YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 September 2012

మహానేత- ప్రజల సొత్తు!

మనది మార్కెట్ చోదిత వ్యవస్థ! ఇక్కడ దేనికి గిరాకీ ఉంటే దాన్ని సొంతం చేసుకోడానికే అందరూ ప్రయత్నిస్తారు. రాజకీయాలతో సహా ఏదీ దీనికి మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు మరోసారి రుజువు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నుమూసి మూడు సంవత్సరాలు గడిచిపోయాకా, ఆయన తొమ్మిదేళ్లకింద -2003 వేసవిలో- చేసిన చరిత్రాత్మక ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర డైరీని పుస్తకరూపంలో ఇప్పుడు వెలువర్చారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు- ఆ సందర్భంగా ప్రసంగించిన కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ ‘వైఎస్ మా కాంగ్రెస్ పార్టీ సొత్తు!’ అని నిస్సిగ్గుగా ‘క్లెయ్‌మ్’ చేసుకున్నారు. ఇంతకాలం ఈ మౌనం ఎందుకు పాటించారో అర్థంచేసుకోవాలంటే, పెద్ద మేధావి కానవసరం లేదు. 

2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని -వ్యక్తిగత బాధ్యతపై- గెలిపించి గట్టెక్కించిన తర్వాత మళ్లీ ఆ పార్టీ పెద్దెత్తున ప్రజల తీర్పు కోరుతూ జనం ముందుకు వెళ్లవలసి వస్తున్నదిప్పుడే. అది కూడా మొన్న హైకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించమని స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఈ అవసరం ఏర్పడింది. 

దాదాపు దశాబ్ద కాలంగా ఆ పార్టీని విజయపథంలో నడిపించగల బొమ్మ ఎప్పుడూ ఒక్కటే- అది వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మే! నిన్న గాక మొన్ననే సంక్షేమ పథకాలపై వైఎస్ ముద్ర చెరిపెయ్యకపోతే, కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమని ఆ పార్టీలోని ‘భావజాల నిపుణుడు’ ధర్మాన ప్రసాదరావు సారథ్యంలోని ఓ కమిటీ సిఫార్సు చేసింది. మరుక్షణమే అనేక పథకాలకు సంబంధించిన ప్రచార పత్రాల్లోంచి, కాంగ్రెస్ పార్టీ వేదికల మీంచి వైఎస్ బొమ్మను తొలగించేశారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్ బొమ్మ లేకుండా జనం ముందుకెళ్తే -ఓట్ల మాట ఎలాఉన్నా- తరిమితరిమి కొడతారని కాంగ్రెస్ పెద్దలకు అర్థమయిపోయింది. అంతే- ఠక్కున ప్లేటు ఫిరాయించి ‘వైఎస్ మా సొత్తే!’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అవును మరి- ఎప్పుడు దేనికి గిరాకీ ఉంటే దాన్నే మార్కెట్ చేసుకోవడం మన వ్యవసథ మూలసూత్రం! కాంగ్రెస్ పెద్దలు ఈ మూలసూత్రాన్ని కాదని బతకడం ఎలా సాధ్యం?ప్రజల జ్ఞాపకశక్తి బహుపరిమితమని నమ్మే రాజకీయులు ఇలాంటి చిట్కాలూ చమక్కులూ ఝలక్కులూ ప్రదర్శించడం కొత్తేం కాదు. 

అంతెందుకు- రాజశేఖరరెడ్డిముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ వంకలు పెట్టి, విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు -ఫీజు వాపసు పథకంతో సహా- అవే సంక్షేమ పథకాలను కనిపెట్టింది తానేనని డప్పుకొట్టుకోవడం మొదలుపెట్టలేదా? అది కూడా గిరాకీ సూత్రం ప్రాతిపదికగా ఫిరాయించిన ప్లేటే! అయినా, మన పిచ్చిగానీ-కాంగ్రెస్ పెద్దలు ఏ ఎత్తుగడ వేసినా, బాబుగారి సలహా తీసుకోకుండా చేస్తారా?

ఈ సందర్భంగా ఒక్కమాట చెప్పాలి! మామూలు మనుషుల జ్ఞాపక శక్తి మీద మన అసాధారణ ‘మేధావుల’ అంచనా ఏమయినప్పటికీ, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే తేలిపోయిందిప్పుడు. వైఎస్‌ఆర్ బొమ్మకే గెలిపించే శక్తి ఉందని నమ్మినందువల్లనే కదా కాంగ్రెస్ పెద్దలు తొందరపడి తొమ్మిదేళ్ల తర్వాత ఆయన పాదయాత్ర డయరీని ఢిల్లీలో విడుదల చేశారు!

ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఓట్ల్ట సంపాదించిపెడతాయన్న నమ్మకంతోనే కధా చంద్రబాబు ‘విధాన చౌర్యానికి’ తెగబడింది! ఈ రెండు రంగాల్లోనూ పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పక తప్పదు. వైఎస్ బొమ్మను ఆ పార్టీ జెండాపైనే హత్తుకున్నారు వాళ్లు. ఇక, వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు -మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి- వైఎస్ విజయమ్మ జులై నెల్లో సిరిసిల్లలో నేత దీక్ష నిర్వహించారు. 

అగస్ట్ నెల్లో ఏలూరులో ఫీజు పోరు దీక్ష నిర్వహించారు. ఈ గురు, శుక్రవారాల్లోనే -సెప్టెంబర్ ఆరు, ఏడోతేదీల్లో- విజయమ్మ రెండు రోజుల ఫీజు దీక్షను హైదరాబాద్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అంటే, వై ఎస్ ఆర్ పథకాల వారసత్వం కూడా ఆ పార్టీకే దక్కుతోంది! అంచేత, కాంగ్రెస్-టీడీపీల నీచమయిన ఎత్తుగడల వల్ల వాటికి ఓట్ల మార్కెట్‌లో పెద్దగా కలిసొచ్చేసూచనలేం కనబడ్డం లేదు!

అయినా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డిని ‘సొత్తు’గా చూడ్డమూ, దానిమీద ‘దానవిక్రయాది సర్వ హక్కులూ దఖలు పరచుకోవా’లని తాపత్రయపడ్డమూ కేవలం అమాయకత్వం. ఇక, ఫోర్జరీల మీద ఫోర్జరీలు చేసేస్తూ, ఆయన పథకాలను ఆబగా సొంతం చేసుకోవాలనే చంద్రబాబు యావ కేవలం మూర్ఖత్వం! మహానేత వైఎస్ ఆర్ ఏనాడో జనం పరమయిపోయారు. ఆయన అనుసరించిన విధానాలూ, అమలుచేసిన పథకాలను అనుసరించే ప్రతి ఒక్కరికీ వైఎస్ ఆశీర్వాదం లభిస్తుంది. అవేం చెయ్యకుండా మాసొత్తంటే మా సొత్తని గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం! 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!