YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 September 2012

ప్రెస్ ‘ట్రస్ట్’కు పట్టిన గతి!


‘నువు నాతో అబద్ధం చెప్పినందుకు చింతించడం లేదు- ఇకమీదట నిన్ను నమ్మలేనే అని బాధపడుతున్నా’నన్నాడట నీషే. పీటీఐ -ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా- కల్పిత కథనం విషయంలో వైఎస్‌ఆర్సీపీ బాధ కూడా అలాంటిదే. సమాచార వ్యవస్థ దేనికయినా ప్రాణం విశ్వసనీయత. దేశంలోని అతిపెద్ద వార్తాసంస్థగా చెప్పుకునే పీటీఐ ఏ చిన్న ప్రలోభానికో కక్కుర్తిపడి తప్పుడు కథనాలు ప్రచురిస్తే సమాచార వ్యవస్థ మీదే నమ్మకం నశిస్తుంది. బాధ్యత గల వార్తాసంస్థ ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలను వైఎస్‌ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘తోసిపుచ్చలే’దంటూ పీటీఐ ఓ కల్పిత కథనాన్ని ప్రసారం చేసింది. ఇది కేవలం అభూత కల్పన మాత్రమేననీ, దీని వెనక నీచమయిన దురుద్దేశాలు ఉన్నాయనీ స్పష్టం చేస్తూ వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధులు శనివారం నాడు -సెప్టెంబర్ ఎనిమిదో తేదీన- ఓ వివరణ ఇవ్వవలసి వచ్చింది.

ఏ రేవంత్ రెడ్డి లాంటి జూనియర్ ఆర్టిస్టో, సంచలనాలను తిని-తాగి-త్రేన్చే ఏదో టీవీ చానెల్‌ను ఆశ్రయించి ఏవేవో కారుకూతలు కూయడం వేరు! ఏ వైబీ రాజేంద్రప్రసాద్ లాంటి అద్దెనోరు ఎక్స్‌ట్రా ఆర్టిస్టో, ఏదో వేదిక మీద నక్కి, ఏవేవో ఊళలు పెట్టి చంకలు గుద్దుకోవడం వేరు! వాటికి వివరణ ఇవ్వాల్సిన అగత్యం కూడా లేదు. అలాంటి పాశవికానందాన్ని అసలు ఖాతరు చెయ్యాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్లు ఎవరో, వారి స్థాయి ఏమిటో జనానికి తెలుసు. కానీ, పీటీఐ నిజస్వరూపం ఇంతవరకూ బయటపడనందువల్ల, ఆ వార్తాసంస్థ ఏదేనా కల్పిత కథనాన్ని ప్రసారం చేస్తే నమ్మే అమాయకులు ఉంటారు. అందుకే, వైఎస్‌ఆర్సీపీ బాధపడుతున్నది.

ఫీజు వాపసు పథకాన్ని బేషరతుగా అందరికీ అనువర్తింప చెయ్యాలనే డిమాండ్‌తో చేసిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ‘కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీని విలీనం చేస్తారా?’అనే ప్రశ్నకు సందర్భశుద్ధి ఏమిటో పీటీఐ ప్రతినిధికే తెలియాలి. ఈ నిరశన దీక్షకు ముందు ఒకసారి ఏలూరులోనూ, మరోసారి సిర్సిల్లలోనూ విజయమ్మ రెండు సందర్భాల్లో నిరశన దీక్ష చేసి ఉన్నారు. మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులు 15 నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో గెలిచి ఉన్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో స్వల్పమయిన తేడాలతో మాత్రమే వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్సీపీలాంటి పార్టీకి -తమ అభ్యర్థుల చేతిలో ఘోరపరాజయం పాలయిన- కాంగ్రెస్‌లో విలీనం కావలసిన అవసరమూ అగత్యమూ ఎంతమాత్రమూ లేదని గ్రహించడానికి గొప్ప మేధావి కానవసరం లేదు. కానీ ఏ కారణం చేతనో పీటీఐ ప్రతినిధికి ఈ ప్రశ్నే తట్టింది. అసందర్భమయిన ఆ ప్రశ్నకు విజయమ్మ సమాధానం ఇవ్వక పోవడాన్ని, ‘తోసిపుచ్చక పోవడం’గా చిత్రిస్తూ కల్పిత కథనాన్ని ప్రసారం చేసేందుకు సదరు ప్రతినిధిని ఏ శక్తి పురికొల్పిందో మరి!

ఒక వార్తా సంస్థ ప్రతినిధి తమ సంస్థ విశ్వసనీయతమీద అనుమానాలు తలెత్తే రీతిలో కల్పిత కథనాలను ప్రసారం చెయ్యడం, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడంతో సమానం. ఆత్మహత్యా సదృశమయిన ఈ దుస్సాహసానికి పాల్పడినందుకు చరిత్ర ఆ ప్రతినిధిని క్షమించదు. అంతకుమించి, మరెవ్వరూ పీటీఐ ‘కథనాలను’ గతంలో మాదిరిగా నిశ్చింతగా నమ్మజాలరు.ఇలాంటి తప్పుడు కథనాల వల్ల వెఎస్‌ఆర్సీపీకి జరిగే నష్టం కన్నా సమాచార రంగానికి జరిగే నష్టమే అధికమని ప్రతి ఒక్క జర్నలిస్టూ గుర్తించాలి! తద్వారా మన ప్రజాస్వామ్యానికి సైతం తీరని నష్టం జరిగిందని ప్రజాస్వామ్య వాదులందరూ గ్రహించాలి!!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!