YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

ఫీజుల పథకానికి తూట్లు పొడిచిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు

ఆయన ఉన్నన్నాళ్లూ పూర్తి భరోసాలో బడుగు విద్యార్థులు
సకాలంలో బడ్జెట్‌కు మించీ నిధులు విడుదల చేసిన వైఎస్
ఫీజుల పథకానికి తూట్లు పొడిచిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు
మానవీయ కోణం మరిచి ఖజానాపై పడే భారంపైనే దృష్టి
మరిన్ని ని‘బంధనాల’ యోచనలో సర్కారు... ‘ఒక కుటుంబంలో ఒకరికే’ అనే తమిళనాడు తరహా విధానంపై కసరత్తు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: మానవీయ కోణం మృగ్యమైంది. ఖజానాపై ఎంత భారం అన్నదే ప్రధానాంశమైపోయింది. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలని, చదువుకునేందుకు ఎవరు ఆసక్తి చూపించినా కేవలం డబ్బులేమి ఆటంకం కారాదనే మహానేత మహోన్నత లక్ష్యం నీరుగారిపోయింది. సంతృప్త స్థాయిలో అమలు కావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. ఆంక్షల చక్రబంధంలో చిక్కుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి.. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు భవిష్యత్తుపై ‘ఆనాటి’ ధీమాను దూరం చేసింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అమలైన ఫీజుల పథకం... వాస్తవానికి ఆయన మరణించిన కొన్నాళ్లకే ఒడిదుడుకులకు గురైంది. గత మూడేళ్ల కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక ఆటుపోటులను ఎదుర్కొని ఇప్పుడు ఏకంగా శాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) స్ఫూర్తినే కోల్పోయింది. అర్హులైన వేలాదిమంది బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ పేదలు కూడా వేల రూపాయల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నత విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్లుగా సకాలంలో నిధులు విడుదల చేయని ప్రభుత్వం... మరోవైపు ఆంక్షలు, నిబంధనల పేరుతో ఫీజుల పథకానికి ఎప్పటికప్పుడు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు ఫీజుకు పరిమితి విధించడమే కాకుండా ఆంక్షలతో ఏకంగా వేలాదిమంది ఫీజుకే ఎసరుపెట్టింది. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెరిగిన నేపథ్యంలో తాము పెరిగిన ఫీజులు చెల్లించలేమని చేతులెత్తేసింది. ప్రభుత్వ కళాశాలలు, మెరిట్ విద్యార్థులనే నిబంధనాలతో ఉన్నత విద్యను కొందరికే పరిమితం చేసేసింది. దీంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పూర్తిగా నష్టపోనున్నారు. 

భవిష్యత్తంతా భయమే

ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కూడా ఫీజులెంతో తేల్చకుండా, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సమీపిస్తున్నా ఎంత ఫీజు చెల్లిస్తామో చెప్పకుండా లక్షలాది మంది విద్యార్థులను రాష్ట్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. కేవలం ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలా అనే వ్యూహంతోనే వ్యవహరించి.. విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ఆందోళన ను ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా భవిష్యత్తులోనూ ఫీజుల పథకం వ్యయాన్ని తప్పించుకునేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కసరత్తు కూడా వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఏ కోర్సు ఫీజు పెరిగినా సీలింగ్ విధించి మెరిట్ ప్రాతిపదికనే ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా తమిళనాడు తరహా విధానంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఆ రాష్ట్రంలో కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని మంత్రులు, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు చెపుతున్నారు. అంటే కుటుంబంలో ఒక విద్యార్థి ఫీజుల పథకం కింద లబ్ధి పొందితే... మరో విద్యార్థి ఫీజునంతటినీ చెల్లించుకోవాల్సిందే. మరోవైపు మెరిట్‌ప్రాతిపదికన ఫీజులు పెరిగిన కళాశాలల్లో చేరే ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజును కూడా భరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆయా విద్యార్థులకు ట్యూషన్‌ఫీజు చెల్లించి ఉపకార వేతనాన్ని ఎగ్గొడతారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందరికీ రూ.35 వేల ఫీజు కడుతున్నాం.. కొందరికి మెరిట్ కింద ఎంత ఫీజున్నా చెల్లిస్తున్నాం.. మళ్లీ వారికి స్కాలర్‌షిప్ ఎందుకివ్వాలి అనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

బడ్జెట్‌కు మించి నిధులిచ్చిన వైఎస్!

దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ తానున్నన్నాళ్లూ పథకం అమలుపై ఎలాంటి సందేహం తలెత్తకుండా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఏటా వాస్తవంగా కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా నిధులు విడుదల చేయడం గమనార్హం. వైఎస్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఈబీసీలకు కూడా ఈ పథకం ద్వారా మేలు చేకూరింది. ముఖ్యంగా మైనార్టీలు.. అందులోనూ ముస్లిం బాలికలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ తదితర వృత్తి విద్యా కోర్సులు అభ్యసించారు. అయితే ఆయన మరణించిన మూడేళ్ల తర్వాత ఈ పథకం అమలైన తీరును ఒకసారి పరిశీలిస్తే అసలు ఈ పథకం ఉంటుందా? ఉండదా? అనే సందేహం చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల్లో కలుగుతోంది. 

వైఎస్ హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన అందరూ లబ్ధి పొందేలా పథకం అమలు కాగా, ప్రస్తుత ప్రభుత్వం వీలున్నంత ఎక్కువమందిని ఈ పథకానికి దూరం చేసేందుకు ఆంక్షలు, పరిమితులు విధిస్తోంది. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు ఏనాడూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. స్కాలర్‌షిప్‌లను సైతం సకాలంలో ఇవ్వలేదు. 2009-10 నుంచి నిధుల విడుదల గణనీయంగా తగ్గిపోయింది. విడుదలైన నిధుల కోసం కూడా విద్యార్థి, సంక్షేమ సంఘాలు పోరాటాలకు దిగాల్సి వచ్చింది. కళాశాలల యాజమాన్యాలైతే ఏకంగా కోర్టులనే ఆశ్రయించి ఫీజులు సాధించుకోవాల్సి వచ్చింది. ఒకదశలో కోర్టు ప్రభుత్వాన్ని ఫీజు చెల్లింపుల సంబంధిత ఆధారాలు సమర్పించాలని కూడా ఆదేశించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతుంది. ఏయేటికాయేడు బకాయిలను పేర్చుకుంటూ చివరకు ఈ ఆర్థిక సంవత్సరం నిధులను గత ఏడాది బకాయిలకే ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఫీజులు చెల్లించాలంటే మళ్లీ అదనంగా నిధులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఆంక్షలే ఆంక్షలు...

తాజా ఆంక్షల మాట అలా ఉంచితే.. గతంలోనూ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ పథకం నుంచి పేదలను దూరం చేసి వారి హృదయాల్లో వైఎస్ ముద్రను చెరిపేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమే లేదు. వైఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, ఆ తర్వాతి కిరణ్ ప్రభుత్వాలు నిబంధనలను విధించడంలో పోటీలు పడ్డాయి. ఒకరో, ఇద్దరో 70 ఏళ్ల వారు కూడా ఫీజుల పథకం కింద చదువుకున్నారన్న బూచిని చూపించి ప్రభుత్వం చదువుకు వయసుతో లింకుపెట్టింది. ఒకదశలో పీజీ స్థాయి కోర్సులను ఈ పథకం నుంచి ఎత్తేసేందుకు సాహసించిన ప్రభుత్వం విషయాన్ని పత్రికలు వెలుగులోనికి తేవడంతో వెనక్కు తగ్గింది. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులను తొలగించడంతో ఫీజుల పథకానికి ఆంక్షలు మొదలయ్యాయి. డబుల్ పీజీలు చేస్తే ఇవ్వమని తేల్చేశారు. మైనార్టీ కళాశాలల్లో చేరిన నాన్ మైనార్టీలు కన్వీనర్ కోటాలో సీటు పొందినా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదని నిర్ణయించారు. పారామెడికల్ విభాగంలో 26 కోర్సులకు పథకం వర్తిస్తుండగా, దానిని 17కు కుదించారు. గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న కొందరు విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో పరిశోధన చేస్తున్న అందరు విద్యార్థులను మినహాయించారు. ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్ర విద్యార్థులకూ కోతలు పెట్టారు. భారత ప్రభుత్వం గుర్తించిన 183 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్ చేయాలని, మిగిలిన వారికి ఇవ్వకూడదని నిర్ణయించారు. అఫిడవిట్, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్, సెల్‌ఫోన్ ఉంటేనే అర్హులని నిబంధనలు విధించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!