YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 6 September 2012

విధాన చౌర్యం! ఈ తెగకు మకుటంలేని మహారాజు నారా చంద్రబాబు నాయుడు.


ఇతరులెవరో చెప్పిన మాటను, పాడిన పాటను, రాసిన రాతను, లేదా, రూపొందించిన కళాఖండాన్ని దొంగతనం చేసి ‘సంగ్రహించ’డాన్ని ఇంగ్లిష్‌లో ప్లేజియరిజమ్ అంటారు. వాడుక భాషలో దీన్నే ‘గ్రంథ చౌర్యం’ అంటున్నారు. నిజానికి ఈ చౌర్యానికి ఎల్లలు లేవు. మనకు ఆర్థికంగానో, సామాజికంగానో, కనీసం రాజకీయంగానో ఉపయోగపడుతుందని అనుమానం తగిల్తే చాలు- నినాదాలనూ, విధానాలనూ కూడా ఎత్తుకుపోయి సొంతం చేసుకునే ‘రాజనీతిజ్ఞులు’ మనలోనే వృద్ధిచెందుతున్నారు. ఈ తెగకు మకుటంలేని మహారాజు నారా చంద్రబాబు నాయుడు. ఆయన తాజాగా పాల్పడిన విధాన చౌర్యం ‘ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ పథకం’. త్వరలో జరుగుతాయనుకుంటున్న ఎన్నికల్లో ఈ విధానం పనికొస్తుందనిపించిన మరుక్షణమే ఆయన ఈ పథకంపై జేబురుమాలు పరిచేశారు. ఎంతయినా బాబు బుర్ర పాదరసం!

సంక్షేమ పథకాలతో జన్మవైరం కలిగివున్న చంద్రబాబు 2004- 2009 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాడు. చెప్పకపోవడమేం- పాపం, రెండోసారి కొద్దిగా మారడానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంగా తనకు ఓటేసి గెలిపిస్తే సర్వం ‘ఉచితం’గా అందిస్తానని ఎడాపెడా వాగ్దానాలు చేసి పారేశాడు. వైఎస్ రాజ శేఖరరెడ్డి అప్పట్లో ఆయనకు ‘ఆల్ ఫ్రీ బాబు!’ అని బిరుదు కూడా ప్రసాదించారు. తన పుత్రరత్నం నారా లోకేష్ బాబు -బ్రజిల్ ఆర్థిక వేత్తలనుంచి సంగ్రహించి- ప్రతిపాదించిన ‘క్యాష్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్’ అనే పథకాన్ని 2009 ఎన్నికల సందర్భంగా బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని యత్నించి ఘోరంగా విఫలమయ్యాడు బాబు.

చివరికి ఆయనకు ఆయన బాణీ మార్చక తప్పలేదు. దాంతో, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి, జయప్రదంగా అమలుచేసిన పథకాల మీదకు దృష్టి మళ్లించాడు. ఒకప్పుడు తానే అపహాస్యం చేసిన ఉచిత విద్యుత్తు పథకంతో చంద్రబాబు విధాన చౌర్యం మొదలుపెట్టారు. ఉచిత విద్యుత్తు పథకం అమలుచేస్తే, కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావని బహిరంగంగానే వెటకారం చేశాడు బాబుగారు. అలాంటిది వైఎస్ మరణానంతరం ఆ పథకం సక్రమంగా అమలు చెయ్యనందుకు ప్రభుత్వాలను ఏకిపారేయడానికి -నిస్సిగ్గుగా- తెగించాడాయన. ‘కామాతురాణాం న భయం నలజ్జ!’ అన్నారు కదా పెద్దలు. ఇదే ధోరణిలో ఒకదానితర్వాత మరొకటిగా వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నిటినీ సొంతం చేసుకునే కుట్ర అమలు చేస్తూపోయాడు. తాజాగా ఈ క్రమంలోనే భాగంగా ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకాన్ని తన ఖాతాలో జమ చేసుకోడానికి తెగించారు బాబుగారు. ఒకప్పుడు తానే ఈ పథకాలన్నింటినీ ఎగతాళి చేసిన వాస్తవాన్ని బాబుగారు మర్చిపోయినంత తేలిగ్గా జనం మర్చిపోలేరు కదా! అందుకే, రాజకీయాలతో దూరపు చుట్టరికం కూడా లేని సామాన్యులు సైతం చంద్రబాబు అవకాశవాదాన్ని అసహ్యించుకుంటున్నారు.

రాష్ట్రంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సులను అందుబాటులోకి తేవాలన్నది వైఎస్‌ఆర్ సంకల్పం. వృత్తివిద్య అభ్యసించిన విద్యార్థుల కారణంగా వారి కుటుంబాల ఆర్థిక స్థాయి పెరిగి వాళ్ల కుటుంబాలు దారిద్య్రం ఊబిలోంచి బయటపడేలా చెయ్యడం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా రూపొందించినదే ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకం. అయితే, వైఎస్‌ఆర్ మరణానంతరం ముఖ్యమంత్రులయిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని నీరుగార్చేలా చెయ్యడానికి శతవిధాల ‘కృషి’ చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. తెలిసో తెలియకో, మన గవర్నర్ నరసింహన్ కూడా ఈ పథకానికి చేటుకలిగించే రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. మొత్తానికి మహానేత కన్నకలలు కల్లలు చేసే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. సహజంగానే, ఇది విద్యార్థులనూ, వారి కుటుంబ సభ్యులనూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దశలో ఫీజు వాపసు పథకం కొనసాగేలా చేసేందుకు వైఎస్ విజయమ్మ నడుంకట్టి రెండురోజుల దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె చంద్రబాబు విధాన చౌర్యాన్ని బయటపెట్టి ఎండగట్టారు. అంతేకాదు- 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు నూరు టిక్కెట్లు ఇస్తానని చెప్పి, 47 టిక్కెట్లే ఇచ్చిన బాబు బండారాన్ని కూడా ఆమె బట్టబయలు చేశారు. అదే వైఎస్‌ఆర్ ఎలాంటి దంభాలూ పలక్కుండానే 67 మంది బీసీలకు టిక్కెట్లిచ్చిన సంగతిని కూడా ఆమె గుర్తు చేశారు.

బాబు చేసిన ఇతర నేరాలన్నీ ఒక ఎత్తు- ఈ విధాన చౌర్యం ఒక్కటీ ఒక ఎత్తు! ఈ నీచానికి పాల్పడడం ద్వారా చంద్రబాబు వైఎస్‌ఆర్ చేతిలో మరోసారి ఘోరమయిన నైతిక పరాజయాన్ని చవిచూశారు. ఈ విషయం ఎవరు గ్రహించినా గ్రహించకున్నా చరిత్ర నమోదు చేసితీరుతుంది!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!