YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 5 September 2012

ఫీజుల పథకం అమలుపై అన్ని వర్గాల్లోనూ ఆందోళన

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందా? ఉంటే.. సజావుగా అమలు జరుగుతుందా? వైఎస్ హయాంలోలాగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలరా? లేక పెద్ద చదువులకు పేదలు దూరమయ్యే రోజులు మళ్లీ వస్తున్నాయా? ఇప్పటికే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు విధించి అసలు ఫీజుకే ఎసరు పెట్టిన ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఇంకెంత మందిని ఈ పథకం నుంచి దూరం చేస్తుందో?..... ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. డబ్బు లేని కారణంగా పేదలు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత గత మూడేళ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఫీజుల పథకంపై అనుసరిస్తున్న వైఖరే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణం.

విద్యను సామాజిక పెట్టుబడిగా చూడని సర్కారు: సవాలక్ష ఆంక్షలు, నిబంధనలను విధించి అసలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే గగనంగా మార్చిన ప్రభుత్వం ఏకంగా ఫీజుకే ఎసరు పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్తు గురించి ఆందోళనలో పడ్డారు. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెరిగిన నేపథ్యంలో పెరిగిన ఫీజునంతటినీ తాము చెల్లించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మిగిలిన కోర్సుల ఫీజులు పెరిగితే కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తే ఇక పేదలు పెద్ద చదువులకు దూరం కావాల్సిందేనా అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. విద్యకు పెట్టే ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించకుండా, ఆర్థిక భారంగానే చూస్తూ పథకం మౌలిక స్ఫూర్తి అయిన ‘శాచ్యురేషన్ విధానాని’కే తూట్లు పొడిచిన ప్రభుత్వ వైఖరి పట్ల సామాన్య ప్రజలతోపాటు విద్యావేత్తల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఫీజుల పథకం పట్ల ప్రభుత్వ వైఖరిని విద్యావేత్తలు పూర్తిగా తప్పుపడుతున్నారు. అసలు ఈ పథకం అమలు విషయంలో ఆర్థిక భారం అనే దిశలోనే ప్రభుత్వం అలోచిస్తుందే కానీ, అర్హులైన పేద విద్యార్థులకు ఎలా న్యాయం చేయాలన్నది పట్టడం లేదని విమర్శిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ మంచి ర్యాంకు వచ్చిన పేద విద్యార్థి మంచి కళాశాలలను ఎంచుకున్నా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించదని, ప్రతిభ లేకపోయినా ఏ సౌకర్యం లేని కళాశాలను ఎంచుకున్న విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని చెప్పడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఇవ్వాలి తప్ప ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వ వైఖరి గందరగోళానికి దారితీస్తోందన్నారు. అందరికీ ఫీజు రీయింబర్స్ చేయడం ఆచరణలో సాధ్యం కాదనుకుంటే ప్రభుత్వమే సొంతంగా కళాశాలలు ఏర్పాటు చేసుకుని ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.

కొనసాగించే ఆలోచనే ఉంటే.. ఉపసంఘమెందుకు?: అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించే ఆలోచనే ప్రభుత్వానికి ఉంటే ఎనిమిది మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ఫ్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ముందుకు వెళుతున్నారని, ఇప్పటికే రకరకాల నిబంధనలతో లక్షలాది మందిని పథకం నుంచి దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లోపాలుంటే సరిదిద్దాలి కానీ: మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పథకం అమలులో లోపాలుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలే తప్ప పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అసలు లోటుపాట్లు లేని ప్రభుత్వ పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు లేకపోతే అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.


పథకం వల్లే ఇంజనీరింగ్ చదువుతున్నా

‘‘మాది పేద కుటుంబం. నాన్న చనిపోయారు. అమ్మ సరోజ కరీంనగర్ కమలాపురంలో ఇంటిదగ్గర టైలరింగ్ చేస్తుంది. ఎంసెట్ 2461 ర్యాంకు వచ్చినా డబ్బులు కట్టి ఇంజనీరింగ్ చదివించే స్థోమత మాకు లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పుణ్యమా అని ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ చదవడం నాకల.. అది నిజమైంది. అమ్మ ఎంత కష్టపడ్డా ఇంజనీరింగ్ విద్య అందేది కాదు’’- ఎ.నవిత (సీబీఐటీ- కంప్యూటర్ సైన్స్)

ఆంక్షలు విధించడం సరికాదు

నాణ్యమైన విద్యను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేదరికం కారణంగా ఉన్నత చదువులకు విద్యార్థులు దూరం కాకూడదనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకువచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దీనిపై ఆంక్షలు విధించడం సరికాదు’’.
- కిరణ్, బయోటెక్నాలజీ, నాలుగో సంవత్సరం,
గోకరాజు రంగారాజు కళాశాల, బాచుపల్లి.

మంచి కాలేజీలో చదువుతున్నాను

‘‘మాకు వచ్చిన ర్యాంకుతో మంచి కాలేజీలో పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌తో చదవ డం సంతోషంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని నీరు గార్చడం సరైంది కాదు. విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చె ప్పుకునే ప్రభుత్వం విద్యా పథకాలు తీసేయడం మంచిది కాదు’’
- రాజేశ్ కుమార్, బయోటెక్నాలజీ, ఫైనలియర్, గోకరాజు రంగారాజు కళాశాల, బాచుపల్లి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!