YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 5 July 2012

హూస్టన్‌లో వైఎస్ సంస్మరణ సభ

- ‘నాటా’ సదస్సు తర్వాత సమావేశమైన మహానేత అభిమానులు
- వైఎస్సార్ ఫౌండేషన్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్ ఆవిష్కరణ
- వైఎస్ ఆశయాలసాధన దిశగా సామాజిక సేవా కార్యక్రమాలకు నిర్ణయం
- డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిలకు వైఎస్సార్ అవార్డు ప్రదానం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన దిశగా పనిచేస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని అమెరికాలోని ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) సదస్సు ముగిసిన అనంతరం హూస్టన్‌లోని జార్జ్ బి.బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ అభిమానులు ప్రత్యేకంగా ఒక సంస్మరణ సమావేశాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు ఈ సందర్భంగా వైఎస్‌తో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఈ వేదిక నుంచి వైఎస్ స్నేహితుడు డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి ఆవిష్కరించారు. 

అమెరికాలో సామాజికంగా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిలకు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్సార్ అవార్డు-2012ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో వైఎస్‌లో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండేవి, నిరుపేదలకు సహాయం చేయడం, ఇచ్చిన మాటపై నిలబడటం తదితర విషయాలను పలు సందర్భాలను ఉదహరిస్తూ తెలియజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి సంస్థ లక్ష్యాలను వివరించారు. ఫౌండేషన్ తరఫున ఇకనుంచి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు సేవలు అందించడమే కాకుండా విద్యార్థులకు స్కాలర్‌సిప్‌లు, తాగునీటి ప్లాంట్‌లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను పేదలకు ఉచితంగా అందించే కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. వైఎస్‌కు అత్యంత ఆప్తుడు, హౌస్ సర్జన్‌షిప్‌లో సహాధ్యాయి అయిన డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డితో పాటు అమెరికాలో స్థిరపడిన పలువురు తెలుగువారు కూడా ఈ సమావేశంలో వైఎస్‌ను కొనియాడారు. 

అంతకుముందు నాటా సదస్సులో వైఎస్ వ్యక్తిత్వంపై ప్రత్యేక ప్రసంగం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ సమావేశంలో వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. పుట్టపర్తికి చెందిన డాక్టర్ హరిక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ పేదల మనిషని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు జీవితాంతం మరచిపోలేరంటూ ఉదాహరణలతో చేసిన ఉద్వేగభరిత ప్రసంగం వింటూ పలువురు కంటతడి పెట్టారు. ఈ సమావేశంలో నాటా అధ్యక్షుడు సంజీవరెడ్డి, కన్వీనర్ జితేందర్‌రెడ్డి, అడ్వయిజరీ బోర్డు సభ్యుడు జి.ధర్మారెడ్డి, ఇతర సభ్యులతో పాటు దాదాపు 600 మందికి పైగా వైఎస్ అభిమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!