ఇడుపులపాయ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె ఇడుపులపాయ నుంచి 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజన్న బాటలో రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు, మేమున్నామంటూ భరోసా కల్పించేందుకు ఆమె 3 వేల కి.మీ పాదయాత్ర చేయనున్నారు. దేశ చర్రితలో ఇంతవరకు ఏ మహిళ చేయని సాహస కార్యక్రమాన్ని చేపట్టారు.
వేలాదిమంది అభిమానులు వెంటరాగా షర్మిల గురువారం మహానేత వైఎస్ఆర్ కు నివాళి అర్పించి అశేష జనవాహని మధ్య ఆమె పాదయాత్రలో తొలి అడుగు వేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎక్కుపెట్టిన బాణంగా ఆమె ముందుకు కదిలారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీని ధరించి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కదనరంగంలోకి దూకారు.
అప్పుడు వైఎస్ఆర్ చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే ఆయన కుమార్తె షర్మిల ఇప్పుడు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 2003లో ప్రభుత్వ వైఫల్యాల మీద వైఎస్ఆర్ పాదయాత్ర ప్రారంభిస్తే ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ పథకాలను, ఆశయాలను, లక్ష్యాలను గాలికి వదిలేసినందుకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్నారు. రాష్ట్రంలో ఏ పాదయాత్రైనా వైఎస్ఆర్ స్ఫూర్తితో మొదలు పెట్టిందే. ఆనాడు చేవేళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఇడుపులపాయలో ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగియనుంది.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మహానేత వైఎస్ఆర్ హామీలను అటకెక్కించింది. ఆరోగ్యశ్రీని... అనారోగ్యశ్రీగా, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చటం, 108 సేవలను మూగబోయేలా చేయటం... ఇలా ఒకటేంటి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఒక్కొక్క పథకాన్ని నీరుగారుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారు. కానీ..ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచించే వైఎస్ జగన్..తనను లోపల పెట్టినంత మాత్రాన ప్రజాపోరాటం ఆగదంటూ.. సోదరి షర్మిలను ప్రజల్లోకి పంపారు.
షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఇడుపులపాయ జనసంద్రంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 'మరో ప్రజా ప్రస్థానాని'కి పూర్తి మద్దతు లభిస్తోంది. పాదయాత్ర విజయవంతం కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పూజలు, యాగాలు నిర్వహించారు.
దివంగత మహానేత వైఎస్ అడుగుజాడల్లోనే సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత ఆయన కుమార్తె షర్మిల ప్రజల్లోకి వెళ్లనుండటం సర్వత్రా ఉత్సుకత కలిగిస్తోంది. తన సోదరుడు జగన్‌ను ప్రజల మధ్య లేకుండా చేసి అక్రమంగా నిర్బంధించిన పాలకుల నీచ రాజకీయాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిరంతరం జనం మధ్యనే ఉండేలా చేసేందుకు పాదయాత్రకు సిద్ధపడిన ఒక మహిళగా షర్మిల మరో చరిత్రను సృష్టించబోతున్నారు.
2003లో తన తండ్రి రాజశేఖరరెడ్డి ప్రజాసమస్యలపై అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిద్రలేపటం కోసం ప్రజల్లోకి వెళ్లారు. ఇపుడు షర్మిల తన తండ్రి కన్నా రెట్టించిన బాధ్యతతో అధికార, ప్రతిపక్షాల కుట్రలను ఛేదించటానికి ఆయన బాటలోనే అన్న తరఫున ముందుకు వెళుతున్నారు.
No comments:
Post a Comment