేసే యత్నం.. బెయిల్‌పై తీర్పు వస్తుందనే అదనపు చార్జిషీటు వేశారు
* కంపెనీలు వస్తాయంటే భూములివ్వడం న్యాయమే
* హెటిరో, అరబిందోలకు కలిగిన లబ్ధికన్నా వారు పెట్టిన పెట్టుబడులే ఎక్కువ
* తొలి చార్జిషీటు ఒక బోగస్.. మళ్లీ దానికి అదనపు చార్జిషీటా?
* ఐదారు చార్జిషీట్లు ఉంటాయని జేడీ చెప్పడం దురుద్దేశమే

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విషయంలో సీబీఐ మోసపూరితంగా వ్యవహరిస్తోందనీ... కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి వాటిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, బి.జనక్‌ప్రసాద్‌తో కలిసి ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణలు ముగిశాక తీర్పు వెలువడనున్న రోజుకు ముందుగా అదనపు చార్జిషీటును దాఖ లు చేయడం వెనుక సీబీఐ దురుద్దేశం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. 

జగన్‌కు బెయిల్ రాకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానిస్తూ... ఈ విషయంలో తాము న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామనీ, ఉన్నత న్యాయస్థానానికి వెళతామనీ తెలిపారు. సీఆర్‌పీసీలోని 173 సెక్షన్ ప్రకారం ఒక కేసులో దర్యాప్తు పూర్తయిన తరువాతనే చార్జిషీటు వేయాలనీ, అయితే సీబీఐ అధికారులు మాత్రం తొలి చార్జిషీటు వేసినపుడు మరిన్ని చార్జిషీట్లు వేస్తామనీ, వాటన్నిం టిలో జగన్ ప్రధాన నిందితుడుగా ఉంటారని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీబీఐ ఎస్‌పీ వెంకటేష్, ఆ తరువాత జేడీ లక్ష్మీనారాయణ ఐదారు చార్జిషీట్లు ఉంటాయని చెప్పడాన్నిబట్టే వారు ముందు నుంచే ఎక్కువ చార్జిషీట్లు వేయాలనే దురుద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 

తొలిచార్జిషీటే బోగస్: అసలు జగన్ కేసులో వేసిన తొలి చార్జిషీటే పూర్తి బోగస్‌దని సోమయాజులు మండిపడ్డారు. కంపెనీలకు భూములు కేటాయించడాన్ని తప్పుగా చూపించార ని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలకు భూములు ఇవ్వలేదు? ఎన్ని రాయితీలు ఇవ్వలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఐటీ రంగం దిగ్గజమైన ఇన్ఫోసిస్ వంటి ఎన్నో కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయించినపుడు... ఔషధ రంగంలో అంతే ప్రాముఖ్యత గలిగిన హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలకు నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయిస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు. ఔషధాల భారీ ఉత్పత్తికి ప్రపంచంలోనే పెద్ద రాజధానిగా రాష్ట్రానికి పేరు తెచ్చిన కంపెనీల్లో అరబిందో ఒకటని గుర్తుచేశారు.

వాస్తవానికి ఆ సంస్థలకు ఈ భూముల కేటాయింపు వల్ల జరిగిన లబ్ధికన్నా వారు సాక్షిలో పెట్టుబడి పెట్టిన మొత్తమే అధికమని వివరించారు. ఇది లంచం అనుకుంటే తక్కువ లాభం వచ్చే పనికి ఎక్కువ మొత్తం ఎవరైనా చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. 2006లో సాక్షి విలువ రూ.146 కోట్లుగా జగదీశన్ కంపెనీతో మదింపు చేయించి ఆ తరువాత రూ.3,400 కోట్లుగా చూపారని అదనపు చార్జిషీటులో అభియోగం మోపడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

‘‘2006లో సాక్షి పుట్టనే లేదు, అలాంటి సంస్థకు ఎలా విలువ కడతారు? అది ప్రాజెక్టు రిపోర్టయి ఉండొచ్చు. ప్రాజెక్టు రిపోర్టును పట్టుకుని అంతర్జాతీయంగా పేరు మోసిన డెలాయిట్ కంపెనీతో రూ.3400 కోట్ల విలువ మదింపు వేయిం చారని చెప్పడం ఎంత మాత్రం సరికాదు. డెలాయిట్ కంపెనీ ఇచ్చిన రిపోర్టులో ఇది యాజమాన్యం అంతర్గత వినియోగం కోసం మాత్రమేనని, ఎవరూ పెట్టుబడులు పెట్టడం కోసం కాదని స్పష్టంగా పేర్కొంది. అయినా దీని ఆధారంగా తాము సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎవరైనా ఫిర్యాదు చేశారా? లేదే.., అక్కడేదో జరిగిందని సీబీఐ తనకు తానుగా భావించి దర్యాప్తు చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు. 

భూములివ్వడం సమర్థనీయం: వాస్తవానికి ఒక కంపెనీ రాష్ట్రానికి రావడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఎంత తక్కువ ధరకైనా వారికి భూములివ్వవచ్చు, ఎన్ని రాయితీలైనా ఇవ్వవచ్చునని సోమయాజులు సమర్థించారు. చంద్రబాబునాయుడు హయాంలో కూడా తక్కువ ధరకు భూములను కేటాయించారనీ, తన ఊరువాడైన ఓ వ్యక్తి స్థాపించిన (లక్ష రూపాయల మూలధనం కూడా లేని) ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఎకరం రూ.50 వేలకే భూములు కేటాయించారనీ చెప్పారు. 

ఈ అంశాలపై సీబీఐ అందరినీ తప్పుదోవ పట్టిస్తూ చార్జిషీట్లు వేస్తూ పోతోందని విమర్శించారు. అసలు కేసు దర్యాప్తు ప్రారంభించిన 280 రోజుల తరువాత జగన్‌ను విచారణపేరుతో పిలిచి అరెస్టు చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అరెస్టు చేయలేదనీ... ప్రజలను ప్రభావితం చేస్తాడని భయపడినట్లుగా ఉందని చెప్పారు. అసలు సీబీఐ దర్యాప్తు మొత్తం ప్రధాని కార్యాలయం కనుసన్నల్లో జరుగుతోందనీ సోమయాజులు విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!