YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 6 July 2012

నిత్యం ప్రజల్లో ఉండాలి: పార్టీ నేతలకు విజయమ్మ పిలుపు

వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ ఉద్వేగభరిత ప్రసంగం
వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’పైనే చేశారు
పాత బకాయిలూ రద్దు చేశారు.. ఐదేళ్లు చార్జీలూ పెంచలేదు 
ఈ రోజు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు 
పాలకులకు ముందస్తు ప్రణాళిక లేదు.. 
రైతులపై లాఠీచార్జీలూ చేస్తున్నారు 
వీటన్నిటినీ ప్రధాని, వ్యవసాయ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం 
జనం మధ్య ఉన్న జగన్‌ను అన్యాయంగా నిర్బంధించారు 
జగన్ వచ్చేవరకూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు మీ ముందుకు వచ్చా.. 
కోర్టులు, దేవుని మీద నమ్మకముంది.. 
జగన్‌బాబు త్వరలో తిరిగి వస్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌ది ప్రజాపక్షం. అందుకు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజలు మన పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి’’ అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. దాదాపు అరగంట పాటు విజయమ్మ ప్రసంగం ఆసాంతం ఉద్వేగభరితంగా సాగింది. ‘‘ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మీ అందరి సంపూర్ణ సహకారం వల్లే సాధ్యమైంది. మీరు చూపించిన ఉత్సాహం, ప్రేమాభిమానాలకు ప్రత్యేక అభినందనలు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇప్పటికీ మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారనేందుకు ఇంతకన్నా మరో నిదర్శనం లేదు. గతేడాది ఇదే సమయంలో వైఎస్ జన్మదినం సందర్భంగా ప్లీనరీ జరుపుకున్నాం. కానీ ప్రస్తుతం దురదృష్టమేంటంటే జగన్‌బాబును అన్యాయంగా, అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ ఆశ యంకోసమే జగన్‌బాబు తపనపడ్డారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. 

ఆ వెంటనే తేరుకుని మళ్లీ ప్రసంగించారు. ‘‘జగన్‌బాబు ఎప్పుడూ ఒకటి చెప్తుంటాడు. ఎంతకాలం బతికామన్నది కాదు. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యం అని అంటుండేవారు. అందుకే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్‌బాబు కుటుంబ సభ్యులుగా మాతో కంటే ప్రజల మధ్యే ఎక్కువగా గడిపారు. నెలలో 25 రోజులు ప్రజల్లో ఉంటూ వారే తన కుటుంబంగా భావించారు. జగన్ ఒకవైపు ఓదార్పు నిర్వహిస్తూనే మరోవైపు మహానేత ఆశయం కోసం ఎప్పటికప్పుడు ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేశారు. పెట్రోధరలు, ప్రాజెక్టు నిర్మాణాల కోసం, రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా కోసం, చేనేత కార్మికులు, విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేశారు. కానీ ఈ రోజు అన్యాయంగా జైల్లో పెట్టారు. జగన్‌బాబు త్వరలో బయటకొస్తారు. అయితే అప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని నిలబెడుతూ.. జగన్‌బాబు వచ్చేంత వరకూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు మీ ముందుకు వచ్చాను’’ అని ఆమె చెప్పారు. 

రైతులకు వైఎస్ నాటి భరోసా ఏది?: ‘‘రైతులకు రాజశేఖరరెడ్డి హయాంలో లభించిన భరోసా నేడు ఎక్కడుంది? ఆయన మొదటి సంతకమే ఉచిత విద్యుత్ ఫైలుపై పెట్టి రైతులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు పెండింగ్ బకాయిలు కూడా రద్దు చేశారు. ఐదేళ్ల కాలంలో విద్యుత్ చార్జీలు కూడా పెంచలేదు. విత్తనాలు, ఎరువుల ధరలు కూడా ఏనాడూ పెరగలేదు. ఈ రోజు అన్నింటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాలకులకు ఒక ప్రణాళిక, ముందస్తు ఆలోచన లేనట్లుంది. అందుకే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులపై లాఠీచార్జీ చేస్తున్నారు. 12 సార్లు ఎరువుల ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేయాలంటే రైతులకు ధైర్యం చాలటం లేదు. పండించిన పంటకు మద్దతు ధర ఉండటంలేదు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. 

గతంలో 865 కరువు మండలాలుగా ప్రకటించినా ఇప్పటి దాకా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఆయన చాలా బాగా స్పందించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కూడా కలిసినప్పుడు బోస్ గారు వివరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో మద్దతు ధర చెల్లిస్తున్నట్లుగా ఏపీ చేయటం లేదా? అని అడిగారు. లేదని చెప్పినప్పుడు వెంటనే స్పందించి అధికారుల చేత సమాచారం తెప్పించుకున్నారు. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ప్రధాని వద్ద ప్రస్తావించాం. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయాలని కోరాం’’ అని విజయమ్మ చెప్పారు. 

రోల్‌మోడల్‌గా చెప్పుకున్న వ్యక్తులెక్కడ?: ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి తమకు రోల్‌మోడల్ అని చెప్పుకున్న వ్యక్తులు.. ఆయన పేరును సీబీఐ అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేరిస్తే ఎందుకు మిన్నకుండిపోయారు? వీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని ప్రజలు గ్రహించారు. శంకర్రావు లేఖ రాస్తే దానికి టీడీపీ వత్తాసు పలకటం.. కేసులో ఇంప్లీడ్ అవటాన్ని మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వివాదాస్పదంగా మారిన 26 జీవోలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పటంలేదని అడుగుతున్నా. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేసింది. అదే విధంగా సీబీఐ కూడా వక్రదృష్టితో విచారణ చేస్తోంది. న్యాయస్థానం విచారణకు ఆదేశించిన 24 గంటలు గడవక ముందే 28 టీంలను ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల ఇళ్లపై, మా నివాసాలపై దాడులకు తెగబడింది. అంతేకాదు రాష్ట్రంలో ఒక భయోత్పాతాన్ని సృష్టించింది. సీబీఐ ఇప్పటి దాకా మాకు సంబంధించిన 2,000 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసింది’’ అని ఆమె వెల్లడించారు. 

కుట్రపూరితంగా సీబీఐ దర్యాప్తు... 

‘‘వైఎస్ తన ఐదేళ్ల పాలనలో నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు. సెజ్‌ల కోసం భూములు కేటాయించటమనేది అంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినదే కదా? ప్రభుత్వ గైడ్‌లైన్స్‌నే ైవె ఎస్ పాటించారు. అయితే సీబీఐ మాత్రం తన మనసులో ఏదో కుట్ర పెట్టుకొని అదే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఎమ్మార్ కేసు విషయాన్నే చూస్తే.. దానికి భూములు కేటాయించింది చంద్రబాబు. కానీ సీబీఐ వాళ్లు ఆయన్ని ప్రశ్నించరట. అంతేకాదు చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించి నెల రోజులు గడిచినా దర్యాప్తు ప్రారంభించలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీబీఐ అధికారులు కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇండియా సిమెంటు కంపెనీకి వైఎస్ ప్రభుత్వం 0.013 టీఎంసీల నీటిని కేటాయిస్తే, సీబీఐ మాత్రం ‘ఈనాడు’ పత్రికలో 13 టీఎంసీలు అని రాస్తే అదే విషయాన్ని కోర్టుకు చెప్తుంది. దీంతో సీబీఐ దర్యాప్తులో ఉన్న డొల్లతనం బయటపడింది’’ అని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని బతికున్నన్నాళ్లు వైఎస్ ఎప్పుడూ చెప్తుండేవారు.. జగన్‌బాబు జీవితం కూడా తెరిచిన పుస్తకం లాంటిదే’’ అని ఆమె పేర్కొన్నారు. 

అన్యాయంగా అరెస్టు: ‘‘జగన్‌బాబు కోర్టుకు హాజరయ్యే ముందు రోజు అన్యాయంగా సీబీఐ అరెస్టు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ సీబీఐ అందజేసిన నోటీసులను గౌరవించి మూడు రోజుల పాటు విచారణకు సహకరించారు. అయినప్పటికీ విచారణకు సహకరించటం లేదం టూ సీబీఐ అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు జగన్‌కు బెయిల్ రాకుండా వింత వాదన చేస్తోంది. జగన్ ఎంపీ అని, సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్తోంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి.. సీబీఐ విచారణ ప్రారంభంకాక ముందే జగన్‌బాబు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. మునుముందు ఉంటారు. కానీ ప్రజల మధ్య తిరగనీయకుండా సీబీఐ అడ్డుకుంటుంది. అంతేకాదు వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు నిత్యం ఒక వర్గం మీడియాకు లీకులు చేస్తున్నారు. జైల్లో కరెంటు ఉండదు. కోర్టుకు క్రిమినల్స్ మాదిరిగా ఒక మామూలు వ్యానులో తీసుకెళ్లారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మరో విషయం గమనించాలి.. మూడు చార్జిషీట్లు వేసేదాకా కూడా జగన్‌ను ఒక్కసారి కూడా విచారించలేదు’’ అని విజయమ్మ గుర్తుచేశారు. 

వచ్చే ఎన్నికలకు సిద్ధంకండి

ప్రస్తుత ఉపఎన్నికల్లో సాధించిన విజయం స్పూర్తితో వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని విజయమ్మ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం బూత్ కమిటీల ఏర్పాటును సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. అనునిత్యం ప్రజల్లో పనిచేయడం ద్వారా వారికి మరింత దగ్గరకావాలన్నారు.

వైఎస్ కుటుంబం చేసిన తప్పేంటి?


‘‘ఈ రోజు ఈ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో మీరు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ కుటుంబం చేసిన తప్పేంటి? అని నేను అడుగుతున్నా. ఇంత మంది హృదయాల్లో గూడుకట్టుకోవటమే నేరమా? రాష్ట్రంలో ‘ఈనాడు’ చెప్పేదే వేదంలో ఉన్న పరిస్థితుల్లో మరో కోణం వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ని ప్రారంభించటమే తప్పా? వైఎస్ మరణం తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చటమే తప్పా? వైఎస్ లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే నేరమా? వైఎస్ సువర్ణయుగం కోసం పోరాటాలు చేయటం తప్పా? ఇన్ని ఇబ్బందులు, వేధింపులు, కుట్రలు ఎందుకని అడుగుతున్నా. వారు ఎన్ని చేసినా జగన్‌బాబు ఏనాడూ భయపడలేదు, వెనుకంజ వేయలేదు. అందుకే ఈ రోజు బలవంతంగా నిర్బంధించారు’’ అని విజయమ్మ వివరించారు. 

జగన్ తప్పకుండా వస్తారు...

‘‘వైఎస్ ఏ తప్పు చేయలేదు. అదే విధంగా జగన్‌బాబు కూడా ఎలాంటి తప్పు చేయలేదని మీకు మనవి చేసుకుంటున్నా. కోర్టుల మీద, దేవుని మీద నాకు నమ్మ కం ఉంది. కచ్చితంగా ధర్మం, న్యాయం గెలిచి తీరుతుం ది. ఎన్నికల్లో నాబిడ్డ నిర్దోషి అని మీరు తీర్పు ఇచ్చారు. జగన్ నాయకత్వం కోరుకున్నారు. తప్పకుండా జగన్ బయటకువస్తారు. ఉప ఎన్నికల సందర్భంగా జగన్‌ను అణచి వేసేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎంతగా కుమ్మక్కయ్యారో ఫలితాల సరళి తెలియజేస్తోంది. కొన్ని చోట్ల ఒకరికొకరు సహకరించుకుని డిపాజిట్లు పోగొట్టుకున్నారు. రామచంద్రపురం, నర్సాపురంలో టీడీపీ డిపాజిట్లు కోల్పోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే సురేఖమ్మను ఓడించేందుకు పరకాలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాయి. అయినా సరే ఈ మూడు స్థానాల్లో కూడా మనదే నైతిక విజయం. వారు గెలిచి ఓడిపోయారు’’ అని విజయమ్మ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!