YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 1 July 2012

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని ఉప ఎన్నికల్లో రుజువైంది: నారాయణ

- ఫలితాలను విశ్లేషిస్తూ నారాయణ 4 పేజీల ప్రకటన విడుదల
- కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వచ్చాయంటే అది టీడీపీ పుణ్యమే
- జగన్‌పై సానుభూతితోనే వైఎస్సార్ సీపీకి ఓట్లు పడ్డాయనడం సరికాదు
- సానుభూతితో అన్ని సీట్లు గెలవడం సాధ్యం కాదు.. క్విడ్ ప్రో కో ఆరోపణలను జనం నమ్మలేదు
- సీబీఐ తీరునూ విశ్వసించడం లేదు
- జగన్ అరెస్టయినా.. కాకున్నా ఫలితాల్లో మార్పుండేది కాదు
- కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు
- కిరణ్ బలహీన ముఖ్యమంత్రి 
- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు స్పష్టమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఉపఎన్నికలు జరిగిన 18 నియోజకవర్గాలలో పాలక పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా ఆ రెండు సీట్లయినా వచ్చాయంటే అది టీడీపీ పుణ్యమేనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సానుభూతితో ఓట్లు పడ్డాయనేదానిలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికల్లో మట్టికరిచాయని.. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ పరకాలలోనూ భారీ ఓట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ మిత్రపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం నాలుగు పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తమకు ఇష్టం లేని, నచ్చని ఫలితాలను.. ఓటర్ల అవినీతికి, ప్రజాస్వామ్య వైఫల్యానికి ముడిపెట్టడం తగదని హితవు పలికారు. క్విడ్ ప్రో కో ఆరోపణలను ప్రజలు విశ్వసించలేదని.. డబ్బు, మద్యం పంపిణీలో బూర్జువా పార్టీలన్నీ పోటీ పడ్డా.. జగన్ పార్టీనే ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. 

వారసత్వ రాజకీయాలు సోనియా, రాహుల్‌కు వర్తించవా?
‘నిస్సహాయతతో, ఆగ్రహంతో చేసే విశ్లేషణలు, ప్రయోజనకరం కాదు. మరింత లోతైన పరిశీలన జరగాలి. కన్నీళ్లతోనో, సానుభూతితోనో అన్ని సీట్లు గెలవడం అసాధ్యం. జగన్ అరెస్ట్ అయినా కాకపోయినా ఈ ఫలితాల్లో మార్పు ఉండేది కాదు. అయితే జగన్ అరెస్ట్.. ఆయన అభిమానుల్లో, అనుచరుల్లో మరింత పట్టుదలను పెంచిన మాట వాస్తవం. జైల్లో పెట్టిన బాధితుడిగా ప్రజలు భావించారు’ అని నారాయణ ఆ ప్రకటనలో విశ్లేషించారు. వైఎస్ మరణాంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చాలా తప్పులు చేశారని, ఓదార్పు యాత్రను అడ్డుకోవడం జగన్‌కు ఆయుధమైందని తెలిపారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాలు జగన్‌కే వర్తిస్తాయా? ఢిల్లీలో సోనియా, రాహుల్‌కు వర్తించవా? అనే ప్రశ్న కూడా వచ్చిందని పేర్కొన్నారు.

వైఎస్‌పై విమర్శలూ కొంపముంచాయి..
కాంగ్రెస్‌లోని ఓ వర్గం వైఎస్ రాజశేఖరరెడ్డిపైనే దాడికి పూనుకోవడం కూడా ఆ పార్టీ కొంపముంచిందని నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటేనే అవినీతి అనే నానుడి ప్రజల్లో పాతుకుపోయిన నేపథ్యంలో ఓ శాసనసభ్యుడి పోస్టు కార్డు పిటిషన్‌పై సీబీఐ విచారణ జరగడం, ఈ దర్యాప్తు తీరును ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. ‘రోశయ్య తాత్కాలిక నాయకత్వం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీనీ, ప్రభుత్వాన్నీ అదుపులో పెట్టలేకపోయారు. సొంత మంత్రులే సీఎం మీద విమర్శలు చేస్తున్నా అధిష్టానం చర్య తీసుకునేందుకు అనుమతించలేదు’ అని అన్నారు.

సీఎం కిరణ్ బలహీనమైన సీఎం అని నారాయణ చెప్పారు. ‘సీఎంకు పీసీసీ అధ్యక్షుడికి మధ్య మనస్పర్థలు పెరిగాయి. మద్యం మాఫియాలో కాంగ్రెస్ నాయకుల పాత్ర బట్టబయలైనా కేసుల్ని మాఫీ చేయించుకున్నారు. వాటిని బయటపెట్టిన పోలీసు అధికారులను బలి చేశారు. ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు పంపితే.. ఓ మంత్రిని మాత్రమే జైల్లో పెట్టిన తీరు కూడా కాంగ్రెస్ నాయకత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా చేసింది’ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని ప్రజలు జీర్ణించుకోలేదని విశ్లేషించారు. 

జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించారు: ఈ ఉపఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు జగన్‌పై దాడికి సమయాన్ని కేటాయించగా.. జగన్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాడి.. ప్రతిపక్ష పాత్రను పోషించారని నారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో నిరంతరం తిరుగుతూ సంబంధాలు పెంచుకున్నారని తెలిపారు. 

ఇప్పుడేం జరుగుతుంది?
‘కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు పెరిగి.. రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చు. అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్ జగన్‌పై పెట్టిన కేసుల్ని నీరుగార్చవచ్చు. తిరిగి పార్టీలోకి ఆహ్వానించవచ్చు. అయితే ఆయన(జగన్) దాన్ని నిరాకరించవచ్చు’ అని ఆయన విశ్లేషించారు. 2014 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందున.. ఇప్పుడున్న పరిస్థితిని నిలబెట్టుకోవడం జగన్‌కు అంత సులభం కాదని అంచనా వేశారు. అయితే, గెలుపోటములతో పార్టీల రాజకీయ విధానాలు మారవని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!