YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 17 October 2012

ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కు


హైద‌రాబాద్‌: ఓదార్పుయాత్రకు ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తూ మొదలైన కుట్రలు జగన్‌పై కొనసాగుతూనే ఉన్నాయి. జగన్‌ను జైలుకు పంపటం ద్వారా ప్రజలకు దూరం చేశామని సంబరపడిపోతున్న నేతలు రకరకాల ఎత్తుగడలతో ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందిరమ్మ బాట పేరుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వస్తున్నా మీకోసం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోవటం పక్కనపెట్టి వారు పోయిన ప్రతిచోటా జగన్‌పై దుమ్మెత్తిపోయటంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుంది. ఈ ప్రభుత్వాన్ని కాపాడటానికి చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వైఎస్ మరణించిన తర్వాత నుంచి చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కవుతూనే ఉన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే కేంద్రంలో మంత్రి పదవి దక్కేదని కొద్ది రోజుల కిందట కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన ప్రకటన జగన్‌పై ఏ స్థాయిలో కుట్ర జరిగిందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

- కడప స్థానిక సంస్థల నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మద్దతునిచ్చిన అభ్యర్థిని ఓడించటానికి బాబు అక్కడ పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. పైగా టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్‌కే వేయించారు.

- అలాగే రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ నియామకంలో బాబు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆ పదవికి ప్రథమ ప్రాధాన్యత ఆయనకే ఇవ్వాలని తెలిసినా.. జగన్ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిన కక్రూ పేరును బాబు వెంటనే ఆమోదించటంతోనే ఆయన కుమ్మక్కు బయటపడింది. ఆర్‌టీఐ కమిషనర్ల నియామకంలో బాబుది ఇదే తీరు.

- 2011లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభాభారతికి ఓట్లు వేయగా.. టీడీపీ ప్రాధాన్యతా క్రమంలో రెండు, మూడు ప్రాధాన్యతలను కాంగ్రెస్‌కు వేసింది.

- ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు ఇప్పించారు. అదే బాబుపై రోజూ విమర్శలు చేసిన నాగం జనార్దన్‌రెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేయలేదు. వాళ్లు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినా జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం లేదు కాబట్టి వారిపై ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు.

- అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న డిమాండ్ వస్తున్నప్పుడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ప్రభుత్వం పడిపోకుండా కాపాడతామని, అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్య నేత అహ్మద్‌పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి హామీ ఇచ్చారు.

- జగన్‌పై హైకోర్టులో శంకర్రావు వేసిన పిటిషన్‌లోని కొన్ని పత్రాలు.. ఆర్‌టీఐ కింద టీడీపీ తీసుకున్నవే ఉండటం బహిరంగ రహస్యమే.

- నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓడించటానికి కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయింది. తన పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహించకుండా హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ బాబు మాట్లాడలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ కావాలనే ప్రచారం చేయలేదు.
- ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కొన్ని స్థానాల్లోనైనా ఓడించాలని కంకణం కట్టుకుని రామచంద్రపురం, నర్సాపూర్ నియోజకవర్గాల్లో టీడీపీ తాను బలై కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన విషయం జగమెరిగిన సత్యం.

- సమగ్ర భూ కేటాయింపు విధానం ప్రకటిస్తామని నిండు శాసనసభలో ప్రకటించి.. అలాంటి విధానమేదీ తేకుండానే గుట్టుచప్పుడు కాకుండా ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యి ఎకరాలు కేటాయించిన కిరణ్‌ను టీడీపీ ఇప్పటివరకు ఒక్కమాటైనా అనలేదు. అంతకుముందు అమీర్‌పేట భూ కుంభకోణంలో రోశయ్యపై పల్లెత్తుమాట మాట్లాడలేదు.

- వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. అసెంబ్లీలో కనీస బలం లేని టీడీపీ స్పీకర్‌పై అభిశంసన తీర్మానం పెట్టింది. ఆ తర్వాత మరోసారి ఎవరూ అడగనిదే, వీగిపోతుందని తెలిసీ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా.. శాసనసభలో విపక్షాలకు చాలినంత బలం ఉన్నా ఇప్పుడు బాబు అవిశ్వాస తీర్మానం పెట్టటానికి సిద్ధంగా లేరు.

అధికార, ప్రతిపక్షాల కుట్రను ఎండగట్టడానికి..
ఒకవైపు ఢిల్లీ స్థాయి నుంచి జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు సాగుతుండగా, మరోవైపు అన్ని రకాల చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతోంది. ప్రతి 3 నెలలకూ కరెంటు, బస్సు చార్జీలు పెంచటం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీల్లో కోత విధించటం, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతలు పెట్టటం, తీవ్రమైన కరెంట్ కోతలు... ఒకటేమిటి అన్ని రకాలుగా ప్రజలను గాలికొదిలేసిన ప్రభుత్వం, దానికి అనునిత్యం అండగా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్షం నిజస్వరూపాలను, వాటి తెరవెనుక కుట్రలను ప్రజల ముందు పెట్టాలన్న లక్ష్యంతో మరో ప్రజాప్రస్థానం తప్పదని జగన్ భావించారు. తనను జైలులో నిర్బంధించినప్పటికీ తన తరఫున ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పటానికి తన సోదరిని పాదయాత్ర చేయాలని సూచించటంతో షర్మిల మరో ప్రస్థానానికి సిద్ధమయ్యారు.

జగన్‌ను రాజకీయంగా అడ్డుతొలగించుకోవడానికి, జనం మధ్య లేకుండా చేయడానికిఅధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కై చేసిన కుట్రలకు, జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా షర్మిల నల్ల బ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేయనున్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!