YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 1 July 2012

ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల ధోరణితో రైతు కుదేలు

* పరిహారం అందలేదు.. అందిన చోటా బకాయిలకే జమ
* ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల ధోరణితో రైతు కుదేలు
* గత ఖరీఫ్ పంట నష్టం ఎట్టకేలకు ఏప్రిల్‌లో విడుదల
* రూ.1,816.91 కోట్లు విడుదలైతే.. బ్యాంకులకు చేరింది రూ.వెయ్యి కోట్లే.. అదీ పాత అప్పులకే సరి
* 25 శాతం మందికి కూడా అందని ఇన్‌పుట్ సబ్సిడీ
* రుణాల మంజూరులోనూ మొండిచేయి..
* చేసేది లేక వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుతున్న రైతులు

పరిహారం ఇవ్వడం లేదు
‘‘వచ్చిన రూ.8 వేల పరిహారంతో విత్తనాలు, ఎరువులు తీసుకోవచ్చని అనుకున్నాను. బ్యాంకుకు వెళ్తే పత్తి పంట నష్టపరిహారం చేతికి ఇవ్వలేదు. పాత బకాయి కింద జమ చేసుకున్నామని చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు. పంటసాగు కోసం అప్పు చేయాల్సిందే’’
-కుషాల్‌రావు, సిర్‌సముందర్, నిజామాబాద్ జిల్లా

అప్పు కింద పట్టుకుంటుండ్రు 
ధర్మారంలోని బ్యాంక్ అధికారులు ఎండిపోయిన పత్తి పంటకు వచ్చిన పరిహారాన్ని పంట అప్పుల కింద పట్టుకుంటుండ్రు. పంటలు ఎండిపోయి నష్టపోయి మేముంటే ప్రభుత్వం ఇచ్చిన పైసల్తోనైనా విత్తనాలు తెచ్చుకోవాలనుకున్న. ఇప్పుడేం చేయాలో అర్థమైతలేదు.
- తిరుపతిరెడ్డి, చామనపల్లి, కరీంనగర్ జిల్లా


మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన ఆంజనేయులు గతేడాది ఖరీఫ్‌లో పంట సాగు చేసి కరువు కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. పంట నష్ట పరిహారం కింద రూ.7 వేలు మంజూరైనట్లు ఇటీవల అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు. గజ్వేల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులోని ఆయన ఖాతాలో డబ్బు జమైంది. తీరా అక్కడికి వెళ్లి తన ఖాతాలో చూసుకుంటే డబ్బుల్లేవు. అధికారులను అడిగితే.. గతంలో పంట రుణంగా తీసుకున్న మొత్తానికి పరిహారం కింద వచ్చిన డబ్బును జమ చేసుకున్నామని చెప్పారు. అటు పరిహారం అందక, ఇటు పంటరుణం తీసుకునే అవకాశం లేకపోవడంతో పెట్టుబడి కోసం నానాతిప్పలు పడుతున్నాడు ఆంజనేయులు!

రంగారెడ్డి జిల్లా పరిగి మండలం తొండపల్లికి చెందిన రాములమ్మకు 5 ఎకరాల పొలం ఉంది. గత ఖరీఫ్‌లో స్థానిక ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 80 వేల పంట రుణం తీసుకుంది. ఇటీవల సర్కారు విడుదల చేసిన పంట నష్టపరిహారంలో భాగంగా ఆమెకు రూ. 6 వేలు వచ్చాయి. పరిహా రం డబ్బుల కోసం వ్యవసాయశాఖ అధికారులను ఆశ్రయిస్తే బ్యాంకులో జమచేసినట్లు బదులిచ్చారు. బ్యాంకు అధికారులను సంప్రదిస్తే పరిహారం వచ్చింది కానీ ఆ డబ్బులను అప్పు ఖాతాలో జమ చేసినట్లు సమాధానమిచ్చారు. బ్యాంకు అధికారి సమాధానంతో రాములమ్మ నిరాశగా వెనుదిరిగింది.

ఒక్క ఆంజనేయులు, రాములమ్మే కాదు.. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీకి అర్హత పొందిన అధిక శాతం మంది రైతులది ప్రస్తుతం ఇదే పరిస్థితి. సర్కారు నిర్లక్ష్యం, బ్యాంకర్ల ఫక్తు వ్యాపార ధోరణి.. కరువు రైతుల పాలిట శాపాలుగా మారాయి. గత ఖరీఫ్‌లో కరువు వల్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా నష్టపోయిన రైతులు కనీసం పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ)కి కూడా నోచుకోకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అరకొరగా కురిసిన వర్షాలతో పంటలు సాగుచేసుకోవాలనుకున్నా పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీ ఎట్టకేలకు విడుదల చేసినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అప్పుగా జమ వేసుకోవడంతో రైతులకు దిక్కతోచడం లేదు. రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే మొండి చేయి చూపుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

బ్యాంకులకు చేరేదెప్పుడు.. రైతుకు అందేదెప్పుడు?
గత ఖరీఫ్‌లో 876 కరువు మండలాల్లో వర్షాభావం, కరెంటు కోతల వల్ల 83,55,267 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. సాగు ఖర్చులు కూడా కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయిన 52,55,267 మంది రైతులకు రూ.1,816.91 కోట్లను పెట్టుబడి రాయితీ కింద ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో పంట నష్టం వాటిల్లితే వెంటనే ఆదుకునే చర్యలు తీసుకోకుండా నాన్చుతూ వచ్చిన సర్కారు.. విధిలేని పరిస్థితుల్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. విడుదలలో తీవ్ర జాప్యమైనందున తక్షణమే రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి అందులోనూ విఫలమైంది. 

ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకూ ప్రజాపథం సందర్భంగా రైతులకు పెట్టుబడి రాయితీ (బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని) అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. విపత్తు నిర్వహణ శాఖ రూ. 1816.91 కోట్లు విడుదల చేసినా ఇప్పటి వరకూ రూ.వెయ్యి కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరింది. ఇందులో సగం కూడా రైతుల అకౌంట్లకు జమ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్‌లో పంటలు కోల్పోయిన 52.55 లక్షల మంది రైతుల్లో ఇప్పటికీ పావుశాతం మందికి కూడా పరిహారం అందలేదని అధికారులే అంగీకరిస్తున్నారు. శనివారం (జూన్ 30)తో రుణాల రీషెడ్యూల్ గడువు కూడా ముగిసింది. ఈ గడువు పొడిగిస్తే తప్ప రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం రైతులకు లేదు.

బ్యాంకు ఖాతాలు లేవంటూ..
చాలామంది రైతులకు బ్యాంకు అకౌంట్లు లేకపోవడం వల్లే తక్కువ మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిందని అధికారులు చెబుతున్నారు. ఈ వాదనలో ఏ మాత్రమూ పస కనిపించడం లేదు. బ్యాంకు ఖాతా లేని రైతులందరికీ జీరో బ్యాలెన్సు కింద ఖాతాలు తెరవాలని గత డిసెంబర్‌లోనే నిర్ణయించినా దాన్ని ఎందుకు అమలు చేయలేదో సర్కారుకే తెలియాలి. అటు బ్యాంకులుగాని, ఇటు ప్రభుత్వంగాని ఈ సంగతి పట్టించుకోకపోవడంతో.. విడుదలైన ఇన్‌పుట్ సబ్సిడీ అలా ఖజానాలో పడి మూలుగుతోంది. అరకొర పెట్టుబడి రాయితీ అయినా అందకపోవడంతో రైతులు దిక్కులేని పరిస్థితిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. చాలా బ్యాంకులు రైతుల అకౌంట్లలో డబ్బు వేయగానే అప్పుల కింద జమ వేసుకుంటున్నా సర్కారులో చలనమే లేదు.

రుణాలు ఎక్కడ..?
పంటల సాగు కోసం రైతులకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నాయి. ఈ ఖరీఫ్‌లో రూ. 32 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకూ ఇచ్చింది రూ.7,500 కోట్లే. సాధారణ సమయం కంటే నెల ఆలస్యంగా ఈ వారంలో రుణ ప్రణాళిక ప్రకటించిన ప్రభుత్వం కూడా ఖరీఫ్‌లో పంట రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులపై ఒత్తిడి తేవడంలేదు. నల్లగొండ జిల్లాలో ఈ ఖరీఫ్ లో రూ.955.48 కోట్ల రుణాలను అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, ఇప్పటి వరకు రూ.153 కోట్లు మాత్రమే అందించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.401.5 కోట్లు రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటివరకు రూ.130 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 85 శాతం మందికి గతంలో తీసుకున్న అప్పులను రెన్యువల్, రీషెడ్యూల్ చేసినవేనని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2012 రుణ లక్ష్యం రూ.802 కోట్లు కాగా ఇంతవరకు రూ.227 కోట్లు మాత్రమే ఇచ్చారు.

కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం..
కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లెసైన్స్‌డ్ సాగుదారులకు బ్యాంకు రుణాలిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం.. అమలులో మాత్రం చేతులెత్తేసింది. రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నారని అనధికారిక గణాంకాలు చెబుతుండగా వీరి సంఖ్య 25 లక్షలే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం గత ఏడాది 5.76 లక్షల మంది లెసైన్స్‌డ్ సాగుదారులకు రుణ అర్హత కార్డులు జారీచేయగా అందులో 1.97 లక్షల మందికే బ్యాంకు రుణాలు లభించాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులైనా లక్షన్నర మంది కౌలు రైతులకే రుణ అర్హత కార్డులు జారీ అయ్యాయి. వీరిలో ఒక్కరికి కూడా బ్యాంకు రుణాలు అందలేదు. అప్పులు దొరక్క, గిట్టుబాటుకాక కౌలుదారులు పంటల సాగుకు స్వస్తి చెబుతున్నా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. వరంగల్ జిల్లానే తీసుకుంటే.. కౌలు రైతులకు ఈ సీజన్‌లో రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. 30 వేల మందికి అర్హత కార్డులు జారీ చేసినా... ఇంకా ఖాతా తెరువలేదు.
-న్యూస్‌లైన్, హైదరాబాద్, న్యూస్‌లైన్ నెట్‌వర్క్

ఉద్యాన రైతులకు పరిహారం ఇంకెప్పుడు?
కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేసి గత ఖరీఫ్‌లో కరువు వల్ల నష్టపోయిన ఉద్యాన రైతుల పట్ల సర్కారు వివక్ష చూపుతోంది. అదే సీజన్‌లో వ్యవసాయ పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఉద్యాన రైతులకు ఇంకా విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మళ్లీ ఖరీఫ్ వచ్చినా వీరి పెట్టుబడి రాయితీ విడుదల గురించి పట్టించుకోవడంలేదు. అధికారుల అంచనా ప్రకారం గత ఖరీఫ్‌లో 45 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు రూ. 26.99 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది ఖరీఫ్‌లో కూరగాయల తోటలు దెబ్బతినడం, తర్వాత వర్షాభావం వల్ల ఈ తోటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రస్తుతం కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ప్రభుత్వం బాధిత రైతులకు త్వరగా పెట్టుబడి రాయితీ ఇవ్వడంతోపాటు సబ్సిడీ ధరలతో విత్తనాలు, ఎరువులు అందించి కూరగాయల తోటల సాగును ప్రోత్సహిస్తే తప్ప ధరలు తగ్గవని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులే చెబుతున్నారు. ‘‘మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.50 పలుకుతోంది. బీన్స్, బెండ, చిక్కుళ్లు కిలో రూ.55పైనే ఉన్నాయి. ఇంత ధర పెట్టి సామాన్యులు, రైతులు కూరగాయలు ఎలా కొనుగోలు చేయగలరు? ప్రభుత్వం చొరవ చూపి కూరగాయ తోటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలి. లేకపోతే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది’’ అని ఉద్యాన శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

జిల్లాల్లో పరిస్థితి ఇదీ..
*ఖరీఫ్ కరువుకు మెదక్ జిల్లాలో 4.06లక్షల మంది రైతులు నష్టపోయారు. సర్కారు నుంచి రూ.106.66 కోట్లు పరిహారంగా మంజూరైంది. ఇప్పటి వరకు 58.40శాతం రైతులకు రూ.54.11 కోట్లు మాత్రమే అందింది. ఇక్కడ రైతులకు ఖాతాలు లేవనే సాకుతో పరిహారం చెల్లించడం లేదు. కొన్ని చోట్ల ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహారాన్ని పంట రుణాలు, పాత బకాయిల కింద బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారు.

*కరీంనగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పంటలు నష్టపోయిన 1,79,115 మంది రైతులకు గాను రూ.71 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరైంది. అందులో రూ.56 కోట్ల వరకు బ్యాంకులో జమయింది. అయితే అందులో రైతులు డ్రా చేసుకున్న నిధులు కనీసం పదిశాతం కూడా లేవు. బ్యాంకర్లు ఆ సొమ్మును అప్పులకు జమ వేసేసుకోవడంతో.. ఇటీవల ధర్మారం లో రైతులు ఆంధ్రాబ్యాంకు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 

*రంగారెడ్డి జిల్లాకు పంట నష్టపరిహారం కింద రూ.61.93 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 2,82,364 మందికి దీన్ని పంపిణీ చేయాల్సి ఉండగా.. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా సగం మందికి కూడా నిధులు అందలేదు. ఇప్పటివరకు 1.92 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 42.8 కోట్లు ట్రెజరీ నుంచి డ్రా చేసి బ్యాంకులకు చేరవేశారు. ఆ మొత్తం అప్పుకే జమ కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.

*వరంగల్ జిల్లాలో 4.32 లక్షల మంది రైతులకు రూ.105.97 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రూ. 41.10 కోట్లనే రైతులకు పంపిణీ చేశారు. 80 వేల మంది రైతులకు బ్యాంకు ఖాతాలే లేవు. దీంతో వీరికి సంబంధించిన పరిహారం ఖజానాలోనే ఉంది.

*మహబూబ్‌నగర్ జిల్లాలో 8.14 లక్షల మంది రైతుల కోసం రూ.258 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు విడుదలై రెండు నెలలు కావస్తున్నా.. 45 శాతం మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేశారు. బ్యాంకు ఖాతాలు ఉన్న రైతుల ఖాతా నంబర్లనైనా ఒక జాబితాగా సమర్పించడంలో కొందరు ఏఓలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.190.28 కోట్ల పరిహారం విడుదలైతే.. ఇప్పటికి రూ. 70 కోట్లే పంపిణీచేశారు.

*విశాఖపట్నం జిల్లాలో రూ.17.14 కోట్లను 2 నెలల క్రితమే విడుదల చేశారు. అయితే 1.32 లక్షల మంది రైతుల్లో ఇప్పటిదాకా 79 వేల మందే ఖాతాలను తెరిచారు. వీరికి సంబంధించి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 1.68 కోట్లే రైతుల ఖాతాల్లో జమ అయింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే.. 6, 200 మంది రైతుల పరిహారం అందనేలేదు.

*శ్రీకాకుళం జిల్లాలో 1. 18 లక్షల మంది రైతులకు రూ.23.36 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా మంజూరు చేశారు. ఇక్కడ 43, 391 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. మిగిలిన వారందరూ ఇన్‌పుట్ సబ్సిడీ అందక ఇబ్బందులు పడుతున్నారు.

*విజయనగరం జిల్లాలో 77,810 మంది రైతులకు ప్రభుత్వం రూ.13 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. దీనిలో 48 వేల మందికి డీడీల కింద 8.87 కోట్లు వ్యవసాయ శాఖాధికారులు ఇచ్చారు. వీరిలో 32 వేల మంది రైతులు మాత్రమే పరిహారం అందుకున్నారు. ఇంకా 45,810 మంది రైతులకు పరిహారం అందాల్సి ఉంది. ఇందులో 19 వేల మందికి ఇంకా బ్యాంకు ఖాతాలు లేవు. అయితే పరిహారాన్ని మాత్రం బ్యాంకర్లు రుణాలతో ముడి పెట్టకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!