YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 2 July 2012

మంత్రి బొత్సను అరెస్టు చేయాలి

- దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు
- బొత్స అరెస్టు కోరుతూ దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
- ఆరునెలల్లో దోషులను శిక్షించాలి
- 17న చలో హైదరాబాద్ 

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: లక్ష్మీపేటలో దళితుల ఊచకోత ఘటనకు బాధ్యుడైన మంత్రి బొత్స సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. లక్ష్మీపేట దళితులపై దాడికి నిరసనగా సోమవారం దళిత, బహుజన ప్రజాసంఘాలు పట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మంత్రి బొత్స పీసీసీ చీఫ్ కాకముందు లక్ష్మీపేటలో ఈ సమస్య లేదన్నారు. బొత్స అండ చూసుకొని ఆయన బంధువు, మాజీ ఎంపీపీ వాసుదేవరావునాయుడు బీసీల వద్ద డబ్బులు వసూలు చేసి, మడ్డువలస ప్రాజెక్టు మిగులు భూములు దక్కేలా చేస్తానని భరోసా ఇవ్వడంతోనే వివాదం ముదిరిందన్నారు. మంత్రి బొత్స అండతోనే పోలీసుల పరోక్ష సహకారంతో ఊచకోత జరిగిందని ఆరోపించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రి బొత్స కేబినేట్‌లో ఉండడానికి వీల్లేదన్నారు. బొత్స కేబినేట్‌లో ఉంటే మరో 100 దళిత గ్రామాలపై దాడులు జరగడానికి అవకాశముందన్నారు. బొత్సను అరెస్టు చేయాలని కోరుతూ దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబువి నక్కవేషాలు:
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడివి నక్కవేషాలని కత్తి పద్మారావు విమర్శించారు. లక్ష్మీపేట ఘటనపై వెంటనే స్పందించకుండా రెండు వారాల తర్వాత నక్కలా వచ్చారని నిందించారు. ఆయనను దళితులు నమ్మరాదన్నారు. లక్ష్మీపేట బాధితులకు కారంచేడు, చుండూరు ప్యాకేజీలను అమలుచేయాలని, ఊచకోతపై సీబీఐ విచారణ జరిపించాలని, అదే గ్రామంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి ఆరు నెలల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!