YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 5 July 2012

రైతు సమస్యలను పవార్ దృష్టికి తీసుకెళ్లిన విజయమ్మ

* వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి
* సోనామసూరి రకానికి మాత్రమే ఇస్తున్నామని తెలిపిన అధికారులు
* అన్ని రకాలకు అందేలా చూడాలని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు
* ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ గురువారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. మంత్రి కార్యాలయంలో సుమారు 20 నిమిషాల పాటు జరిగిన భేటీలో రైతు సమస్యలను ఆయనకు వివరించారు. నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దారుణంగా విఫలమవుతోందని, నకిలీ విత్తనాల కట్టడికి సరైన వ్యవస్థ లేదని వెల్లడించారు. 

‘‘గత రెండేళ్లలో ఎరువుల ధరలు 12 సార్లు పెరిగాయి. కానీ రైతులకు మాత్రం అందుకు అనుగుణంగా మద్దతు ధరలు దక్కలేదు. దాంతో వారు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పెరిగిన ధరలకు తోడు బ్యాంకు రుణాల జారీలో జరుగుతున్న విపరీత జాప్యం వల్ల రైతులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. పండించిన పంటకు సరైన ధరల్లేని కారణంగా దేశంలో తొలిసారిగా రాష్ట్ర రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించిన అగత్యం ఏర్పడింది. ఇదిలాగే కొనసాగితే ఆహార భద్రతకూ పెను ముప్పు పొంచి ఉంది’’ అని పవార్‌కు నేతలు వివరించారు. వరికి మద్దతు ధరలపై అదనంగా బోనస్ ఇవ్వడం లేదని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

దాంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. బోనస్ ఇస్తున్నామని, కాకపోతే ఒక్క సోనామసూరీ రకానికే ఇస్తున్నామని వారు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సోనామసూరి రకం చాలా తక్కువగా సాగవుతుందని నేతలు పవార్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క పంటకే మద్దతిస్తే రైతులకు లాభం లేదన్నారు. దాన్ని అన్ని రకాలకూ విస్తరించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని పవార్ వారికి హామీ ఇచ్చారు. రైతుల నుంచి ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించకపోవడంతో వారికి మద్దతు ధర అందడం లేదని వివరించారు. అయితే అది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని పవార్ బదులిచ్చారు. దీనిపై స్థానికంగానే మాట్లాడాలని సూచించారు. రైతుకు మేలు చేసే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని, ఎరువుల ధరను కూడా 2009 నాటి స్థాయికి తగ్గించాలని నేతలు పవార్‌ను కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!