YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 20 October 2012

జనసంద్రం

రెండు పాదాలకు వేలాది పాదాలు తోడవుతున్నాయి. మహానేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. పదేళ్ల పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు స్త్రీ, పురుష తేడా లేకుండా షర్మిలతో పాటు శనివారం అడుగులేశారు. దెబ్బతిన్న చీనీ, ఎండిపోయిన పత్తి పంటలను పరి శీలిస్తూ అన్నదాతలను షర్మిల ఓదార్చారు. అధైర్యపడవద్దన్నారు. జగనన్న నాయకత్వం లో సువర్ణపాలన వస్తుందని భరోసా ఇచ్చారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు పూలపై షర్మిలను నడిపించారు. వేల్పుల గ్రామంలోని మహిళలంతా కదిలివచ్చి హారతులు పట్టారు. షర్మిల పులివెందుల చేరుకునేసరికి పట్టణమంతా జనసంద్రమైంది. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: పులివెందుల పట్టణం జనసంద్రమైంది. మహానేత తనయ షర్మిలకు అపూర్వ ఆదరణ లభించింది. చిన్నాపెద్ద.. ముసలీముతక అన్న తారతమ్యం లేకుండా అందరూ కలిసొచ్చి మహా ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నారు. మూడోరోజు శనివారం ఉదయం వేములలో ప్రారంభమైన పాదయాత్ర భూమయ్యగారిపల్లె క్రాస్, వేల్పుల, ఎస్సీ కాలనీ, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె క్రాస్, రింగ్‌రోడ్డు సర్కిల్ మీదుగా పులివెందుల పట్టణం చేరింది. పూల అంగళ్ల సర్కిల్‌లో బహిరంగ సభ అనంతరం రాజీవ్ కాలనీ సమీపంలో బస ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు పదిహేను కిలోమీటర్ల మేర సాగింది. మార్గమధ్యంలో పత్తిపంట, చీనీ తోటల పరిశీలనతోపాటు సంక్షేమ పథకాలు అందక అవస్థలు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులతో మమేకమయ్యారు. వారి బాధలు వింటూ.. జగనన్న నాయకత్వంలో సువర్ణపాలన వస్తుందని ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

హారతి పళ్లేలతో స్వాగతం 
మూడోరోజైన శనివారం ఉదయం అల్పాహారం అనంతరం వేముల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భూమయ్యగారిపల్లె క్రాస్‌లో మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపి వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం మార్గమధ్యంలో పత్తిపంటను పరిశీలించి రైతుల గోడు విన్న ఆమె అధైర్యపడొద్దు.. భవిష్యత్తు మనదేనని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సమీపంలోని వేల్పులకు చేరుకున్నారు. అక్కడ మాజీ ఉప మండలాధ్యక్షుడు రామలింగారెడ్డి నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు రాజన్న బిడ్డను పూలపై నడిపించారు. రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీ బోర్డులతో స్వాగతం పలికారు. మహిళలు హారతి పళ్లేలతో స్వాగతించారు. చెక్కభజన ప్రదర్శన, కవాయి కట్టెల విన్యాసం ఆకట్టుకున్నాయి. అచ్చివెళ్లి, మల్లేల గ్రామాల నుంచి కవాయి కట్టెల ప్రదర్శనకారుల విన్యాసాలు ఆకర్షించాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.


పులివెందులలో నీరాజనం 
పాదయాత్రలో భాగంగా వేముల నుంచి వచ్చిన షర్మిలకు పులివెందులవాసులు నీరాజనం పలికారు. బెస్తవారిపల్లె సమీపంలోని రింగ్‌రోడ్డు వరకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. అక్కడి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండు, మెయిన్ బజారు మీదుగా పూల అంగళ్ల సర్కిల్ వరకు పాదయాత్ర సాగింది. మార్గమధ్యంలో దారి వెంబడి గుమ్మడికాయలతో దిష్టితీసే వారు కొందరైతే, కర్పూర హారతులిస్తూ మరికొందరు కనిపించారు. రాజన్న కుటుంబానికి ఎంత బాధ వచ్చిందోనంటూ.. మేమందరం మీ వెంటే ఉన్నామంటూ స్థానికులు ధైర్యం చెప్పారు. దీంతో పులివెందుల పట్టణమంతా జనసంద్రంగా మారింది. 

తరలివచ్చిన నేతలు
మూడోరోజు పాదయాత్రలో వైఎస్‌ఆర్ సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి, పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రసాద్‌రాజు, బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాష్ట్ర ఆయా విభాగాల కన్వీనర్లు కొల్లి నిర్మలా కుమారి (మహిళా విభాగం), పుత్తా ప్రతాప్‌రెడ్డి (యువజన విభాగం), మధుసూదన్‌రెడ్డి (ఐటీ), శివభారత్‌రెడ్డి (వైద్యం)లతోపాటు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన మహిళా విభాగం అధ్యక్షులు పత్తి రాజేశ్వరి, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మనందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి వియ్యంకుడు ఈసీ గంగిరెడ్డి, కడప నగర కన్వీనర్ అంజాద్‌బాష, మాసీమబాబు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రతో పులివెందుల చేరిన వైఎస్ భారతి
కడప పార్లమెంటు సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న తన ఆడబిడ్డ షర్మిలతో కలిసి వేల్పుల నుంచి పులివెందుల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. వారితోపాటు మహానేత సతీమణి విజయమ్మ బెస్తవారిపల్లె వరకు పాదయాత్రగా వచ్చారు. వైఎస్ కుటుంబ ఔదార్యం మరొకరికి సాటి రాదంటూ అక్కడి ప్రజలు కొనియాడారు.

ప్రతినోటా జగన్‌మాటే..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మూడోరోజు అపూర్వ స్వాగతం లభించడం ఒక ఎత్తయితే, వేలాదిగా జతకట్టిన అందరి మనస్సులు జననేత జగన్ కోసం పరితపించాయి. ఏ నోట విన్నా జగన్నామ స్మరణే వినిపించింది. ‘జగనన్న జిందాబాద్, వైఎస్‌ఆర్ జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ షర్మిలకు జేజేలు పలుకుతూ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. జగనన్నను అరెస్టుచేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!