YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

'పెద్దాయన'తోనే సెలవు!

గతమెంతో ఘనం. వర్తమానం గందరగోళం. భవిష్యత్‌పై అయోమయం. ఇదీ మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి. గాడితప్పిన పాలనలో చుక్కాని లేని నావలా ఉంది. నాడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పంచకళ్యాణిపై ప్రగతి వైపు పరుగులు తీసింది రాష్ట్రం. నేడు ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడ్చింది అన్నట్టు ఉంది రాష్ట్ర పరిస్థితి. అప్పటికి ఇప్పటికి ఒక్కటే తేడా. అదే జన హృదయనేత లేని లోటు. ఒకే ఒక్కడి మరణం రాష్ట్ర భవిష్యత్ ను మార్చేసింది.

ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసిన 'పెద్దాయన' సరిగ్గా మూడేళ్ల క్రితం ఇక సెలవని వెళ్లిపోయారు. నీ వెంటే మేమంటూ రాష్ట్రం నుంచి అభివృద్ధి-సంక్షేమం కూడా ఆయనతో పాటే వెళ్లిపోయాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేపట్టిన సంక్షేమ పథకాలు జనం ముఖం చూడటం మానేశాయి. ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడింది. శాంతిభద్రతల సమస్యలు వాడవాడలా వెల్లువెత్తాయి. అభివృద్ధి పట్టని నేతల ఏలుబడిలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు తరలిపోయాయి. మహానేత మరణం తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా చీకట్లు కమ్ముకున్నాయి. 

రాజశేఖరరెడ్డి మొదటిసారి సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులు ఆయన ఈ లోకం వీడగానే మళ్లీ రాష్ట్రం మీద దండెత్తాయి. ఉచిత విద్యుత్‌ ఊసులేక పల్లెలు గొల్లుమన్నాయి. అన్నదాతకు బతుకు బారమైంది. నిరుపేదకు చిరునవ్వు దూరమైపోయింది. వ్యవసాయం దండగన్న రోజులు మళ్లీ వచ్చాయి. రైతన్నలు సేద్యానికి సెలవులిచ్చేశారు. వరి కంటే ఉరి మేలనుకున్నారు. అప్పుల ఊబిలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. చేతివృత్తుల వారికి చేయూత కరువైంది. చేనేత కార్మికుల బతుకు బారమైంది. 108 మూగబోయింది. 

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. జలయజ్ఞం కనుమరుగై ప్రాజెక్ట్‌లు పడకేశాయి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల మంజూరు ప్రస్తావనే లేదు. పేదోడి ఉన్నత చదువులు చూసి నేటి ప్రభువులకు కన్నుకుట్టింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై బేరాసారాలతో పేద విద్యార్థులకు ఉన్నతచదువులు అందని ద్రాక్షే అయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరెంట్‌ కోతలతో అల్లాడిపోతున్నాయి. విధి మహానేతతో పాటు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనూ కాటేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్‌ లేని రాష్ట్రానికి ఆమడదూరంలో అభివృద్ధి సంక్షేమం పారిపోతున్నాయి. 

ఇటు మహానేత కుటుంబంపై కక్షసాధింపులు మొదలయ్యాయి. ఆయన కోసం ప్రాణాలొదిలిన కుటంబాలను పరామర్శిస్తానని, వారి కన్నీళ్లను తుడిచి, ఓదార్చుతానన్నందుకు జగన్‌పై నల్లకాలువ సాక్షిగా వేధింపులు జోరందుకున్నాయి. ఏ పార్టీకైతే వైఎస్‌ జీవితాంతం సేవలు చేశారో, ఏ పార్టీనైతే రెండుసార్లు అధికారంలోకి తెచ్చారో ఆ పార్టీయే...దివంగత నేత కుటుంబంపై కక్షగట్టింది. ఓదార్పుయాత్రను చూసి ఓర్వలేకపోయింది. జనం మధ్య జగన్‌ను చూడలేక జగమంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. 

మహానేత కుటుంబంలోనూ చిచ్చుపెట్టింది. వ్యాపారాలు చేయడం, ఆస్తులు సంపాదించడమే నేరమన్నట్టుగా జగన్‌ని దోషిగా చిత్రీకరించే మహాకుట్రకు బీజం వేసింది. ఆర్ధికనేరాలు ఆరోపణలతో సీబీఐని ఉసిగొల్పింది. జగన్‌ నాడు ఏ పదవిలో లేకపోయినా, ప్రభుత్వ అధికారి కాకపోయినా అక్రమాలకు పాల్పడ్డారంటూ వేధించింది. ఆయన సంస్థలపై లెక్కలేనన్ని దాడులు చేయించింది. ఢిల్లీ పెద్దలకు వంగివంగి దండాలు పెట్టడం తన వల్లకాదన్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నాలుగ్గోడల మధ్య బంధించింది. 

వైఎస్‌ సతీమణి విజయమ్మ, ఆయన కుమార్తె షర్మిళ, వైఎస్‌ భారతి రాత్రంతా నడిరోడ్డుపై గడిపే పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీ కల్పించింది. జీవితాంతం సేవ చేసినందుకు మహానేత కుటుంబానికి సరైన బహుమానమే ఇచ్చింది. అయితే ప్రజలు మాత్రం వైఎస్ఆర్ ను మరవలేదు. ఆ మహానేత కుటుంబానికి మేమున్నామంటూ అండగా నిలిచారు. వైఎస్ భౌతికంగా మరణించి మూడేళ్లు అయినా ఆయన ప్రజల గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోయారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!