YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 September 2012

అనునిత్యం ఆత్మహత్యా ప్రక్రియలో ములిగితేలే కాంగ్రెస్ పార్టీని కాపాడ్డం? హాస్యానికయినా ఓ హద్దుండాలి హనుమన్నా!


అరుపులూ కేకలూ అల్లరీ హడావుడీ బతుకుతెరువుగా బండి లాగిస్తున్న కాంగ్రెస్ మార్కు రాజకీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన వ్యక్తి వుత్పల హనుమంతరావు అనే వీహెచ్. అలాంటివాడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను కాపాడుకునే నిమిత్తం ‘మేధో మథనం’ పేరిట ఓ సమావేశం నిర్వహించారు. ఎలాగయినా వీహెచ్ సెన్సాఫ్ హ్యూమర్ చాలా గొప్పది. కాకపోతే, కాంగ్రెస్ పరిరక్షణ కోసం ఆయన నడుంకట్టడమేమిటి? అందుకాయనకున్న అర్హతేమిటి? తన పేరుకు సంపూర్ణంగా న్యాయం చేస్తూ అధిష్టానానికి చెక్కభజన చెయ్యడం తప్పిస్తే, వీహెచ్ ఎన్నడయినా కాంగ్రెస్ అభ్యున్నతికి ఏమయినా ప్రయత్నం చేశారా? (నా పేరే హనుమంతు- ఇది వీహెచ్ అభిమాన డైలాగు! కాదనడానికి ఎవరికయినా ఎన్ని గుండెలు?) ఆమాటకొస్తే, ఆయన జూబ్లీ హాల్లో ‘మేధో మథనం’ సదస్సు నిర్వహించడం మాత్రం చిన్న జోకా? అనునిత్యం ఆత్మహత్యా ప్రక్రియలో ములిగితేలే కాంగ్రెస్ పార్టీని కాపాడ్డం ఒకటా? అదీ హనుమంతరావు ఆధ్వర్యంలోనా? హాస్యానికయినా ఓ హద్దుండాలి హనుమన్నా!

అధిష్టానం ఏమీ మాటాడకముందే అది ఎలా కరెక్టో రుజువుచేసేందుకు రెడీ అయిపోయే అతివిధేయుల జాబితాలో మొదటి పేరే మన వీహెచ్‌ది. మేడమ్ సోనియా గాంధీ పక్కింట్లోనే -11 జన్‌పథ్‌లో- నివాసం ఉండే హనుమన్న అధిష్టానవర్గాన్ని సమర్ధించేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్నీ జరవిడుచుకోరు. అసలు వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. సొంతబలం కొంతయినా లేకపోయినా, తన పేరు చెప్పి ఒక్క కార్పొరేటర్‌నయినా గెలిపించుకోలేకపోయినా, హనుమంతరావు లీడర్‌గిరీకి మాత్రం ఏ ఢోకా రాలేదు! హనుమంతరావు ‘సొంత నియోజక వర్గం’గా చెప్పుకునే అంబర్ పేట (ఒకప్పుడు హిమాయత్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ పొరబాటున ఒకే ఒక్కసారి -చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా- గెలిచింది. ఎనిమిదిసార్లు ఘోరంగా ఓడిపోయింది. అదే నియోజక వర్గ పరిధిలో ఉండే, వీహెచ్ నివాసం ఉన్న డివిజన్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఎడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయికి ఎగబాకగలగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమేమో!

నిజానికి హనుమన్న రాజకీయ రంగప్రవేశమే రంజుగా జరిగింది. 1974లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పుత్రరత్నం సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేపట్టి సొంత సైన్యం సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, హనుమంతరావు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి ఇప్పటి దాకా పైవాళ్ల దయతోనే ఆయన అభ్యున్నతి అప్రతిహతంగా సాగిపోయింది. ఎమెర్జెన్సీ నీలినీడలో, మన రాష్ట్ర అసెంబ్లీకి 1978లో జరిగిన ఎన్నికల్లో వీహెచ్ హిమాయత్ నగర్‌లో వీరంగమాడి, గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం మీద 175 సీట్లు గెలిచినా వీహెచ్ సొంత నియోజకవర్గం హిమాయత్ నగర్‌లో మాత్రం తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఘన విజయం సాధించారు. ‘కాపరం చేసే గుణం కాలిగోటి దగ్గిరే తెలిసిపోతుం’దన్నట్లుగా వీహెచ్ ప్రతిభా పాటవాలు తొలి ఎన్నికల్లోనే తేలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎవరయినా ఏం జరుగుతుందనుకుంటారు? సోది కబుర్లకు తప్ప మరెందుకూ పనికిరాని ఇలాంటి నేతలను తప్పించి కాంగ్రెస్ పార్టీలోని ఇతరులకు అవకాశమిస్తారని భావిస్తారు. కానీ కాంగీయులు అలా చెయ్యలేదు. మరుసటి సంవత్సరమే, 1979లో, వీహెచ్‌ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షపీఠం మీద కూర్చోపెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. ఆ పీఠానికి బల్లిలా అతుక్కుపోయిన వీహెచ్ 1983 దాకా వదల్లేదు. అప్పుడయినా, ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు కింద ఓడించి అధికారం చేజిక్కించుకున్నందువల్లనే కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌లాంటి నేతలను పక్కకు తప్పించారు.

‘నా పేరే హనుమంతు!’ అని గర్వంగా ప్రకటించుకునే వీహెచ్ వెంటనే చిరతలు పట్టుకుని అధిష్టానం ముందు ప్రత్యక్షమయిపోయారు. రెండేళ్లు నానా రకాలుగా పాట్లుపడి ఏపీసీసీ సంయుక్త కార్యదర్శి పదవిలో నియుక్తుడయాడు వీహెచ్. వీహెచ్ రాజకీయ జీవితం మరీ అంత కటిక చీకటి మయమేం కాదు. 1989లో వీహెచ్ ఎమ్మెల్యేగా గెలిచారు- పొదుపుగా రెండువేల ఓట్ల మెజారిటీతో! 1999లో ఇదే వీహెచ్ అదే అంబర్ పేట నియోజక వర్గం నుంచి ఘోరంగా ఓడిపోయారు- 39 వేల ఓట్ల తేడాతో! అదీ మన హనుమన్న ఘన చరిత్ర.

ఇలాంటి వ్యక్తి, కాంగ్రెస్ పరిరక్షణకు నడుంకట్టి రంగంలోకి దిగడంలో అర్థమేమిటి? దానివల్ల ఒరగదోసే పరమార్థమేమిటి? కాంగ్రెస్ పార్టీని చెమ్చాలకు కేంద్రంగా తయారు చేయడం తప్ప, వీహెచ్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సాధించిన ఘనకార్యం ఏముంది? ఈయనగారు పెద్ద పోటుగాడిలా మేధోమథనం నిర్వహిస్తే, జనం తండోపతండాలుగా విరగబడిపోనందుకు మళ్లీ అలకపాన్పు ఎక్కడం కూడా జరిగింది. జి.చిన్నారెడ్డి లాంటి రాజకీయ నిరుద్యోగులు ఇద్దరు ముగ్గురు ఈ మేధోమథనం సదస్సుకు హాజరుకాకపోలేదు. కాకపోతే, వాళ్లు 2014 ఎన్నికల్లో -తలకిందులుగా తపస్సు చేసినా- కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రమాదం లేదని ఉన్నమాట చెప్పేశారు. అంతే- వీహెచ్‌కు కోపం బుస్సని పొంగిందట! పొంగదా మరి? అవతలివాళ్లు కూడా మరో రెండు చిరతలందుకుని అధిష్టానమ్మ కీర్తిగానం చేసి ఉంటే అప్పుడద అచ్చమయిన కాంగ్రెస్ మార్కు ‘మేధోమథన సదస్సు’ అనిపించుకునేది. అలా చెయ్యకుండా నిజాలు మాట్లాడేస్తే ఎలా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!