YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 7 September 2012

చిన‘బాబు’!

ఒకప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తనను తాను సీఈవోగా చెప్పుకునేవారు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఏ పనయినా, కార్పొరేట్ వ్యవహారంతో సమానమే. లాభం కోసం చేసే పనే! అందుకే, ముఖ్యమంత్రిత్వాన్ని సైతం అలా అభివర్ణించారు. సరే, ఆ వైఖరి పర్యవసానం ఎలా ఉండాలో అలాగే ఉండింది. అయితే, అనుభవం నుంచి పాఠం నేర్చుకునేంత వినయం చంద్రబాబుకు లేదు. పైకి మారినట్లు కనిపించినా చంద్రబాబు సారంలో మార్పు రాలేదనడానికి తాజానిదర్శనం, తన పుత్రరత్నం నారా లోకేశ్ బాబుకు టీడీపీ కేంద్రకార్యాలయ బాధ్యతలను కట్టబెట్టడం. అంటే, లోకేశ్ ఇకమీదట టీడీపీకి సీఈవోగా వ్యవహరిస్తారన్నమాట!

1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకున్నారు చంద్రబాబు. ఆనాటి అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు లాంటి నమ్మినబంట్ల సహకారంతో ఆయన తన కుట్ర జయప్రదంగా పూర్తిచెయ్యగలిగారు. తొమ్మిదేళ్లకు తక్కువగా ఆ పదవిని అంటిపెట్టుకు కూర్చుని, ప్రపంచంలోనే అత్యంత ధనికుడయిన రాజకీయవేత్తగా ‘ఎదగ’గలిగారు చంద్రబాబు. ఇప్పుడు, మామ పెట్టిన పార్టీని కొడుక్కు ధారపోయడానికే లోకేశ్‌ను రంగంలోకి దింపుతున్నారు. భారతీయ పెట్టుబడిదారుల భూస్వామ్య ఆలోచనా విధానానికి అన్నివిధాలా తగినట్లుందీ చర్య.

ముఖ్యమంత్రి పదవిని -అక్రమంగానో, సక్రమంగానో- చేజిక్కించుకోడానికి ముందు చంద్రబాబుకు కొంత రాజకీయ అనుభవం ఉంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే పార్టీ ఫిరాయించిన చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చిన్నాచితకా శాఖలు నిర్వహించిన అనుభవమయినా ఉంది. ఇక, 1983లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మరోసారి ప్లేటు ఫిరాయించడం కష్టమనిపించలేదు.

రిమిలా ఊసరవెల్లి అవతారమెత్తి, మామ పంచన చేరిన తర్వాత, చకచకా మెట్లెక్కి, ‘చాకచక్యం’ చూపించిన ఘనతయినా ఉంది. కానీ, టీడీపీ కొత్త సీఈవోగా రంగప్రవేశం చేస్తున్న లోకేశ్‌కు -సత్యం రామలింగరాజు దయదల్చి చదివించడంతో- ఏదో అమెరికన్ చదువు మిడకడమే తప్ప, ఏమాత్రం రాజకీయ జీవితం లేదు. వరసకు బావమరిదయిన జూనియర్ ఎన్టీఆర్ మామగారి సొంత టీవీ చానెల్‌పై కొద్దికాలం పేను పెత్తనం చెలాయించడమే లోకేశ్‌కు ఉన్న ‘చెప్పుకోదగిన’ అనుభవం.

టీడీపీని నమ్ముకుని, దశాబ్దాల తరబడి ఆ పార్టీ పంచనపడున్న నేతలు డజన్లాదిగా ఉన్నారు. ఎన్టీఆర్ సుపుత్రుడు హరికృష్ణకే పార్టీలో సరయిన స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. లోకేశ్‌కు పిల్లనిచ్చిన బాలకృష్ణకు సైతం టీడీపీలో ఏదో పదవి చేపట్టి ఉద్ధరించాలన్న తపన ఉంది. ఇక తమ చెమ్చాగిరికి సంతోషించి బాబుగారు తమకేదో ఒరగదోసి ఇరగదీస్తాడని నమ్ముకునే టీడీపీ ఎక్స్‌ట్రా ఆర్టిస్టులు రేవంత్ రెడ్డి, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌లాంటి వాళ్లు ఎందరో క్యూకట్టి నిలబడి ఉన్నారు.

వాళ్లందరికీ నామంపెట్టి, తన పుత్రత్నానికే టీడీపీ సీఈవో పదవి కట్టబెట్టడం చూస్తే చంద్రబాబు ఎంత గుండెలుదీసిన బంటో అర్థమవుతుంది. ఓ వైపు కొడాలి నానీ ఉదంతం తర్వాత టీడీపీలో అసంతృప్తి పేట్రేగి, పెల్లుబుకుతోంది. మరోవైపు, ఆ పార్టీకి రాజకీయ భవితవ్యం శూన్యమని పదేపదే రుజువవుతోంది. గతిలేని స్థితిలో చంద్రబాబు స్వయంగా సిగ్గెగ్గులు వదిలేశారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కాపీకొట్టి పబ్బం గడుపుకునేందుకు తెగబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో కూడా, టీడీపీ సీఈవో కుర్చీ విషయానికి వచ్చేసరికి మళ్లీ పుత్రరత్నమే గుర్తుకొచ్చాడు చంద్రబాబుకు! ఇక, ఆయన మారతాడని ఎలా నమ్మడం? 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!