YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 18 October 2012

రాజన్న కూతురిగా, జగనన్న చెల్లెలిగా, పార్టీ సైనికురాలిగా....


‘‘నేను జగనన్న వదిలిన బాణాన్ని... వైఎస్ కూతురిగా, జగన్ చెల్లెలిగా, వైఎస్సార్ సీపీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా. ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’
- పాదయాత్ర ప్రారంభోపన్యాసంలో షర్మిల 

* రాజన్న కూతురిగా, జగనన్న చెల్లెలిగా, పార్టీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నా
* జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి
* రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా క్షోభ పెడుతోంది
*రైతులను వేధిస్తోంది.. రాష్ట్రంలో ఘోరమైన విద్యా సంక్షోభం నెలకొంది
* ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మూడేళ్లుగా చోద్యం చూస్తోంది
* ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, దాన్ని దించేయని టీడీపీని నిలదీయడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం
*జగనన్నను జైలుకు పంపడానికి అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయి.
*ఈ కుమ్మక్కుకు నిరసనగా పాదయాత్రలో అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలి

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. ఆయన మన మధ్య ఉంటే ఎంతో కొంత సంతోషంగా ఉండేవాళ్లం. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. నేను జగనన్న వదిలిన బాణాన్ని. వైఎస్ కూతురిగా, జగన్ చెల్లెలిగా, వైఎస్సార్ సీపీ సామాన్య కార్యకర్తగా, పార్టీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా’’ అని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఉద్ఘాటించారు. గురువారం ఇడుపులపాయలో ‘మరో ప్రజా ప్రస్థా నం’ పాదయాత్ర ప్రారంభానికి ఉవ్వెత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె, జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత రాత్రి వేంపల్లెలో అడుగడుగునా నీరాజనం పలుకుతున్న అభిమానులనుద్దేశించి మరోసారి మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, అలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసంతో కూల్చేయకుండా దానితోనే కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ వైఖరిని ఆమె ఎండగట్టారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రజలకు అన్ని విధాలా క్షోభే..
నేను మీ రాజన్న కూతురుని. నేను మీ జగనన్న చెల్లెల్ని. మీ షర్మిలను. ఈ రోజు ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చా. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా క్షోభకు గురి చేస్తోంది ఈ ప్రభుత్వం. రైతులను వేధిస్తోంది. విద్యార్థులకు మొండిచేయి చూపింది. ఘోరమైన విద్యాసంక్షోభం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం మూడేళ్లుగా చోద్యం చూస్తోంది. పూర్తిగా బాధ్యతను విస్మరించింది. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రెండు హామీలను తుంగలో తొక్కారు. అవి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఒకటైతే.. సంపూర్ణ మద్యపాన నిషేధం మరొకటి. ఆరోజు మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు ఆయన పాదయాత్ర చేయాల్సి వచ్చేది కాదు. వ్యవసాయం దండగన్నారు.

తొమ్మిదేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారు. రైతులను కట్టమన్నారు. కట్టకపోతే కేసులు పెట్టారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇళ్లలో సామాను ఎత్తుకెళ్లారు. ఇంత అవమానం భరించలేక, బకాయిలు చె ల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఈరోజు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీకి గానీ, చంద్రబాబుకుగానీ చిత్తశుద్ధి ఉంటే.. ఈ చేతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదు?

రెండు ఉద్దేశాలు..
ఈ ‘మరో ప్రజా ప్రస్థానా’నికి ముఖ్య ఉద్దేశాలు రెండే. ఒకటి ఈ అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం. రెండోది ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు నిలబెడుతున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని నిలదీయడం. కేసులు పెట్టి విచారణ పేరుతో జగనన్నను జైలులోపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కేసులు లేవు. ఎందుకంటే ఆయన చీకట్లో చిదంబరంను కలిసి కేసులు లేకుండా మేనేజ్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాలూచీ పడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న చోట తెలుగుదేశం, తెలుగుదేశం గెలుస్తుందనుకున్న చోట కాంగ్రెస్ ఆ పార్టీలకు ఓట్లు వేసుకున్నాయి. మొన్నటికి మొన్న జగనన్నకు బెయిల్ వస్తుందనేసరికి ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపారు. ప్రజాసమస్యలపై కాదు. ఎందుకు పంపారో తెలుసా? జడ్జిమెంట్‌ను ప్రభావితం చేయడానికి, ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్)తో ‘సాక్షి’ని జప్తు చేయించడానికి. ప్రజా సమస్యలపై అంత త్వరగా స్పందించని కేంద్రం.. కొద్ది గంటల్లోనే ఈడీని ఉసిగొల్పి జప్తు చేయించింది. ప్రతిపక్షం, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుమ్మక్కు రాజకీయాలను నిర్వీర్యం చేయడానికి పాదయాత్రలో పాల్గొనే ప్రతి కార్యకర్త నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలి. జగనన్న బయటకు వచ్చే వరకు ఈ నల్ల బ్యాడ్జీలు కనిపించాలి.’

జగనన్న చేయాల్సిన యాత్ర..
ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. నాతో పాటు మీరంతా కదం తొక్కాలని నా ప్రార్థన. దేవుడి దీవెనలు తీసుకుని, నాన్నకు నమస్కరించి, జగనన్న ఆశీస్సులతో, మీ ప్రేమను అందుకుని ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా. ప్రతిక్షణం నాన్నను, జగనన్నను, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలను తలచుకుంటానని మాట ఇస్తున్నా. గుండెల నిండా నాన్నపై, జగనన్నపై ప్రేమతో ఇక్కడికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

30 ఏళ్ల సేవకు అవినీతి ఆరోపణలే బహుమతా?
ఒకటి కాదు..రెండు కాదు...పది కాదు...30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి నాన్న సేవ చేశాడు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకానికి ఇందిర, రాజీవ్ పేర్లే పెట్టారు. ఆ కుటుంబంపై అంతటి విశ్వాసం చూపిన నాన్నకు వాళ్లిచ్చిన గౌరవం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు, అవినీతి ఆరోపణల బహుమతి. అంతటితో ఆగకుండా ఆయనపై, కుటుంబంపై కక్షపూరిత చేష్టలు, జగన్‌ను జైలుకు పంపడం. ఇంత కంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఏ ఆధారాలూ లేకుండానే జగనన్నను జైల్లో పెట్టారు. వైఎస్ మరణం తట్టుకోలేక దాదాపు 600 మంది మృతి చెందారు. వారంతా కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలే! వారి గురించి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పట్టించుకోలేదు. చనిపోయిన వారి కుటుంబాల బాగోగులు వారికి పట్టవు. జగన్ వారి గురించి పట్టించుకుని ఓదార్చి, చేతనైన సాయం చేస్తుంటే దాన్ని ఓర్వలేకపోయారు.

ఆఖరుకు పార్టీ నుంచి వెలేసినంత పనిచేశారు. పైగా వైఎస్‌పై అభాండాలు వేశారు. వైఎస్ మరణం తర్వాత పాలకులు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలూ నిర్వీర్యం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తుంటే, మన రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? ఇలాంటి పరిస్థితుల్లో అధికారపక్షాన్ని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోంది. అయితే జగనన్న మాత్రం జైల్లో ఉండి కూడా రాష్ట్ర ప్రజల బాగు గురించే ఆలోచిస్తున్నారు. రాజన్న లాంటి పెద్దమనసు జగన్‌కు ఉంది.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!