మీ వెనుకే మేముంటామంటూ లక్షలాది గొంతుకల ధ్వనులు ఇడుపులపాయలో ప్రతిధ్వనించాయి. మహానేత వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరోప్రజాప్రస్థానం’కు ముక్తకంఠంతో జేజేలు పలికారు. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, వికలాంగులు అభివాదం చేస్తూ .. నాన్నను మరిపిస్తూ షర్మిల ముందుకు సాగారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అంటూ పాలక, ప్రతిపక్ష నేతలకు కలవరం పుట్టించారు. నా బిడ్డలను మీకే అప్పగిస్తున్నానని విజయమ్మ చేసిన ఉద్వేగ ప్రసంగం కంటతడిపెట్టించింది. తొలిరోజు 15 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది.
కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి : జనాలతో ఇడుపులపాయ పోటెత్తింది. దారులన్నీ ఇడుపులపాయవైపే మళ్లాయి. లక్షలాది మంది ఇడుపులపాయకు చేరుకున్నారు. మండుటెండలో లక్షలాది పాదాలు ఏకమై షర్మిల పాదయాత్రలో అడుగు వేశాయి. ఉదయం 10.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలమ్మ, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహానేత వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలుచేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆశీస్సులను షర్మిల అందుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వేదిక మీదకు చేరుకున్న వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగించారు.
తన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌ను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం షర్మిల మాట్లాడారు. ‘నేను జగన్ ఎక్కుపెట్టిన బాణాన్ని’ అనగానే అశేష జనం హర్షధ్వానాలు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుఠిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజాపక్షాన పోరాటం చేసేందుకు సామాన్య కార్యకర్తగా, జగనన్న చెల్లెలిగా, రాజన్న బిడ్డగా మీ ముందుకొస్తున్న నన్ను ఆశీర్వదించండని కోరారు. సభ అనంతరం పాదయాత్రగా ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. అక్కడ విద్యార్థులతో మాటామంతీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవస్థలను చూసి చలించిపోయారు.
తల్లడిల్లిన మాతృమూర్తి
‘ప్రజల మనిషి, జన హితుడు నా భర్త మృతి చెందారు. ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డను జైలుపాలు చేశారు. చాలా బాధగా ఉంది. జగన్ చేయాల్సిన యాత్ర ఇది. ఇంకోబిడ్డ రోడ్డుమీదికి రావాల్సి వచ్చింది’ అని గద్గద స్వరంతో వైఎస్ విజయమ్మ అనగానే సభా ప్రాంగణం మూగబోయింది. మీరంతా మా పక్షం ఉన్నారనే ధైర్యంతో నా బిడ్డను మీకప్పగిస్తున్నా. జగన్‌బాబు లాగే నా బిడ్డను మీరు ఆశీర్వదించాలని కోరడం విజయమ్మ తల్లి మనస్సుకు అద్దం పట్టింది.
చిన్నబుచ్చుకున్న సూర్యుడు
సూర్యభగవానుడు ప్రకోపించి ప్రకాశిస్తున్నాడు. అయినప్పటికీ ఇడుపులపాయకు జనం లక్షలాదిగా బారులు తీరారు. ట్రాఫిక్ స్తంభించినా నడక మార్గంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. జనపోటును చూసిన సూర్యుడు చిన్నబుచ్చుకున్నాడు. అభిమానుల ముందు తలవంచుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత సాయంత్రపు వరకూ ప్రకాశిస్తున్న సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లిపోయాడు. వాతావరణం మేఘావృతమైంది.
లక్షలాది పాదాలు కలిసిన వేళ...
ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర లక్షలాది పాదాల సవ్వడిలతో 13 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది. వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె వాసులు షర్మిలను చూసేందుకు ఆరాటపడ్డారు. పూల జల్లులు కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలించారు.
స్తంభించిన ట్రాఫిక్
ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి చేరుకోవడంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళిక చేపట్టకపోవడంతో పది కిలోమీటర్ల మేర ఆరు గంటలపాటు ట్రాఫిక్ జాం అయింది. ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసులు బందోబస్తు చేపట్టినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.
No comments:
Post a Comment