YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 20 October 2012

పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం నింపుతున్న షర్మిల పాదయాత్ర


యాత్రపై టీడీపీ, కాంగ్రెస్ నేతల్లో ఎడతెగని చర్చ

అదే పిలుపు.. అవే పలుకులు.. మహానేత వైఎస్‌ను అనుసరిస్తూ.. జననేత జగన్‌ను గుర్తు తెస్తూ సాగుతోన్న షర్మిల పాదయాత్ర అటు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. షర్మిలలో వైఎస్‌ను, జగన్‌ను చూసుకుంటూ అడుగడుగునా ‘మరో ప్రజా ప్రస్థానాని’కి జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమ కష్టాలు బయటకు కనిపించకుండా, ప్రజల కష్టాలను నింపాదిగా తెలుసుకుంటున్న షర్మిల.. ‘జగనన్న నాయకత్వంలో వచ్చే రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరుస్తాం’ అని ప్రజల గుండెతట్టి ధైర్యం చెబుతున్నారు.
పంట పాడవకుండా జాగ్రత్త: పాదయాత్ర దారిలోని పొలాల్లో రైతులు కనపడినా, కూలీలు కనిపించినా షర్మిల అడుగు పొలంవైపు వెళుతోంది. ‘ఏం పెద్దమ్మా! ఏం తాతా! చెప్పన్నా! చెప్పక్కా!’ అంటూ జగన్‌లాగా పిలుస్తూ వారి కష్టాలను ఆమె స్వయంగా తెలుసుకుంటున్నారు. తనతో పాటు పార్టీ కార్యకర్తలు పొలంలోకి వెళితే పంటకు నష్టం వాటిల్లుతుందని అందరినీ రోడ్డుపైనే ఆగమని చెప్పి.. ఆమె మాత్రమే పొలంలోకి వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఈ విషయంలో పదే పదే షర్మిల చూపుతున్న జాగ్రత్త రైతన్నలపై, వారి కష్టంపై ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.
సామాన్యుడి కష్టాలు తెలుసుకునేలా: తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలానే షర్మిల యాత్ర సాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనమైనా.. రాత్రి నిద్రఅయినా రోడ్డు పక్కన వేసిన టెంటులోనే! శుక్రవారం రాత్రి వేములలో వర్షం కురిసింది. టెంటులో వర్షం నీరు కారుతుందని, బస్సులో నిద్రపోవాలని పోలీసులతో పాటు పార్టీ నేతలు ఆమెను కోరారు. ‘వర్షం పడితే ఏమవుతుంది. ఇక్కడే నిద్రపోతా!’ అని షర్మిల తెగేసి చెప్పారు. దీంతో ఇళ్లులేని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా ప్రవర్తించారు.

సమస్యలపై దృష్టి: షర్మిల యాత్రలో ప్రజా సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో, పొలాల్లోని ప్రజలతో అధిక సమయం కేటాయిస్తూ, తక్కిన సమయంలో వేగంగా నడుస్తున్నారు. షర్మిల నడుస్తుంటే తక్కిన వారు పరుగెత్తాల్సిన స్థితి. జగన్ తప్పకుండా బయటకు వస్తారు అంటూ ఆమెకు ప్రజలు ధైర్యం చెప్తుంటే.. ‘అందరి ఆశీస్సులు జగనన్నపై ఉన్నాయి. మీ చల్లని చూపు ఉంటే త్వరలోనే జగనన్న బయటకు వస్తాడు. సీఎం అవుతాడు. మీ సమస్యలన్నీ తీరుస్తాడు’ అని షర్మిల వారికి భరోసా ఇస్తున్నారు.
పదునుగా విమర్శలు: ప్రజా సమస్యలపై షర్మిల అవగాహన, ప్రభుత్వం, ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది.

ఆమె ప్రశ్నాస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనీకుండా షర్మిల ఇరుకున పెడుతున్నారు. ‘‘చంద్రబాబును ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా! పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి వచ్చావు.. సరే! ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, మద్యపాన నిషేధం ఎత్తేసింది మీరు కాదా? ఎందుకు వాటిని ఎత్తేశారో సమాధానం చెప్పండి’ అని షర్మిల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి టీడీపీది. ‘వైఎస్ మా నాయకుడు అని చెబుతున్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. మరి ఆయన మృతివార్త విని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఎందుకు తీసుకోలేదు’ అన్న ఆమె ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి ఒక్కనాయకుడు సమాధానం చెప్పలేని పరిస్థితి.

కాంగ్రెస్, టీడీపీలో చర్చ: షర్మిల పాదయాత్రపై కాంగ్రెస్, టీడీపీ నేతల్లో తీవ్ర చర్చసాగుతోంది. షర్మిల పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చంద్రబాబు యాత్ర ఎలాసాగుతుందనే దానికంటే, షర్మిల యాత్రపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చ సాగిస్తున్నారు.
- న్యూస్‌లైన్, కడప

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!