YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ఆధార్ మరింత జాప్యం

* 16 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో వివరాల నమోదుకు బ్రేక్
* టెండర్లు ఖరారు చేయవద్దని హైకోర్టు ఆదేశం
* తొలి దశలో అక్రమాలకు పాల్పడిన సంస్థ పిటిషనే కారణం

హైదరాబాద్, న్యూస్‌లైన్: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరి గుర్తింపునూ తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ ప్రాజెక్టు అమలు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు ఇప్పుడు అయోమయంలో పడింది. రాష్ట్రంలో రెండో దశ కింద 16జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఆధార్ నమోదుకు సాంకేతిక సంస్థల ఎంపిక కోసం పౌరసరఫరాల శాఖ మే 18న టెండర్లు పిలిచింది. ఈ జిల్లాల్లోని జనాభా వివరాల నమోదు పనులు చేసేందుకు 12 సంస్థలు ముందుకు వచ్చాయి. సోమవారం సాయంత్రం టెండర్లు తెరిచారు. 

గతంలో శాశ్వత రేషన్ కార్డుల జారీ, తొలి దశ ఆధార్ పనుల్లో అక్రమాలు, ఇతర సంస్థలు వివరాలు నమోదు చేసిన పనులను తాము చేసినట్లుగా బిల్లులు పొందారనే ఆరోపణలపై టెక్‌స్మార్టు కంపెనీని టెండర్లు నుంచి తొలగించారు. దీంతో ఆ సంస్థ హైకోర్టుకెళ్లింది. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాన్ని పౌర సరఫరాల శాఖ ఉల్లంఘించిందని, ఒప్పందం ప్రకారం ఆధార్ నమోదు పనులను తమకూ అప్పగించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టెండర్ల ప్రక్రియను ఆపివేయాలని ఆదేశించింది. టెండర్ల పూర్తికి అనుమతించాలని కోరుతూ రెండుమూడు రోజుల్లో కౌంటరు దాఖలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హర్‌ప్రీత్‌సింగ్ మంగళవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

లక్ష్యంలో 60 శాతం కూడా పూర్తి కాలేదు..
సర్కారు కౌంటరు దాఖలు సంగతి ఎలా ఉన్నా 16 జిల్లాల్లోని(విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్‌ఆర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ) పట్టణ ప్రాంతాల్లో ఆధార్ పనుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన ఆధార్ నమోదు పనులు ఈ నెలలోనైనా పునఃప్రారంభమవుతాయనుకుంటే అది జరిగే పనిలా కనిపించడంలేదు. కేంద్ర ప్రణాళిక శాఖకు అనుబంధ సంస్థ అయిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 20 కోట్ల మందికి ఆధార్ జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

తొలిదశలో మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 3.10 కోట్ల మందికి ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖకు ఈ పనులు అప్పగించింది. ప్రజల వివరాల నమోదు సంస్థల ఎంపిక నుంచి అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లక్ష్యంలో 60 శాతం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. మిగిలిన 16 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పనులను పలు వాణిజ్య బ్యాంకులు చేపట్టినా ఇదీ అంతంతమాత్రంగానే ఉంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!