అక్టోబర్ 5న జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇస్తుందని జనం ఆశించడంలో పొరపాటు లేదు.
ఎందుకంటే అది సర్వోన్నత న్యాయస్థానం గనుక. వ్యక్తి స్వేచ్ఛ విలువ తెలిసిన వారు గనుక. రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నత న్యాయస్థానాలు పని చేస్తాయని ఆశించడం తప్పు కాదు గనుక. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పరమ పవిత్రమైనవిగా భావించడం తప్పుకాదు గనుక. ప్రాథ మిక హక్కుల్లో భాగంగా 21వ అధికరణలో చెప్పిన వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉంది గనుక. అవసరానికి మించి ఒక్కక్షణం కూడా వ్యక్తి స్వేచ్ఛను అపహరించరాదు. కానీ జగన్ విషయంలో సీబీఐ ఈ సూత్రాలను బాహాటంగా ఉల్లంఘించింది.
నాడు బ్రిటిష్ జైళ్లలో మగ్గిన కాంగ్రెస్ నాయకులు స్వాతంత్య్రానంతరం రాజకీయ బాధితులుగా ప్రజల గౌరవానికి పాత్రులయ్యారు. పదవులు పొందారు. ఈ రోజు కాంగ్రెస్ ఏలికల జైలులో మగ్గుతున్న జగన్ కూడా రాజకీయ బాధితుడే. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్ స్థానమేమిటో ప్రజలు తేల్చిచెప్పారు. అది జగన్ విజయం. సోనియాగాంధీ ఓటమి. అయినా సోనియా గాంధీకి జ్ఞానోదయం కలగలేదు. స్థానభ్రష్టత్వం జరగ నంత వరకు అది జరగదేమో!
కోర్టును తప్పుదోవపట్టించడమా సీబీఐ పని?
సీబీఐకి స్వతంత్రం లేదు. అది కేంద్ర ప్రభుత్వ కను సన్నల్లో మెలగాలి. అధికారపార్టీ పావుగా వ్యవహరిం చాలి. అధికారపార్టీ తమ ప్రత్యర్థుల మీద కక్షసాధింపునకు పావుగా ఉపయోగపడాలి. సీబీఐ మాజీ డెరైక్టర్ ఇదే మాట విస్పష్టంగా చెప్పాడు. ముక్కు మీద గుద్ది మరీ చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఖండించలేదు. అంటే మాజీ డెరైక్టర్ చెప్పింది నిజమనేగా! ఈ కుట్రలు, కుతంత్రాలు తెలియక జగన్‌కు బెయిల్ వస్తుందని నమ్మడంలో కొంత అమాయకత్వం ఉంది కాబోలు. రాజకీయ మంత్రాంగం లోని లోతులు తెలియక కాబోలు! మంచి వారు మంచినే ఆశిస్తారనేది తెలిసిందేకదా!
సుప్రీంలో అక్టోబర్ 5న జగన్ బెయిల్ విచారణకు వస్తుందని తెలిసి, దానికి ముందురోజు టీడీపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి అవినీతి మీద చంద్రబాబు లేఖను అందజేశారు. ఆ సాయంత్రమే ఎన్ ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జగన్ కేసులో ఉన్న వారి ఆస్తులను జప్తు చేయడానికి పూనుకున్నారు.
ఇదంతా సుప్రీంను ప్రభావితం చేయడానికి ఆడిన నాటకం. టీడీపీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన నామా నాగేశ్వరరావు అవినీతిని గురించి ఖమ్మం జిల్లా వైఎస్సార్ సీపీ నాయ కుడు పువ్వాడ అజయ్ కుమార్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. ఎంపీ నామా నాగేశ్వరరావు పెద్ద ఆర్థిక నేరగాడ న్నాడు. మన భ్రష్ట రాజకీయానికి ఇది మరో మచ్చుతునక. సీబీఐ ఆడిన మరో నాటకం అత్యంత జుగుప్సాకరం. 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక రాబోతున్నదని తెలిసి జగన్‌ను జైలులో పెట్టించిన ప్రక్రియ అది. సీబీఐ నోటీసు ప్రకారం కోర్టుకు జగన్ హాజరయ్యేది తెలిసి, కోర్టుకు హాజరైన వేళ నీతిబాహ్యంగా ఆ రాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. జగన్‌ను ప్రజలకు దూరం చేయాలనే దుష్ట తలంపు అది. కానీ, ఆ లోటును విజయమ్మ, షర్మిల దిగ్విజయంగా పూర్తిచేశారు. కాంగ్రెస్, టీడీపీలను జనం కసితో ఓడించారు. అయినా సోనియాకు జ్ఞానోదయం కలగలేదు.
సోనియాగాంధీ వరుస తప్పులు
సోనియాకు జగన్ ఫోబియా పట్టుకుంది. 156 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా జగన్ మా నాయకుడని రాసి పంపినప్పుడే అది ప్రారంభమై ఉండాలి. ఆమెగారి మాట ను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు, అది ఉధృ తమైంది. ఓదార్పునకు జనస్పందన చూసి జీర్ణించుకోలేక పోయింది. మూలకు నెట్టాలని చూసింది. ఫలితంగా జగన్‌కు పార్టీ పెట్టకతప్పలేదు. దానితో సోనియాకు మతి పోయి, వరుస తప్పులు చేస్తూ పోయింది. సీబీఐ దర్యాప్తు కోర్టు నిర్ణయమనీ దానికి ప్రభుత్వానికీ సంబంధంలేదని సీఎం కిరణ్‌కుమార్ నంగనాచిలా నటిస్తున్నాడు. డాక్టర్ శంకర్రావు చేత హైకోర్టులో పిల్ వేయించిందీ, తర్వాత శంకర్రావు మంత్రి అయిందీ బహిరంగ రహస్యమే! సోనియా ప్రమేయంతోనే పిల్ వేశానని శంకర్రావు చేసిన ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందని సామాన్యునికి కూడా అర్థమైపోయింది.
వైఎస్ మరణవార్త విని షాక్‌కు గురై 700 మంది సామాన్యులు ప్రాణాలు వదిలారు. సోనియాగాంధీ దీనిని నమ్మలేదు. కానీ, నిజాన్ని చాలాకాలం తొక్కిపెట్టలేరు గదా? ఏఐసీసీ విచారించి అది నిజమని గుర్తించింది. అలా గుర్తించకపోతే దానివల్ల కాంగ్రెస్‌కు నష్టం చాలా ఎక్కువని కూడా గుర్తించింది. బాధితులను పరామర్శించి ఒక్కొక్క రికి లక్షరూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇలా ప్రకటించి రెండేళ్లు కావచ్చినా అది కార్యరూపం ధరించ లేదు. ఆ నిర్ణయం బుట్టదాఖలా అయి ఉండాలి. ఏఐసీసీకి సోనియా బ్రేకులు వేసిందేమో! అలా చేస్తే వైఎస్ కీర్తి ఇను మడిస్తుందని ఆ నిర్ణయం నుంచి తిరోగమించి ఉండాలి!
ధర్మాన చెప్పిన మరిన్ని నిజాలు
కిరణ్ మంత్రివర్గంలోని మోపిదేవిని అరెస్టు చేసి జైల్లో బం దించారు. తాను ఏ తప్పు చేయలేదని మొరపెట్టుకున్నా కిరణ్ ఆలకించలేదు. తమ నిష్పక్షపాతాన్ని చాటుకోవడా నికి అలా చేసి ఉంటారని పత్రికలు విమర్శించాయి. అదే వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ కోర్టుకు లాగితే, కిరణ్ అతనికి రక్షణగా నిలబడ్డాడు. ఈ రోజుకూ ధర్మాన రాజీనామాను కిరణ్ ఆమోదించలేదు. ధర్మాన లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ గల్లంతే.
లేకపోతే ఒకే కేసులో ఇద్దరు మంత్రుల మధ్య ఈ వివక్ష దేనికి? సుప్రీంకోర్టు మరో నలుగురు మంత్రుల గురించి కూడా నోటీసులు ఇచ్చింది. అవి ఆగిపోవడానికి పని చేస్తున్న అజ్ఞాతశక్తులేవై ఉంటాయో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. తాను ఏ తప్పు చేయలేదని ధర్మాన చేసిన వాదన బలమైనది. మంత్రివర్గ నిర్ణయాల ప్రకారం 26 జీఓలు జారీ కావడం మామూలుగా జరిగే పనే. మంత్రివర్గ నిర్ణ యాలకు మంత్రివర్గమంతా బాధ్యులే అన్నది ధర్మాన మాట. ఈ వాదన జగన్ నిర్దోషిత్వానికి మరింత బలం చేకూర్చింది. జగన్ మంత్రి కాదు, అధికారి కాదు. తన మీద నేరారోపణ చేయడం కుట్రపూరితమేగానీ, అందులో నిజంలేదని ధర్మాన వాదన నిరూపించింది.
అధికారమే లక్ష్యంగా చంద్రబాబు పాదయాత్ర
చంద్రబాబుకు కూడా జగన్ ఫోబియా పట్టుకుంది. గత మూడేళ్లుగా జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఫలి తం ఉప ఎన్నికల్లో బాబుకు ఓటమి ఎదురైంది. టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని సర్వేలు వెల్లడించాయి. దీనితో భయం పట్టుకుని ‘డూ ఆర్ డై’ అన్న నిర్ణయానికి వచ్చి పాదయాత్ర ప్రారంభించాడు. అనితరసాధ్యమైన సంక్షే మ, అభివృద్ధి పథకాలతో జనం గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ మీద బురదచల్లడాన్ని జనం సహించలేకపోయారు. వైఎస్సార్‌సీపీ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి ఉప యోగపడేది. ఆపద మొక్కులు చంద్రబాబు మొక్కినా కాంగ్రెస్‌తో జరిపిన మ్యాచ్ ఫిక్సింగ్‌తో జనం చంద్ర బాబును నమ్మడం లేదు.
కిరణ్ సర్కార్ ఓటమిని ఏ శక్తి ఆపలేదు
కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని విధాలా జనానికి నరకం చూపిస్తున్నాయి. వంటగ్యాస్ ధరను కేంద్రం అమాంతంగా రెండింతలకు పైగా పెంచాయి. డీజిల్ ధర పెంచి ప్యాసింజర్ ఛార్జీలు, సరుకుల ధరలు పెరుగుదలకు కారణమయ్యాయి. దూరదృష్టి లోపించడంవల్ల ఏర్పడిన విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలన్నీ మూలనబడి లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ‘ఇందిరమ్మబాట’ కిరణ్ సర్కార్‌ను గట్టెక్కించలేదు. వైఎస్ పథకాలన్నీ కుంటినడక సాగిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ మూలన పడిందనే చెప్పాలి.
జగన్ వెంటే జనం
జగన్‌ను జైల్లో పెట్టి గెలుస్తామనుకున్న తోడుదొంగలను జనం మట్టికరిపించారు. వైఎస్ అనంతరం జనం సమ స్యలవలయంలో చిక్కుకున్నారు. అందుకే జగన్‌ను ముఖ్య మంత్రిగా చూడాలన్నది వారి బలమైన ఆకాంక్ష. తాజాగా మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు, సంకినేని వెంక టేశ్వరరావులు వైఎస్సార్ పార్టీకి స్వాగతం పలుకుతు న్నారు. గాలి ఎటువీస్తున్నదో సూచిస్తున్న బలమైన సంకే తాలు ఇవన్నీ.
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సందర్భోచిత ‘వాక థాన్’గా పేర్కొనవచ్చు. బాధల్లో ఉన్న జనానికి అది ఒక పరామర్శ. ఒక ఊరట. జగన్‌ను వేధిస్తున్న తీరుకు జనం హృదయవేదనను షర్మిల గళం ఆవిష్కరిస్తుంది. స్వాతి చినుకులకు ముత్యపు చిప్పలు ఎదురు చూసినట్లు జగన్ రాకకు జనం ఎదురుచూస్తున్నారు. వైఎస్ బాటను కొనసాగించడానికి అన్ని త్యాగాలకు జగన్ సిద్ధపడ్డాడు కాబట్టే అంత ప్రజాదరణ జగన్‌కు లభించింది. అతనిని ఏ శక్తీ అడ్డుకోలేదు.
No comments:
Post a Comment