YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 8 July 2012

కాంగ్రెస్ నేతల ఆత్మవంచన

బాబుతో కలసి వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేయాలని చూడడం సిగ్గుచేటు
వారి దుశ్చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపిన వ్యక్తి వైఎస్
అందుకే జనం గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ, ఆ మహానేత జన్మదినాన్ని అధికారికంగా జరపకపోవడం చాలా దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మహానేత వైఎస్ రాజకీయాల్లో ‘ప్రజాపక్షం’ అనే కొత్త ఫిలాసఫీని రూపొందించారు. అందువల్లే ఆయన మరణించి మూడేళ్లవుతున్నా ప్రజలు మరువలేకపోతున్నారు. 

అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రతిపక్ష చంద్రబాబుతో చేతులు కలిపి ఆయన్ను అప్రతిష్టపాలు చేయాలని చూడడం సిగ్గుచేటు. కాంగ్రెస్ నేతల దుశ్చర్యను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో దిమ్మతిరగడంతో ఎటూ పాలుపోలేని పరిస్థితిలో వైఎస్ జన్మదినాన్ని కాంగ్రెస్ నేతలు తూతూ మంత్రంగా జరుపుతున్నారని, అయితే కాంగ్రెస్ నేతలకు మహానేత పేరెత్తే అర్హత లేదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో, ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్నారు. ‘‘వైఎస్ ఒక రాజకీయ డిక్షనరీ. ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఎన్ని ఆటంకాలెదురైనా ప్రజల పక్షానే నిలిచారు. ప్రజా సంక్షేమంకోసం నిరంతరం పరితపించారు. అందుకే ఆయన మరణించి మూడేళ్లవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు’’ అని గట్టు కొనియాడారు. అంతేగాక.. వైఎస్ తన ఐదేళ్ల మూడునెలల పాలనలో ఎలాంటి పన్నులు, చార్జీలు పెంచకుండా సంక్షేమాన్ని నడిపించారని ఆయన గుర్తుచేశారు. వైఎస్‌ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా పాలన చేస్తున్నారని, కానీ ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రతిపక్షంతో చేతులు కలిపి ఆయన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించడం హేయమైన చర్యని మండిపడ్డారు. 

అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం

అబద్ధాలు చెప్పడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని, అందులో భాగంగానే బీసీలకు 100 సీట్లు అంటున్నారని గట్టు ధ్వజమెత్తారు. 2009 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే మాదిరిగా బీసీలకు 100 సీట్లని చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని దుయ్యబట్టారు. బాబును రాష్ట్రంలో బీసీలే కాదు.. ఏ వర్గంవారూ నమ్మడం లేదని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రయోజనం ఉండదని గట్టు స్పష్టం చేశారు.

జీవోల్లో తప్పులేదని సర్కారు అంగీకరించినట్టేగా!

వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయ సహాయం చేయాలని నిర్ణయించడం పట్ల గట్టు రామచంద్రరావు ఆశ్చర్యం వెలిబుచ్చారు. మంత్రులకు ప్రభుత్వమే న్యాయసహాయం అందించడమంటే జీవోల్లో ఎలాంటి తప్పులేదని పరోక్షంగా అంగీకరించినట్లే కదా? అని ప్రశ్నించారు. జీవోల విషయమై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రప్రభుత్వం అవి సక్రమమో, అక్రమమో ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. జీవోలకు సంబంధించి మంత్రులకు మద్దతు ఇవ్వడమంటే అసలు తప్పు జరగనట్లేనని, జగన్‌పై కేసే ఉండదని గట్టు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆ జీవోలపై కిరణ్ ప్రభుత్వం స్పందించాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!