YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌ను బయటపెడుతున్న ఓటింగ్ సరళి

* తనకు సహకరించిన కాంగ్రెస్‌కు సాయం చేయాలని చెప్పిన అధినేత!
* పలు నియోజకవర్గాల్లో ఓట్ల బదలాయింపు.. టీడీపీ క్రియాశీలక సభ్యుల ఓట్లూ కాంగ్రెస్‌కే..!
* తెరవెనుక ఒప్పందాలు టీడీపీనే దెబ్బ తీశాయంటున్న నేతలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదని ప్రజలను నమ్మించడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదనడానికి టీడీపీ నేతలు బయటకు అనేక ఉదాహరణలు చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా చేస్తున్న విశ్లేషణల్లో అవాక్కయ్యే నిజా లు బయటపడ్డాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతోనే పరస్పరం ఓట్లు బదలాయించుకున్నాయన్న విషయాన్ని మెజారిటీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి తేటతెల్లం చేసింది. 

అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ సభ్యులు, క్రియాశీలక సభ్యుల ఓట్లు కూడా కాంగ్రెస్‌కే పడ్డాయని, దీనివల్ల టీడీపీ బాగా నష్టపోయిందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పార్టీ సభ్యులుగా ఉంటారు. క్రమం తప్పకుండా పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొనే వారికి క్రియాశీలక సభ్యత్వం ఇస్తారు. క్రియాశీలక సభ్యులతో పార్టీ కేంద్ర కార్యాలయం నిత్యం టచ్‌లో ఉంటుంది. పార్టీ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు వారి సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతుంటుంది. అయితే, ఇటీవలి ఉప ఎన్నికల్లో ఇటువంటి క్రియాశీలక సభ్యుల ఓట్లు కూడా పార్టీ అభ్యర్థులకు పడలేదని తేలింది. 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీకి గట్టి పట్టుందని ఇంతకాలం చెప్పుకుంటున్న టీడీపీకి ఆ జిల్లాల్లోని రామచంద్రపురం, నరసాపురంలలో డిపాజిట్లు కూడా దక్కలేదు. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీకి 8,082 మంది క్రి యాశీలక సభ్యులు, తొమ్మిది వేలకుపైగా సాధారణ సభ్యులు ఉన్నారని ఆ పార్టీ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన మిగతా ఓటర్లతో సంబంధం లేకుండా కేవలం పార్టీ సభ్యులు ఓట్లు వేసినా ఉప ఎన్నికల్లో అక్కడి టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావుకు 17 వేలకుపైగా ఓట్లు వచ్చేవి. కానీ, ఆయనకు వచ్చినవి 6,256 ఓట్లే. పార్టీకి చెందిన క్రియాశీలక సభ్యులు కూడా ఆయనకు ఓటు వేయలేదని ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. 

తమను అన్ని విధాలా కాపాడుతున్న కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించాలని అధినేత చేసిన సూచన మేరకు జిల్లా పార్టీలో కీలకపాత్ర పోషించే నేతలందరూ దగ్గరుండి మరీ అధికార పార్టీకి ఓట్లు బదిలీ అయ్యేలా చూశారనే వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు సహకరించేందుకే సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న చిక్కాలను చివరి నిమిషంలో అభ్యర్ధిగా బరిలోకి దింపారని, డిపాజిట్టు కూడా రాకుండా అవమానించారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇక నరసాపురం నుంచి పోటీ చేసిన చినమిల్లి సత్యనారాయణ గతంలో స్వతంత్రంగా బరిలోకి దిగినప్పుడు సుమారు 25 వేల ఓట్లు సాధించారు. ఇప్పుడు టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆయనకు కేవలం 8,813 ఓట్లే దక్కాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి సాధారణ, క్రియాశీలక సభ్యులు 16,787 మంది ఉన్నారు. ఈ లెక్కన పార్టీ సభ్యుల్లో సగం మంది మాత్రమే ఆయనకు ఓటు వేశారని నేతలు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలోనే ఎక్కడా లేని స్థాయిలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1,06,500 మందికి టీడీపీ సాధారణ సభ్యత్వం ఇచ్చింది. ఈ విషయాన్ని పార్టీ నేతలే పలుసార్లు చెప్పారు. వీరు కాకుండా 8,005 మంది క్రియాశీలక సభ్యులు కూడా ఉన్నారు. అలాంటి ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన దేశంలోనే అత్యంత ధనికుడైన అభ్యర్థి దీపక్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 46,695 మాత్రమే. అంటే.. పార్టీ సభ్యుల్లో సగం మంది కూడా దీపక్‌రెడ్డికి ఓటు వేయలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీలో సాధారణ సభ్యులుగా 24 వేలమంది, క్రియాశీలక సభ్యులుగా 37,065 మంది ఉన్నారు. అంటే ఇక్కడి పార్టీ సభ్యులే 61 వేల మందికి పైగా ఉన్నారు. అయితే, ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ నేత బెరైడ్డి విశ్వమోహనరెడ్డికి మాత్రం 44,052 ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే పెద్దమొత్తంలో టీడీపీ ఓటు బ్యాంకు గల్లంతయింది. 

కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు చెందిన ఓట్లు కొంతమేరకు టీడీపీకి వచ్చినప్పటికీ ఎక్కడా కూడా పార్టీకి అనుకున్న ఫలితం దక్కలేదని ఈ వ్యవహారాలను విశ్లేషించిన నాయకుడొకరు చెప్పారు. గత రెండేళ్లుగా జరుగుతున్న అనేక ఎన్నికల్లో తెరవెనుక జరిగిన ఇలాంటి ఒప్పందాల వల్ల పార్టీకి నష్టం జరగడమే కాకుండా మొత్తం పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని మరో సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!