YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

‘అతి’నాయకుడు


బిజీ షెడ్యూల్లోనూ అనేక ‘కాల్’షీట్లు... 
ఆద్యంతం అనుమానాస్పదంగానే జేడీ వ్యవహార శైలి
జగన్‌కు భౌతిక హాని కలిగించే ఢిల్లీ కుట్రల్లో భాగమే?
చంద్రబాల, లక్ష్మీనారాయణ మధ్య వందలాది ఫోన్ కాల్స్
వేల సంఖ్యలో ఎస్సెమ్మెస్‌లు కూడా ఇచ్చి పుచ్చుకున్న వైనం
క్షణం తీరిక లేని అధికారి అన్ని కాల్స్ ఎలా, ఎందుకు చేశారు?
కుట్ర ఉందో లేదో తేలేది.. వాటిపై దర్యాప్తు జరిగినప్పుడే
దాన్ని వదిలి, జనం దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా పాట్లు
వ్యక్తిగతంగా కక్షపూనినట్టుగా జగన్ కేసు దర్యాప్తు తీరు
క్విడ్ ప్రొ కొను వదిలేసి పక్కదారి పట్టిన దర్యాప్తు
ఏళ్లుగా పెండింగ్‌లో ములాయం, మాయ, జయ కేసులు
జగన్ కేసులో మాత్రమే రాకెట్ వేగంతో సీబీఐ దర్యాప్తు
ఎమ్మార్ కేసులో పొరపాటున కూడా బాబు ఊసెత్తని వైనం
బాబు అక్రమాస్తుల కేసులోనూ మూడునెలలు మొద్దునిద్ర
వైఎస్ మృతి కేసు విచారణను మూణ్నెల్లలోనే ముగించిన జేడీ
టీడీపీతో ఆయన ‘కుటుంబ’ బంధమూ బహిరంగ రహస్యమే!
ఇవన్నీ కుట్రలుగా ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న మహా కుట్రకు సంబంధించిన గుట్టుమట్లన్నీ ఒక్కొటొక్కటిగా బయటపడుతుండడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అధికార ప్రతిపక్షాలతో పాటు దర్యాప్తు సంస్థలూ, ఎల్లో మీడియా చేతులు కలిపి ఒక్కడిపై మూకుమ్మడిగా చేస్తున్న దాడిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన వెంటనే ప్రారంభమైన వేధింపులు, ఆయనకు ప్రజాభిమానం ఏ మేరకు పెరుగుతుంటే ఆ మేరకు పెరుగుతూ వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కు కావడం, జగన్‌ను, ఆయన పార్టీని లేకుండా చేయడం కోసం ఎంతకైనా తెగిస్తుండడం, వీరికి దర్యాప్తు సంస్థలు, ఎల్లో మీడియా తోడు కావడం ఇప్పుడు బహిరంగంగా కనిపించే అంశాలు. కానీ రాజకీయంగానూ, కేసులపరంగానూ ఏమీ తేలదన్న భావనతో ఏకంగా జగన్‌కు భౌతికంగా హాని కలిగించే దిశగా కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుండటం, అందుకు ఆధారాలూ ఉన్నాయని పేర్కొనడం తెల్సిందే. అందులో భాగంగా సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్టును వారు బైటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. జేడీ కాల్ లిస్టులో ఉన్న నంబర్ల ఆధారంగా ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఏ విషయాలు మాట్లాడారు, అందులో కుట్ర కోణముందా లేదా వంటివి తేలాలంటే దానిపై విచారణ జరగాలి. కానీ ఆ విషయాన్ని వదిలేసి, సమస్యను పక్కదారి పట్టించి జనం దృష్టిని మళ్లించడం కోసం ఎల్లో మీడియా నానా పాట్లూ పడుతున్నది. కాల్ లిస్టులో దొరికిపోయిన జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి ముందునుంచీ అనుమానాస్పదంగానే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో చెప్పినట్లల్లా అడుతున్న ఆయన ఇపుడు మోతాదు మించిపోయి ఓవరాక్షన్ చేస్తున్నారు. ఒక కేసులో అత్యుత్సాహం ప్రదర్శించడం, తప్పుడు సాక్ష్యాలైనా చెప్పించేందుకు ప్రయత్నించడం, మరోకేసులో అసలేమీ పట్టించుకోకపోవడం... జేడీ తీరుకు అద్దం పడుతుంది. ఉన్నతాధికారైన లక్ష్మీనారాయణ అనుమానాస్పద వ్యవహారశైలికి ఉదాహరణలివిగో...

1 జేడీకి అంత ఖాళీ ఎక్కడుంది?

సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయన ఇపుడు రాష్ర్టంలో సెలబ్రిటీలకే సెలబ్రిటీ. మూడు ముఖ్యమైన, అత్యంత సున్నితమైన కేసులను దర్యాప్తు చేస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. ఓఎంసీ, ఎమ్మార్, జగన్ ఆస్తుల కేసులను ఆయన దర్యాప్తు చేస్తున్నారు. అటువంటి జేడీకి, చంద్రబాలకు మధ్య వందల సంఖ్యలో ఫోన్ సంభాషణలు జరిగాయి. వేల సంఖ్యలో ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. ఆయనకు ఇంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఇవన్నీ లక్ష్మీనారాయణ అధికారిక ఫోన్ నుంచే సుమా. ఇది కాక ఆయనకు సొంతంగా మరో రెండు ఫోన్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి ఇంకెన్ని వందల కాల్స్, వేల ఎస్సెమ్మెస్‌లు వెళ్లి ఉంటాయో! ఇన్ని కాల్స్ మాట్లాడడానికి, ఎస్‌ఎంఎస్‌లు పంపించడానికి జేడీకి ఎంత సమయం పట్టి ఉంటుంది? రోజుకు సగటున ఎన్ని కాల్స్ చేసి ఉంటారు? క్షణం తీరిక లేని బిజీ అధికారికి ఇంత వెసులు బాటు ఎలా దొరికింది? అసలు వీరిద్దరూ ఏ అంశంపై ఇన్ని కాల్స్.. ఇంత సమయం వెచ్చించి ఉంటారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. చిన్న నాటి స్నేహితులైనంత మాత్రాన.. ఓ స్వచ్ఛంద సంస్థ తరపున చంద్రబాల పనిచేస్తున్నంత మాత్రాన అత్యున్నత దర్యాప్తు సంస్థ అధికారి ఆమెకు అన్ని కాల్స్ చేయాల్సిన అవసరం వస్తుందా అన్నది ప్రశ్న. జేడీ ఆమెతో మాట్లాడడం, చానల్ అధినేతతోనూ మాట్లాడడం అన్నీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలేనా? సాధారణంగా సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థకు జాయింట్ డెరైక్టర్ హోదాలో ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. గుంభనంగా ఉంటారు. ఎవరితోనూ ఏమీ మాట్లాడేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా కేసుల గురించి. కానీ లక్ష్మీనారాయణ మాత్రం అందరికీ వందల సంఖ్యలో ఫోన్లు చేస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ గడిపేస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశమే. మీడియాతో అలా రహస్యంగా మాట్లాడడం, లీకులివ్వడం సీబీఐ మాన్యువల్ ప్రకారం నిషిద్ధం. మరి లక్ష్మీనారాయణ వ్యవహారశైలి అనుమానం కలిగిస్తుందా లేదా..? 

2 ఎమ్మార్‌లో బాబు జోలికెందుకెళ్లడం లేదు?

ఎమ్మార్ కుంభకోణంలో మొదటి ముద్దాయి చంద్రబాబే. 2000లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దానికి పునాదులు పడ్డాయి. ఈ కుంభకోణంలో అసలు నిజాలు బయటపడాలంటే ఎమ్మార్‌కు బాబు భూమి కేటాయించిన 2000 సంవత్సరం నుంచీ విచారణ జరగాలి. ఎమ్మార్ ప్రాజెక్టును ప్రతిపాదించింది హోటల్, గోల్ఫ్ కోర్సు, కన్వెన్షన్ సెంటర్ల కోసం. అది కూడా 250 ఎకరాల్లోనే. కానీ బాబు స్వయంగా జోక్యం చేసుకుని మరీ దాన్ని 535 ఎకరాలకు పెంచారు. విల్లాల ప్రాజెక్టును దాన్లో చేర్చిందీ బాబే! టెండర్ల దశ నుంచి చివరి దాకా ఏ కంపెనీ వస్తుందో, ఎవరు రావాలో, ఎవరికివ్వాలో నిర్దేశిస్తూ చక్రం తిప్పింది కూడా ఆయనే. అధికారం నుంచి దిగిపోయే ముందు హడావిడిగా కొలాబరేషన్ ఒప్పందానికి కూడా బాబే తెర తీశారు. ఆ ఒప్పందం ద్వారా పుట్టిన స్టైలిష్ హోమ్స్ ఆ తర్వాత విల్లాల్ని కొల్లగొట్టి ఎలా డబ్బుల్ని దిగమింగిందీ అందరికీ తెల్సిందే. ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలోనే అంతకుముందు తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న భూమిని చంద్రబాబునాయుడు ఎకరా రూ.కోటి చొప్పున రెడ్డి ల్యాబ్స్‌కు అమ్మారు. తర్వాత అదే ప్రాంతంలో ఎమ్మార్‌కు మాత్రం ఎకరా కేవలం రూ.29 లక్షలకే కేటాయించారు. అంటే ఎమ్మార్ విషయంలో పక్షపాత ధోరణి కనబర్చినట్టు కాదా? సాక్ష్యాలతో సహా కనిపిస్తున్న ఈ వాస్తవాలన్నీ ఎమ్మార్ కుంభకోణంపై ‘కూలంకషంగా’ విచారణ జరుపుతున్న సీబీఐ జేడీకి తెలియవనుకోలేం. అయినా సరే, 2004 తర్వాతి పరిణామాల్నే దర్యాప్తు చేస్తామంటూ గిరి గీసుకుని కూర్చుని.. సుప్రీంకోర్టు అడిగినప్పుడు మాత్రం 2000 నుంచి దర్యాప్తు చేశామని, ఏమీ లేదని తేల్చేశారు. దర్యాప్తులో బాబు పాత్రకు సంబంధించి ఏ విషయాలూ బైటకు రాలేదా? పైన పేర్కొన్న వాస్తవాలు అనుమానించదగిన అంశాలుగా జేడీకి కన్పించలేదా? ఈ ప్రశ్నలకు ఆయన బదులిస్తారా? ఆ విషయాలను బయటపెట్టడం లేదంటేనే ఆయన ఉద్దేశమేమిటో, ఆయన ఏ లక్ష్యంతో పని చేస్తున్నారో అర్థం కావడం లేదా?

3 బాబు అక్రమాస్తుల కేసులో కాలు కదపలేదు


చంద్రబాబు అక్రమాస్తులను ఆర్జించారని, బినామీల పేరుతో కోట్లాది ఆస్తులు కూడబెట్టారని, ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన కేసులో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం తెలిసిందే. అయితే హైకోర్టు విచారణకు ఆదేశించినా సీబీఐ అసలు ఈ కేసులో ముందుకే కదలలేదు. పది రోజుల వరకూ ఫిర్యాదు నకలును, దర్యాప్తు ఆదేశాలను సేకరించనే లేదు. మూడు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించింది. దాంతో బాబు, ఆయన బినామీలు సుప్రీంకోర్టులోనూ, నాట్ బిఫోర్ నాటకాలతో హైకోర్టులోనూ ఇష్టమొచ్చిన రీతిలో ఆటలాడుకున్నారు. చివరకు ‘పిటిషన్‌లోని అంశాల జోలికి పోవడం లేదు. రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేశారు కాబట్టి కేసును కొట్టేస్తున్నా’నని జస్టిస్ రోహిణి తీర్పునిచ్చారు. ఈ మొత్తం కేసులో ఒకటి రెండు నోటీసులివ్వడం మినహా సీబీఐ ముందుకు కదిలిందే లేదు. ఇదే సీబీఐ.. జగన్ కేసులో మాత్రం వారం తిరక్కమునుపే ఆగమేఘాలపైన దర్యాప్తును ప్రారంభించేసింది. జగన్ నివాసాల్లోనూ, పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తల నివాసాల్లోనూ సోదాలు జరిపింది. దేశవ్యాప్తంగా 20 సీబీఐ బృందాలు దాడులు జరిపాయి. సెలవు రోజుల్లో కూడా సిబ్బందిని సమీకరించుకున్నారు. ప్రాథమిక దర్యాప్తును మూడు వారాల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశిస్తే, రెండు వారాల్లోనే పూర్తి చేస్తామని కోర్టుకు నివేదించారు! బాబు కేసులో అలా, జగన్ కేసులో ఇలా వ్యవహరించడం అధికార-ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు కుట్రలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాలుపంచుకుంటున్నారన్న అనుమానాలకు ఆస్కారమివ్వడం లేదా?

4 జగన్ అరెస్టు... ఆ తర్వాత ఆధారాలకు ప్రయత్నం!

జగన్‌ను ఎలాగైనా కేసులో ఇరికించాలని తొమ్మిది నెలలుగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన సీబీఐ, ఇప్పుడు ఆధారాల కోసం నిందితులపై ఒత్తిడి తెస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆధారాల కోసం సీబీఐ అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని కేసులో సహ నిందితులు, జగతి సంస్థ పెట్టుబడిదారులు వాపోతుండడం నిజం కాదా? జగన్‌పేరు చెబితే కేసు నుంచి బైట పడేస్తామంటూ వారిని ప్రలోభాలకు గురి చేయడం ఏ తరహా దర్యాప్తో జేడీయే చెప్పాలి. జగన్ చెబితేనే పెట్టుబడి పెట్టామంటూ వాంగ్మూలమివ్వాల్సిందిగా పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలనే చార్జిషీట్లలోనూ యథాతథంగా ప్రస్తావిస్తుండటం తప్ప ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకూ ఒక్క కొత్త విషయం కూడా రాబట్టలేకపోయింది. ‘‘నేను నా సర్వీసులో ఎన్నో కేసుల దర్యాప్తులో పాల్గొన్నాను. కానీ ఇంత వ్యక్తిగత కక్ష పెట్టుకున్న అధికారిని చూడలేదు. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ విచారణ సాగలేదు. దొరికిన వివరాలతోనే కోర్టుకు చార్జిషీటు సమర్పించేవాళ్లం. కానీ ఈ కేసులో ఆ అధికారి ప్రవర్తన దారుణం’’ అని దర్యాప్తులో పాలుపంచుకున్న ఓ కింది స్థాయి అధికారి ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లక్ష్యంగా సాగుతున్న ఈ విచారణ ఎక్కడకు దారితీస్తుందో అర్థం కావడం లేదని ఆ అధికారి విలేకరులతోనే వ్యాఖ్యానించారు. జగన్ విషయంలో అంతలా వ్యక్తిగత కక్ష పెట్టుకున్న ‘ఆ అధికారి’ లక్ష్మీనారాయణేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంటున్నారు. అందులోని నిజానిజాల మాటెలా ఉన్నా.. పై ఉదాహరణల నేపథ్యంలో దర్యాప్తు అధికారిగా లక్ష్మీనారాయణను ఎందుకు కొనసాగనిస్తున్నట్టు? దీని వెనక ఎటువంటి దురుద్దేశాలూ లేవా?

5 క్విడ్ ప్రోకో ను ఎందుకు వదిలేశారు?

జగన్ ఆస్తుల కేసులో క్విడ్ ప్రోకో కోణాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా దర్యాప్తు ఆదేశాల్లో హైకోర్టు పేర్కొంది. 2004-2009 మధ్య దివంగత వైఎస్ హయాంలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారి ద్వారా ఎక్కువ ప్రీమియానికి సాక్షిలో పెట్టుబడులు పెట్టించారనేది ప్రధానమైన ఆరోపణ. హైకోర్టుకు ఆ మేరకు ఫిర్యాదు వచ్చింది. కోర్టు కూడా క్విడ్ ప్రోకో పై దర్యాప్తు చేయాలని మాత్రమే తీర్పులో స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం సీబీఐ అసలు ఆ విషయాన్నే వదిలేసింది. దశాబ్దం క్రితం 1999లో జరిగిన వ్యాపార లావాదేవీల గురించి చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఒత్తిడి చేయడం ఇందుకు నిదర్శనం. ఎలాగైనా సరే, ఏదో ఒక ఆధారాన్ని సంపాదించాలన్న దుగ్ధ తప్ప కేసును సక్రమ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎక్కడా కన్పించడం లేదని దీనిని బట్టి అర్థం కావడం లేదా? అంతేకాదు, సాక్షికి వచ్చిన ప్రకటనల గురించి కూడా సీబీఐ కూపీ లాగడం, పలువురిని పిలిచి ప్రశ్నలతో వేధించడం ఈ కేసు దర్యాప్తు ఏ తీరులో సాగుతోందో చెప్పకనే చెబుతోంది. మొదటి నుంచి జగన్ చుట్టూ, సాక్షి చుట్టూ తిరుగుతున్న సీబీఐ.. అసలు ఈ కేసుకు మూలమైన జీవోలపై మాత్రం అస్సలు దృష్టి పెట్టడం లేదు. దర్యాప్తు సక్రమంగా జరగడం లేదనేందుకు ఇది నిదర్శనం కాదా? హైకోర్టు ఆదేశాలకు లోబడి దర్యాప్తు జరిపించకుండా, దాన్ని దారి తప్పించడం వెనక ఎలాంటి కుట్రా లేదంటారా? దీనికి జవాబు చెప్పాల్సింది దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న లక్ష్మీనారాయణ కాక మరెవరు?

6 వైఎస్ మరణంపై దర్యాప్తు తూతూ మంత్రం
వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ర్టం పెద్దదిక్కును కోల్పోయి అల్లాడిపోయింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారు. వైఎస్ మరణానంతరం రాజకీయంగానూ, ఆర్థికంగానూ రాష్ర్టం అల్లకల్లోలమయింది. ఆయన మరణించి మూడేళ్లు దగ్గర పడుతున్నా జనం ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. అంతటి సంచలనం సృష్టించిన ఆ దుర్ఘటనపై అనేక అనుమానాలు, కుట్ర కోణంపై రకరకాల ఆందోళనలు ఉన్నాయి. స్వయంగా వైఎస్ కుటుంబమే ఆ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరింది. అయితే సీబీఐ మాత్రం ముచ్చటగా మూడు నెలల్లో ఆ దర్యాప్తును తేల్చేసింది. కుట్ర కోణం లేదని, జరిగింది ప్రమాదమేనని తీర్మానించేసింది. ఎంతో సున్నితమైన ఆ కేసులో అంత ఆతృతగా దర్యాప్తును తూతూమంత్రంగా ముగించేయడం ఎందుకో అర్థం కాని విషయం. దర్యాప్తు సరిగా జరగడం లేదని అప్పట్లో అనేక ఆరోపణలొచ్చాయి. అయినా సీబీఐ పట్టించుకున్న దాఖలా లేదు. పైగా ఈ దర్యాప్తుకు నేతృత్వం వహించింది కూడా జేడీ లక్ష్మీనారాయణే కావడం విశేషం. ఒక ముఖ్యమంత్రి మరణించిన ఘటనపై అంత వేగంగా, హడావుడిగా దర్యాప్తును పూర్తి చేయాల్సిన అవసరమేమిటి? ఇందులో ఎలాంటి కుట్ర కోణమూ లేదంటారా?

7 ములాయం, జయ కేసుల్లో ఈ తొందరేదీ?
దేశంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులనేకం చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, మాయావతి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెట్టారు. కానీ ఒక్క జగన్‌పై నమోదు చేసిన కేసులో మాత్రమే సీబీఐ దర్యాప్తు రోజువారీ పద్ధతిలో కొనసాగడంపై న్యాయ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ప్రభుత్వ పదవులు అనుభవించిన వారిపైనే పెట్టాలని, ఏ పదవులనూ అనుభవించని జగన్‌పై పెట్టిన కేసే చెల్లనిదని వారు అభిప్రాయ పడుతున్నారు. ఎంపీ అయిన జగన్‌పై కేసు పెట్టే ముందు లోక్‌సభ స్పీకర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా సీబీఐ పట్టించుకోలేదు. పైగా, తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదన్న కారణం చూపుతూ ఆయనకు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది. నేరం ఒప్పుకుంటున్నాననే రీతిలో సమాధానాలు చెప్పాలన్న సీబీఐ తీరు రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులే పేర్కొంటున్నారు. జగన్ విషయంలో సీబీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దీన్ని బట్టే అర్థం కావడం లేదా? జగన్‌పై ఎలాగైనా నేరం నిరూపించి ఆయనను శిక్షించాలన్న తాపత్రయంతో సీబీఐ ఎందుకిలా వ్యవహరిస్తున్నట్టు?

8 టీడీపీతో సంబంధాలు బహిరంగ రహస్యం!

అత్యున్నత దర్యాప్తు సంస్థకు జాయింట్ డెరైక్టర్‌గా ఉన్న లక్ష్మీనారాయణకు తెలుగుదేశంతో సంబంధాలున్నాయంటూ వార్తలొచ్చాయి. ఆయన తన భార్యకు టీడీపీ తరఫున టికెట్ సంపాదించేందుకు ప్రయత్నించారని, టీడీపీ సీనియర్ నాయకుడొకరు అందుకు ఉపకరించారని గతంలో ఆరోపణలొచ్చాయి. సదరు సీనియర్ నేత గతంలో సీబీఐలోనే ఉన్నతాధికారిగా పని చేసిన వ్యక్తి కావడం విశేషం. ఇప్పటికి కూడా లక్ష్మీనారాయణకు ఆ మాజీ అధికారి టచ్‌లోనే ఉన్నారని, ఆయన సూచనలు, సలహాల మేరకే లక్ష్మీనారాయణ నడుచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ వ్యవహారశైలి ఇలా ఉండటం పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ ఓ ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి కుట్రల్లో పాలుపంచుకోవడం, సంకుచిత స్వార్థ రాజకీయాల్లో భాగం కావడం ఆందోళన కలిగించే అంశం కాదా?!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!