YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ఆధార్ సాకు.. పేదలకు షాకు



*తెల్లకార్డు కోసం 28 లక్షల కుటుంబాల ఎదురుచూపులు
* ఏడాదిన్నరగా సర్కారు కాలయాపన.. ఇప్పుడు ఆధార్‌కు లింకు
* ఆరోగ్యశ్రీ ఆదుకోవాలంటే.. తెల్లకార్డు కావాలి!
* ఫీజుల పథకం అందుకోవాలంటే.. తెల్లకార్డు ఉండాలి!!
* పింఛన్లు పొందాలన్నా.. తెల్లకార్డే ఆధారం!!
* ఉపాధి హామీ దొరకాలన్నా.. ఇందిరమ్మ ఇళ్లు, రూపాయికి కిలో బియ్యం,
* సబ్సిడీపై కందిపప్పు, పామాయిల్, చక్కెర, ఉప్పు వంటివి రావాలన్నా..
ఈ కార్డు కావాల్సిందే!!

ఒక్కమాటలో చెప్పాలంటే సర్కారు ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాలకు ఈ కార్డే ఆధారం. బడుగు జీవుల బతుకులకు జీవనాధారంలాంటి ఈ కార్డు ప్రభుత్వ వైఖరి కారణంగా.. ఒకటికాదు.. రెండుకాదు.. దాదాపు 28 లక్షల కుటుంబాలకు అందకుండా పోతోంది. తెల్లకార్డు పొందేందుకు ఈ కుటుంబాలకు అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వం కేవలం తాత్కాలిక కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా వారంతా అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కార్డులు ఇచ్చేందుకు ప్రతిసారీ ఏదో ఒక సాకు చూపిస్తున్న పాలక పెద్దలు.. మరో రెండేళ్ల వరకు పూర్తిగాని ‘ఆధార్’తో ముడిపెట్టారు. అంటే తెల్లకార్డుల కోసం ఇప్పటికే 17 నెలల పాటు ఎదురుచూసిన పేద కుటుంబాలకు మరో రెండేళ్ల దాకా ఎదురుచూపులు తప్పవన్నమాట!

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెల్లకార్డులకు అర్హులైన లక్షల కుటుంబాలు ఉన్నాయని స్వయంగా ధ్రువీకరించిన ప్రభుత్వమే ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పట్లో తెల్ల కార్డుల జారీ చేయకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ విషయం నేరుగా చెప్పకుండా మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేని ఆధార్‌తో ముడిపెట్టింది. ఆధార్ ప్రక్రియ ముగిసే వరకు కొత్త కార్డులు ఇచ్చేది లేదని నిర్ణయించింది. వైఎస్ మృతి చెందిన తర్వాత 14 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య ప్రభుత్వం.. రాష్ట్రంలో ఒక్క తెల్లకార్డు ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కు సర్కారు సైతం ఏడాదిన్నరగా ఒక్క తెల్లకార్డు ఇవ్వలేదు.

కేవలం తాత్కాలిక కూపన్లను.. అదీ పరిమిత సంఖ్యలో ఇచ్చి సరిపెట్టింది. ఏడాదిన్నరగా ఇదిగో అదిగో కొత్త కార్డులు(స్మార్టు కార్డులు) ఇస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మరో రెండేళ్ల వరకు అసలు కార్డులే ఇచ్చేది లేదని నిర్ణయించడంతో అర్హులైన లక్షల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తామంతా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దూరమవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రచ్చబండ దరఖాస్తులకు అతీగతీ లేదు..
2004లో రాష్ట్రంలో 1.26 కోట్ల తెల్ల రేషన్‌కార్డులు ఉండేవి. అర్హులైన పేదలందరికీ తెల్లకార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో పేదల వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గ్రామాల్లో గతంలో రూ.20 వేలు ఉన్న ఆదాయ పరిమితిని రూ.60 వేలకు, పట్టణాల్లో రూ.25 వేలు ఉన్న పరిమితిని రూ.75 వేలకు పెంచారు. ఇలా అర్హులైన పేదలందరికీ కార్డులు ఇవ్వడంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1.86 కోట్లకు పెరిగింది. అయితే కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాల వల్ల కొందరు అనర్హులు కూడా కార్డులు పొందారు. ఇలాంటి 8 లక్షల కార్డులను రద్దు చేశారు.

అంతకుముందు అర్హులుగా తేల్చినా 2009 ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా మరో 6 లక్షల మందికి కొత్త తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయలేదు. వైఎస్ మరణానంతరం 2010లో వీరికి కేవలం నెలవారీగా సరుకులు పొందే తాత్కాలిక కూపన్లు ఇచ్చారు. అనంతరం 2010 జనవరి నుంచి 2011 ఫిబ్రవరి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా 21.79 లక్షల కుటుంబాలను తెల్లరేషన్ కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. దీంతో అంతకుముందు అర్హత ఉన్నవని గుర్తించిన 6 లక్షల కుటుంబాలతో కలిపితే మొత్తం 27.79 లక్షల కుటుంబాలకు కార్డులు ఇవ్వాల్సి ఉంది.

వీరికి వెంటనే కార్డులు ఇవ్వకుండా 2011 నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండలో ప్రభుత్వం.. ఆరు నెల లకు సరిపోయేలా తాత్కాలిక కూపన్లు ఇచ్చింది. త్వరలోనే శాశ్వత కార్డులు ఇస్తామని చెప్పి మాట తప్పింది. మే నుంచి అక్టోబర్ వరకు సరిపోయేలా మళ్లీ తాత్కాలిక కూపన్లనే పంపిణీ చేసింది. రెండో దశ రచ్చబండలో కొత్త కార్డుల కోసం 16,88,038 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రభుత్వం కనీ సం పరిశీలన కూడా చేయలేదు. దరఖాస్తులు వచ్చి ఏడు నెల లైనా అర్హులు ఎంత మంది అనే విషయాన్ని తేల్చడంలేదు.

ఆధార్ అయ్యేదెప్పుడు.. కార్డు వచ్చేదెప్పుడు..?
కొత్త రేషన్‌కార్డుల విషయంలో మొదట్లో సమగ్ర సర్వేను సాగదీసిన ప్రభుత్వం... ఇప్పుడు ఆధార్ పేరిట ఈ పని చేస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. తొలిదశలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని 3.10 కోట్ల మందికి గత మార్చి వరకే ఆధార్ సంఖ్య జారీ చేయాలని నిర్ణయించారు. ఈ లక్ష్యం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని మిగిలిన 16 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఆధార్ నమోదు ప్రక్రియకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచి జనవరిలోనే ఖరారు చేశారు. సాంకేతిక లోపాల సవరణ పేరుతో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ నమోదును నిలిపివేసింది. మే నుంచి మిగిలిన రాష్ట్రాల్లో మొదలు పెట్టినా మన రాష్ట్రంలో ఇంకా మొదలుకాలేదు. ఇంతలో ధరలు ఎక్కువయ్యాయనే కారణంతో మళ్లీ టెండర్లు పిలిచారు. న్యాయ పరమైన సమస్యలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు ఈ 16 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు వాణిజ్య బ్యాంకులు ఆధార్ నమోదును చేపట్టాయి.

అన్ని రకాలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3.50 కోట్ల మంది ఆధార్ వివరాలను నమోదు చేశామని, వీరిలో రెండు కోట్ల మందికి ఆధార్ సంఖ్యలు జారీ అయ్యాయని అధికారులు పేర్కొంటున్నా.. నిజానికి కోటిన్నర మందికే ఆధార్ సంఖ్యలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నమోదు చేసుకున్న వారికే నంబర్లు రాకపోగా... కొత్త నమోదు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయంలో అస్పష్టత నెలకొంది. మరో నెల రోజుల్లో మొదలైనా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యే వరకు కనీసం రెండేళ్లు పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. అయినా కొత్త తెల్ల రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం ఆధార్‌తో ముడిపెట్టడం గమనార్హం.

కార్డు లేదాయె.. చదివేదెట్టా..?
నిరుపేద కుటుంబానికి చెందిన ఈ అబ్బాయి పేరు వడ్డె మధు. ఊరు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి.కోటకొండ. తండ్రి రంగన్న కూలి పనులకు వెళ్తాడు. మధు కర్నూలు బి.క్యాంప్‌లోని బాలుర వసతి గృహానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తెల్లరేషన్ కార్డు లేకపోవడంతో ఈ విద్యార్థికి హాస్టల్‌లో ప్రవేశం దొరికే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆధార్ కార్డు లేక తెల్లరేషన్ కార్డుల్లో ఏదో ఒకటి ఉంటేనే ఈ విద్యాసంవత్సరం నుంచి పిల్లలను హాస్టళ్లలో చేర్చుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దీంతో మధు ఒక్కడే కాదు.. వందలాది పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభమే కాలేదు. అలాగే అన్ని పేద కుటుంబాల వద్ద రేషన్ కార్డులూ లేవు. కొత్త కార్డులు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెల్లకార్డులు లేని పేద విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో చేరడం అసాధ్యంగా మారింది. గతంలో రేషన్ కార్డులేక పోయినా విద్యార్థి సమర్పించే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా విద్యార్థులను చేర్చుకునే వారు. ఇప్పుడు మాత్రం కార్డు ఉంటేనే చేర్చుకుంటామని మెలిక పెట్టడంతో బడుగు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకముందే ఇలాంటి అడ్డగోలు నిబంధనలు పెట్టడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!