YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

రైతులను, కూలీలను ఆదుకోండి !

మొద్దు నిద్ర నుంచి మేల్కొని రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్న రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు రైతు సమస్యలపై మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన చాంబర్‌లో కలుసుకున్నారు. 

ధర్మాన కృష్ణదాస్, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బి.గురునాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రితో కొద్ది సేపు సమావేశమై రాష్ట్రంలో ఏరువాక జోరుగా సాగాల్సిన తరుణంలో రైతన్నలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూండటం ఆందోళనకరమని ఆయన దృష్టికి తెచ్చారు.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఉండి భరోసా గత మూడేళ్లలో పటాపంచలైందని కూడా వారు ఆయనకు విన్నవించారు. సమావేశం ముగిసిన అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వంటి అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని అన్నారు. విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందనీ ఎరువు దొరకడం లేదనీ రైతాంగం దుస్థితి చూస్తోంటే ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనే విషయం అవగతం అవుతోందని ఆయన ధ్వజమెత్తారు. 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి కూడా లేదని ఆయన అన్నారు. ఇదొక రైతు వ్యతిరేక రాక్షస ప్రభుత్వంలో ప్రజల దృష్టిలో ముద్ర పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే తాము ఉద్యమిస్తామనీ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు.

శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాలపై వడ్డీ మాఫీ గడువును మరో నెల పొడిగించాలని కోరామన్నారు. పూర్తి కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఇదెంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. శ్రీనివాసులు మాట్లాడుతూ వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పొరుగు రాష్ట్రాల నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతుల పంటలను కాపాడే వారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని అభిప్రాయపడ్డారు.

రైతులకు జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనీ పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఘోరవైఫల్యానికి నిదర్శనమనీ విమర్శించారు. నైరుతీ రుతుపవనాల వల్ల ఆకాశం కేవలం మేఘావృతం అవుతోందే తప్ప వర్షాలు రావడం లేదనీ అందువల్ల ప్రస్తుతం మేఘమధన కార్యక్రమాన్ని చేపట్టి వానలు కురిపించాలని గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ప్రకటించినపుడు మేల్కొని ఉండాల్సింది. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ప్రధానంగా పదిహేను అంశాలపై వినతి పత్రాన్ని సమరిచారు.

వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించినపుడే ప్రభుత్వం మేల్కొని ఉండాల్సిందనీ ఈ రోజు రైతులకు వచ్చిన సమస్యలు కొన్ని ప్రకృతి పరమైనవైతే మరికొన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల వచ్చినవేనని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం మేలు చేస్తుందనే భరోసా ఏమాత్రం లేకుండా పోయిందని అన్నారు. జూలై మొదటి వారంలో రైతులు పొలం పనుల్లో తలమునకలు కావాల్సిన సమయంలో తల పట్టుకుని కూర్నున్నారంటే అందుకు ముఖ్యమంత్రి స్పందనా రాహిత్యమేననీ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యంత్రాంగాన్ని నడిపించాలని వినతి పత్రంలో సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విత్తనాల కోసం లాటరీలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

బ్లాక్‌మార్కెట్ ఫలితంగా నకిలీ విత్తనాలు రైతులను నిలువునా ముంచే ప్రమాదం ఏర్పడింది. కనుక వెంటనే బ్లాక్‌మార్కెటింగ్‌ను నియంత్రించాలి. 930 రూపాయలు ఖరీదు చేసే బీటీ పత్తి విత్తనాలు 2 నుంచి 3 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఎరువులు దొరక్క పోగా గత మూడేళ్లలో ఎరువుల ధరలు 300 శాతం పెరిగాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణా ప్రణాళికలో హెక్టారుకు కనీసం 50 వేల రూపాయలు రుణం ఇవ్వాలి.

అయితే బ్యాంకులన్నీ కలిపినా అందులో సగం రుణం కూడా ఇవ్వడం లేదు. సహకార సంఘాల్లో నైతే ఎంత భూమి ఉన్నా రైతుకు 50 వేలకు మించి ఇవ్వడం లేదు. రుణాలు అందని వారు ఇంకా 75 శాతం మంది ఉన్నారని ప్రస్తావిస్తూ ఇదేం దుస్థితి అని వినతి పత్రంలో ప్రశ్నించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇస్తామని ఢిల్లీ వీధుల్లో ముఖ్యమంత్రి ఆర్భాటంగా చేసిన ప్రకటనను ఆచరణలో మాత్రం అమలులో పెట్టలేదన్నారు. 40 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఇప్పటికీ 20 శాతం మందికి రుణ అర్హత కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులందరికీ తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పాతబకాయీలతో ముడిపెట్టకుండా దీనిని విడుదల చేయాలన్నారు. రైతులు నిరుడు పండించిన ధాన్యాన్ని బస్తాకు 200 నుంచి 300 వరకూ తగ్గించి అమ్ముకున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు క్రాప్‌హాలిడే ప్రకటిస్తే వారి పాలిట పెనుభారంగా మారిన రుణాలను రద్దు చేయించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఎందుకు కలుగలేదని వారు ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా గిట్టుబాటు ధర పొందడం అనేది రైతు హక్కుగా పరిగణిస్తూ అందుకోసం 3000 కోట్ల రూపాయలతో ఒక స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 13 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని జగన్ గత ఏడాది చేసిన విజ్ఞప్తిని పరిగణించడానికి ఎందుకు ముందుకు రావడం లేదని అన్నారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసి అనర్హతకు గురై తిరిగి ప్రజల నుంచి ఎన్నికై వచ్చిన తరువాత కూడా కనువిప్పు కలగక పోవడం శోచనీయం అని అన్నారు. కనీస మద్దతు ధర అనే పదానికి అర్థమే లేకుండా పోయిందని వారన్నారు. రైతు సమస్యలపై గత రెండేళ్లుగా జగన్ ఎన్నో దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు, నిరసనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిస్థితిని మార్చడానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!